You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సైనా-సింధు: బ్యాడ్మింటన్‌లో ఒకరు విప్లవం తెచ్చారు.. మరొకరు ముందుకు తీసుకెళ్తున్నారు
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
కామన్వెల్త్ క్రీడల్లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం హోరాహోరీగా తలపడిన సైనా నెహ్వాల్, పీవీ సింధు.. భారత్‌లో బ్యాడ్మింటన్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరిలో ఒకరు దేశంలో మహిళల బ్యాడ్మింటన్‌లో విప్లవం తెస్తే, మరొకరు దానిని ముందుకు తీసుకెళ్తున్నారు.
ఆదివారం గోల్డ్‌కోస్ట్(ఆస్ట్రేలియా)లో జరిగిన ఫైనల్లో సింధుపై సైనా విజయం సాధించి, పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. సింధుకు రజతం లభించింది. కామన్వెల్త్ క్రీడల్లో వీరిద్దరూ ముఖాముఖి ఆడటం ఇదే తొలిసారి.
సైనా, సింధు ఇద్దరూ ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ శిష్యరికంలోనే వేర్వేరు సమయాల్లో కెరీర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఒకే కోర్టుపై ఆడారు కూడా. సింధు కన్నా సైనా సీనియర్. సైనాకు 28 ఏళ్లు కాగా, సింధుకు 22 సంవత్సరాలు.
ఐదింటిలో నాలుగుసార్లు సైనాదే విజయం
కామన్వెల్త్ క్రీడల ఫైనల్‌తో కలిపి చూస్తే అంతర్జాతీయస్థాయిలో వీరిద్దరూ ఐదుసార్లు ముఖాముఖి తలపడ్డారు. నాలుగుసార్లు సైనా, ఒకసారి సింధు గెలుపొందారు.
2018 ఇండొనేషియా మాస్టర్స్, 2017 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్, 2014 ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్‌లలో సైనా విజయం సాధించారు. 2017 ఇండియా ఓపెన్‌లో సింధు గెలిచారు.
సైనా ప్రస్థానం
సైనా 2003లో చెక్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. సైనా తనకు 15 ఏళ్లున్నప్పుడే, తొమ్మిదిసార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన అపర్ణ పొపట్‌ను ఓడించి సత్తా చాటారు. సైనా ప్రతిభపై దేశం దృష్టి సారించింది. అనతికాలంలోనే సైనా అండర్ 19 ఛాంపియన్ అయ్యారు.
సైనా హరియాణాలో జన్మించారు. బ్యాడ్మింటన్‌లో రాణించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చేశారు.
సైనా పేరిట చాలా రికార్డులే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో భారత్ తరపున పతకం సాధించిన తొలి మహిళ ఆమే. మహిళల బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకును సాధించిన తొలి భారతీయురాలు సైనానే. సూపర్‌సిరీస్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణి కూడా ఆమే.
2010లో కామన్‌వెల్త్ క్రీడలు దిల్లీలో జరిగాయి. సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో బ్యాడ్మింటన్ ఫైనల్ నేను చూశాను. అది కామన్‌వెల్త్ క్రీడల చివరి రోజు. అప్పటికి భారత్ 99 పతకాలు సాధించింది. వందో పతకం కోసం దేశం ఎదురుచూస్తోంది. ఫైనల్ ఆడుతున్న సైనాపై విపరీతమైన ఒత్తిడి ఉంది. తొలి సెట్(19-21) ఓడిపోయిన సైనా, వరుసగా రెండు సెట్లు (23-21, 21-13) గెలిచి, పసిడిని ఒడిసి పట్టారు.
నైపుణ్యం, ఆత్మస్థైర్యం సైనా బలాలు
2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం సాధించారు. ఆమె 10 సూపర్ సిరీస్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.
అపార నైపుణ్యం, ఆత్మస్థైర్యం- సైనాకు ప్రధానమైన బలాలు. 2012లో సైనా కెరీర్ పతాకస్థాయిలో ఉందని చెప్పొచ్చు. తర్వాత పెద్ద టోర్నీల్లో కొన్ని ఘోర పరాజయాలు సైనా ప్రతిష్ఠను తగ్గించాయి. ఇంతలో తనకు సుదీర్ఘకాలం కోచ్‌గా, మార్గదర్శిగా ఉన్న గోపీచంద్‌కు కొన్ని విభేదాల కారణంగా ఆమె దూరం కావాల్సి వచ్చింది.
2016లో సైనా తీవ్రంగా గాయపడ్డారు. 2016 రియో ఒలింపిక్స్‌లో అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు.
గాయాల నుంచి సైనా క్రమంగా కోలుకొన్నారు. శిక్షణ కోసం మళ్లీ గోపీచంద్ వద్దకు వచ్చారు.
సింధు క్రమశిక్షణగల క్రీడాకారిణి
సైనాలాగే సింధు కూడా అండర్ 10, అండర్ 13, ఇతర జూనియర్ కేటగిరీ నుంచే విజయాలు సాధిస్తున్నారు. కొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నారు. 2013, 2014లలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమే. ఆ సమయంలో సైనా కూడా ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది.
2016 ఒలింపిక్స్‌లో సింధు ఫైనల్‌కు చేరుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయ్యారు. ఫైనల్లో ఓటమితో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒలింపిక్స్‌లో రజతం సింధు కెరీర్‌లో కీలక మైలురాయే.
సింధు దాదాపు ఐదు అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉంటారు. ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, పి.విజయలక్ష్మి వాలీబాల్ క్రీడాకారులు. కుటుంబ నేపథ్యం కారణంగా సింధుకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఆమె క్రమశిక్షణగల క్రీడాకారిణి.
సైనా వర్సెస్ సింధు
సైనా, సింధు ఇద్దరికీ ప్రస్తుతం గోపీచందే శిక్షణ ఇస్తున్నారు. గోపీచంద్ అకాడమీలో సైనా, సింధు కొన్నిసార్లు కలిసే సాధన చేస్తుంటారు.
వారిద్దరి ఫామ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరికొన్ని పెద్ద టోర్నీల్లోనూ వారు ముఖాముఖి తలపడే అవకాశముంది. మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా తీసుకొచ్చిన విప్లవాన్ని సింధు ముందుకు తీసుకెళ్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ భారత్‌కు శుభ సూచకం!
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)