You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#BBCNewsPopUp: మీరే సీఎం అయితే..! ఏయే సమస్యలు పరిష్కరిస్తారు?
'ఒకే ఒక్కడు' సినిమా చూశారు కదా.. అందులో హీరో ఒక రోజు పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాడు. 24 గంటల్లో రాజకీయ, పాలన వ్యవస్థను పూర్తిగా చక్కదిద్ది ప్రజల హృదయాలు గెలుచుకుంటాడు.
ఆ సినిమా చూస్తున్నంత సేపు.. 'ఒకవేళ నాకూ ఇలాంటి అవకాశం వస్తే? నేను ఏమేం చేస్తాను?' అన్న ఆలోచన రాకుండా మానదు.
సీఎంగా పనిచేస్తే అవకాశం వస్తే ఎవరు వద్దనుకుంటారు!
సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే 'బీబీసీ పాప్‌అప్' బృందం బెంగళూరు యువతతో ఒక ప్రయోగం చేసింది. 'మీరే కనుక ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు' అని ప్రశ్నించింది. కర్నాటకలోని ఏఏ సమస్యలపై దృష్టిపెడతారో వారి నుంచి తెలుసుకుంది.
అయితే, అక్కడి యువత ముఖ్యమంత్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ముందు బీబీసీ కన్నడ భాషలోనూ వార్తావిశేషాలు అందించాలంటూ కోరింది. ఇప్పటికే ఉన్న బీబీసీ హిందీకి తోడుగా గత ఏడాది బీబీసీ తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏమో! బీబీసీ కన్నడ భాషలో కూడా వార్తావిశేషాలందించే రోజు రావొచ్చు. ప్రస్తుతానికి మనం కర్నాటకలోని సమస్యల సంగతి చూద్దాం.
ఈ 'ఒక రోజు ముఖ్యమంత్రులు' ఏఏ అంశాలను ప్రస్తావించారో చదవండి.
ట్రాఫిక్
ఇది చాలాకాలంగా పట్టిపీడిస్తున్న సమస్య. ముఖ్యంగా ఆఫీసులు, కళాశాలలకు వెళ్లివచ్చే సమయాల్లో బెంగళూరు నగరంలో రద్దీ అంతాఇంతా కాదు. బెంగళూరులో సగటున ప్రతి ఒక్కరూ ఏడాదికి 240 గంటలు ట్రాఫిక్‌లో ఉంటారని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆఫీసులకు వెళ్లేవారు నగరంలో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేస్తుంటారని, దీనివల్ల ట్రాఫిక్ పెరుగుతోందని అంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే #BBCNewsPopUPలో 'ఒక రోజు ముఖ్యమంత్రి'గా ఉన్నవారంతా ఈ సమస్యను ప్రస్తావించారు.
అందరికీ అందుబాటులో ఆరోగ్యం
బెంగళూరులోని ఓ మిషనరీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న అర్చన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రినైతే అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. వైద్యం భారం కాకుండా చూస్తానని.. ముఖ్యంగా పేదలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తానని అన్నారు.
మెట్రోని సకాలంలో విస్తరించడం
బెంగళూరులో మెట్రో పనులు 2006లో మొదలయ్యాయి. కానీ, దాని విస్తరణ పనులు మాత్రం నత్తనడక నడుస్తున్నాయి. ప్రస్తుతం రెండు మార్గాల్లో నడుస్తున్న మెట్రో రైలు ప్రతిరోజూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నప్పటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించాలంటే ఈ రెండు మార్గాలు చాలవంటున్నారు నగరవాసులు. మెట్రో విస్తరణ వేగవంతం చేయాలని కోరుతున్నారు. తాము ముఖ్యమంత్రి అయితే ఆ పని చేస్తామని చెప్తున్నారు.
పాదచారులకు అనుకూలమైన రోడ్లు
#BBCNewsPopUPలో ఒక రోజు సీఎంగా ఉన్న వినయ్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని రోడ్లపై పాదచారులు, సైక్లిస్టులకు ప్రథమ ప్రాధాన్యం ఉండాలని, ఆ తరువాత పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు ప్రాధాన్యం దక్కాలని.. ఆ తరువాతే ప్రైవేటు వాహనాలకు అవకాశం ఉండాలని అన్నారు.
గుంతల్లేని రోడ్లు
బెంగళూరులో గుంతల్లేని రోడ్లు ఉండవంటున్నారు నగరవాసులు. కొన్ని చోట్లయితే ఆ గుంతలను బట్టే అదే రోడ్డో పోల్చుకోవచ్చని సరదాగానే సమస్య తీవ్రతను చెప్పుకొచ్చారు.
అడవుల ఆక్రమణ
కర్నాటకలో అడవుల నరికివేత సమస్య తీవ్రంగా ఉంది. గత 19 ఏళ్లలో ఇది అయిదు రెట్లు పెరిగిందని ఇటీవల కాగ్ నివేదిక సైతం వెల్లడించింది. ఈ సమస్యనూ పలువురు ప్రస్తావించారు.
ఎండిపోతున్న నీటివనరులు
బెంగళూరును ఒకప్పుడు తటాకాల నగరంగా పిలిచేవారు. ఇప్పుడది మండుతున్న చెరువుల నగరంగా మారిపోతోంది. నీరెండిపోయి ఖాళీ అయిన చెరువుల్లో చెత్తాచెదారం పోగవడం, అవి తగలబడడం ఇక్కడ సాధారణమైపోయింది. అలాగే నీటివనరుల్లో కాలుష్యం పొంగిపొర్లడమూ ఇక్కడ సాధారణమే.
స్కూళ్లలో ఇంగ్లిష్ తగ్గాలి..
దక్షిణ భారతదేశంలో చాలాచోట్ల ఇంగ్లిష్ వచ్చినవారు ఉన్నప్పటికీ తమ మాతృభాషలను ఇంగ్లిష్ కనుమరుగు చేసే పరిస్థితిని ఇష్టపడబోమని చెప్పారు. తాను కనుక ముఖ్యమంత్రి అయితే స్కూళ్లలో ఇంగ్లిష్‌కు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వకుండా చూస్తానని.. స్థానిక భాషల ఉనికి కాపాడతానని ఓ యువతి చెప్పారు.
బెంగళూరు నగరవాసులు ప్రస్తావించిన సమస్యలపై బీబీసీ పాప్‌అప్ బృందం కథనాలు అందిస్తుంది. మా పాప్ అప్ కార్యక్రమాలకు రాలేకపోయినవారు కూడా తమ ఆలోచనలను #BBCNewsPopUp, #KarnatakaElection2018 హ్యాష్ ట్యాగ్‌లు ఉపయోగిస్తూ మా సోషల్ మీడియా పేజీల ద్వారా మాతో పంచుకోవచ్చు. ఇంకెందుకాలస్యం.. స్పందించండి. మీరు చెప్పే కథనం బీబీసీలో వస్తుంది.
ఇవి కూడా చదవండి
- #BBCShe: రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- #BBCShe విశాఖ: మా డిగ్రీలు కేవలం పెళ్లి కోసమే!
- #BBCShe: అబ్బాయిగా జీవించడం ఎంత కష్టమో!
- #BBCShe: పెళ్లి కోసం యువకుల కిడ్నాప్
- #BBCShe: తెల్లటి మోడల్సే ఎందుకు? తమిళ యువతుల సూటి ప్రశ్న?
- #BBCShe: ‘‘ఎడ్ల దగ్గరకు వెళ్లినపుడు వాటితో మాట్లాడుతుంటా’’
- #BBCShe: వాళ్ల నాన్నే ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదు కదా?
- #BBCShe: 'డ్రగ్స్‌కు డబ్బుల కోసం కొడుకును తీసుకెళ్లి బిచ్చమెత్తుకున్నా'
- #BBCShe: ‘జర్నలిజం కోర్సుల్లో అమ్మాయిలు ఎక్కువ.. ఉద్యోగాల్లో మాత్రం తక్కువ’
- #BBCShe విశాఖ: పుష్పవతి అయితే అంత ఆర్భాటం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)