You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ అతివాదులపై ఈ ఆరోపణలు ఇప్పటివి కాదు
- రచయిత, ప్రశాంత్ చాహల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
11 సంవత్సరాల కిందట జరిగిన హైదరాబాద్ మక్కామసీదు బాంబుపేలుళ్లకు సంబంధించిన కేసులో అయిదుగురు నిందితులను ఎన్.ఐ.ఎ.న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది.
2007 మే 18న చార్మినార్ సమీపంలోని మక్కామసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు.
మొదట్లో.. ఈ దాడుల వెనక హర్కతుల్ జమాత్ -ఎ- ఇస్లామ్ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ మూడేళ్ల తర్వాత 2010లో 'అభినవ్ భారత్' సంస్థకు చెందిన స్వామి అసీమానంద అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన దేవేంద్ర గుప్తాతోపాటు లోకేష్ శర్మ, ఆరెస్సెస్‌కు చెందిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌లను కూడా నిందితులుగా చేర్చారు.
అయితే.. సరైన సాక్ష్యాలు లేవంటూ నిందితుల్లో 5 గురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. కానీ.. అతివాద సంస్థలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు.
అజ్మీర్ షరీఫ్ పేలుళ్లు..
2007, అక్టోబర్ 11న రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో పేలుళ్లు జరిగాయి. నగరంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రాంతంలో.. ఇఫ్తార్ ముగిశాక, ఓ మోటర్‌సైకిల్‌కు అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, 17 మంది గాయపడ్డారు.
పేలుళ్లు జరిగిన మూడేళ్ల తర్వాత, ఈ దాడి గురించి అధికార పార్టీ బీజేపీ వద్ద పూర్తి సమాచారం ఉందని కాంగ్రెస్ నేత శాంతి ధరివాల్ ఆరోపించారు. కొందరు ఆరెస్సెస్ వ్యక్తులకు ఈ కేసుతో సంబంధం ఉండడంతో బీజేపీ మిన్నకుండిపోయిందన్న ఆరోపణలున్నాయి.
2017 మార్చి 8న స్పెషల్ ఎన్.ఐ.ఎ.కోర్టు.. ప్రధాన నిందితుడు అసీమానందతోపాటుగా తక్కిన 5 మందిని తగిన సాక్ష్యాలు లేవంటూ నిర్దోషులుగా విడుదల చేసింది. నిందితుల్లో ఆరెస్సెస్ 'ప్రచారక్' సునీల్ జోషి 2007లో మరణించారు. దేవేంద్ర గుప్తా, భవేష్ పాట్లే ఈ కేసులో నిందితులుగా ఉండేవారు.
సునీల్ జోషి హత్య...
2007, డిసెంబర్ 29న ఆరెస్సెస్ ప్రచారక్ సునీల్ జోషిని మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు. ఈ కేసును 2011లో ఎన్.ఐ.ఎ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కి అప్పగించారు.
ఈ కేసులో ఆరెస్సెస్‌కు చెందిన ప్రగ్యా ఠాకూర్, హర్షద్ సోలంకి, రాంచరణ్ పటేల్, వసుదేవ్ పార్మర్, ఆనందరాజ్ కటారియా, లోకేష్ శర్మ, రాజేంద్ర చౌధరి, జితేంద్ర శర్మ నిందితులు. వీరందరిపై హత్య, సాక్ష్యాలను దాయడం, ఆయుధాలు కలిగివున్న నేరం కింద కేసులు నమోదు చేశారు.
కానీ 2017 ఫిబ్రవరిలో దేవాస్ జిల్లా కోర్టు.. ఈ 8 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును దేవాస్ అదనపు న్యాయమూర్తి రాజీవ్ కుమార్ ఆప్టే వెల్లడించారు.
సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు
భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైల్లో 2007, ఫిబ్రవరి 18న పేలుడు జరిగింది. హరియాణాలోని పానిపట్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో 68 మంది మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
చనిపోయినవారిలో 16 మంది పిల్లలు, నలుగురు రైల్వే సిబ్బంది ఉన్నారు. చనిపోయినవారిలో అధికులు పాకిస్తానీయులే!
ఈ కేసును 2010 జూలై 26న ఎన్ఐఏకు అప్పగించారు. కేసులో ప్రధాన నిందితుడైన అసీమానందకు సంబంధించి తమవద్ద బలమైన ఆధారాలున్నాయని, కేసులో అసీమానంద కీలక పాత్రధారి అని అధికారులు పేర్కొన్నారు.
గుజరాత్‌లోని అక్షర్‌ధామ్ ఆలయం, జమ్మూలోని రఘునాథ దేవాలయం, వారణాసిలోని సంకట్ మోచన్ దేవాలయాల్లో జరిగిన టెర్రరిస్ట్ దాడులకు బదులుగా.. బాంబులతోనే సమాధానం చెప్పేందుకు ఈ దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్‌ను కూడా అధికారులు విచారించారు. మొదటి ఛార్జ్‌షీట్‌లో అసీమానందతోపాటు సునీల్ జోషి, రామచంద్ర కాల్సంగ్ర, సందీప్ దాన్గే, లోకేష్ శర్మల పేర్లను ప్రస్తావించారు. వీరిపై బాంబులు తయారు చేసిన ఆరోపణలు ఉన్నాయి.
ప్రధాన నిందితుడు అసీమానందను సీబీఐ అధికారులు 2010లో హరిద్వార్‌లో అరెస్టు చేశారు. నేరం ఒప్పుకున్న అసీమానందపై కేసు నమోదు చేశారు. కానీ.. అధికారుల వేధింపులకు భయపడే తాను నేరాన్ని అంగీకరించానని అసీమానంద్ తర్వాత తెలిపారు.
ఈ కేసులో విచారణ నెమ్మదిగా సాగుతోంది. అయితే.. కేసుకు సంబంధించిన 13 మంది ప్రత్యక్ష సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడానికి అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ సాక్షులందరూ పాకిస్తాన్ దేశీయులే!
మాలేగావ్ జంట పేలుళ్లు
2006 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని మాలేగావ్ జామా మసీదులో శుక్రవారం నాడు ప్రార్థనలు ముగిశాక వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 37 మంది మరణించారు.
ముంబయికి చెందిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటిఎస్) అధికారులు ఈ కేసును దర్యాప్తు చేశారు. 7 మందితో నిందితుల జాబితా సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు పాకిస్తానీయులు కూడా ఉన్నారు.
కానీ.. ఏటీఎస్ అధికారులు, సీబీఐ అధికారులు అందించిన సమాచారం తప్పులతడకగా ఉందని, ఎన్ఐఏ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఎన్ఐఏ దర్యాప్తు ముగిశాక, నలుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో లోకేష్ శర్మ, ధన్ సింగ్, మనోహర్ సింగ్, రాజేంద్ర చౌధరి ఉన్నారు.
ఈలోగా మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న మళ్లీ వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 6 మంది చనిపోగా 101 మంది గాయపడ్డారు.
రంజాన్ మాసంలో జరిగిన ఈ పేలుళ్ల కేసును మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ అధికారులు తొలుత విచారించారు.
ఈ పేలుళ్ల కోసం ఓ మోటర్‌సైకిల్‌ను ఉపయోగించారని, ఆ వాహనం సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ పేరు మీద ఉందని అధికారులు తెలిపారు.
మితవాద సంస్థపై ఆరోపణ
'భారత్ అభినవ్' మితవాద సంస్థే మాలేగావ్ పేలుళ్లకు కుట్ర చేసిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.
ఈ కేసులో కల్నల్ శ్రీకాంత్ పురోహిత్, సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌తోపాటు 7 మందిని నిందితులుగా చేర్చారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ అధికారులకు అప్పజెప్పారు.
పేలుళ్ల కోసం పేలుడు సామగ్రిని సమకూర్చింది తనేనని కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ ఓ రహస్య సమావేశంలో అంగీకరించినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
కానీ.. రాజకీయ స్వార్థం కోసమే తనను కేసులో ఇరికించారని కల్నల్ శ్రీకాంత్ కోర్టులో చెప్పారు.
2016 మే 13న ఎన్ఐఏ అధికారులు మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో నిందితులు రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ శరత్ కులకర్ణి, అజయ్ రాహిర్కార్, రాకేష్ ధావ్డే, జగదీష్ మహాత్రే, కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్, సుధాకర్ ద్వివేది అలియాస్ స్వామి దయానంద్ పాండే, సుధాకర్ చతుర్వేది, రామచంద్ర కాల్సంగ్ర, సందీప్ దాన్గే నేరం చేశారనడానికి బలమైన ఆధారాలున్నాయని అధికారులు తెలిపారు.
కానీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్, శివ్ నారాయన్ కాల్‌సంగ్ర, శ్యామ్ భావర్‌లాల్ సాహు, ప్రవీణ్ తక్కల్కి, లోకేష్ శర్మ, ధన్‌సింగ్ చౌధరిలను విచారించేందుకు వాస్తవ ఆధారాలేవీ లేవని కూడా అధికారులు తెలిపారు.
దీంతో.. 2017 ఏప్రిల్‌లో సాధ్వి ప్రగ్యా ఠాకూర్‌కు బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది కానీ, కల్నల్ శ్రీకాంత్ పురోహిత్‌కు బెయిలు నిరాకరించింది.
అయితే.. 2017 ఆగస్టులో కల్నల్ శ్రీకాంత్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో కల్నల్ శ్రీకాంత్‌కు స్వాగతం పలకడానికి మూడు సైనిక వాహనాలు వచ్చాయన్న అంశం చర్చనీయాంశమైంది.
2017 డిసెంబర్‌లో 'మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైం కంట్రోల్ లా' అధికారులు.. మాలేగావ్ వరుస పేలుళ్ల కేసు నుంచి సాధ్వి ప్రగ్యా, కల్నల్ పురోహిత్ పేర్లను మినహాయించారు. ప్రస్తుతం వీరిద్దరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం, ఐపీసీ కింద కేసు ఎదుర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)