You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అభిప్రాయం: రాజీవ్ విఫలమైన చోట రాహుల్ సఫలం అవుతారా?
- రచయిత, రషీద్ కిద్వాయ్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్
కాంగ్రెస్ విధానాలలో సంస్థాగత మార్పులు తీసుకొస్తామని గతంలో రాజీవ్ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో ప్రస్తావించారు.
అయితే రాజీవ్ విఫలమైన ఈ అంశంలో రాహుల్ సఫలం కాగలరా?
పార్టీలో కీలక నేతలు, సాధారణ కార్యకర్తల మధ్య ఉన్న అడ్డును రాహుల్ తొలగించగలరా?
తాము అధికారంలోకి వస్తే దేశంలో రైతులు, యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ చెబుతున్నారు.
అయితే అంతకు ముందు ఆయన తన పార్టీలో వృద్ధ నేతలను పూర్తిగా పక్కన పెట్టకుండా యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.
ఇది చెప్పడానికి సులభంగా ఉన్నా ఆచరణలో అంత సులభం కాదు.
రాహుల్ ప్రస్తుతం పార్టీలో సంస్థాగత ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతున్నారు. అయితే .. తాజాగా సీడబ్ల్యూసీలో 24 స్థానాలనూ నామినేటెడ్ రూపంలో భర్తీ చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం జరుగుతున్న 84వ ప్లీనరీలో పార్టీ అధినేత సోనియాగాంధీ.. రాహుల్ మధ్య 'జుగల్ బందీ' నడుస్తోంది.
ఇది 2019వరకు కొనసాగుతుంది కూడా.
ఇది కాంగ్రెస్ నేతలకు, ఎన్డీయేతర పక్షాలకు కూడా శుభవార్తే.
ఎందుకంటే.. గతంలో పదవీవిరమణ చేయాలనుకున్న సోనియాగాంధీ.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తున్నారు.
ఒక తల్లిగా ఆమె రాహుల్ విజయాన్ని కోరుకుంటున్నారు. మరోవైపు సోనియా ఫ్యాక్టర్ .. డీఎంకే, ఆర్జేడీ, తృణమూల్, ఎన్సీపీ, ఎస్పీ, బీస్పీ, వామపక్షాలు, ఇతర పార్టీలను ఒక తాటిపైకి తీసుకురాగలదని నమ్ముతున్నారు.
సోనియా ఫ్యాక్టర్ లేకుంటే.. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్, కరుణానిధి, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతల మధ్య ఆధిపత్య పోరు రావడం సహజం.
1975 - 77లో జయప్రకాశ్ నారాయణ్, 1989లో వీపీ సింగ్, తర్వాత హర్‌కిషన్ సింగ్ సుర్జీత్‌ల లాగా ఆమెకు వైరి పక్షాలను ఏకతాటిపైకి తేగల సత్తా, ఆమోదం, గౌరవం ఉంది.
ఇక రాహుల్, సోనియా అధికారం కోసం పాకులాడేవారు కాదని అర్థమవుతుంది.
ఎందుకంటే.. 2004 నుంచి 2014 వరకు సోనియాగాంధీ ప్రధాని కాకున్నా అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నారు. అలాగే రాహుల్ కూడా మన్మోహన్ సింగ్ హయాంలో మంత్రి పదవి ఇస్తామన్నా తిరస్కరించారు.
48 ఏళ్ల వయసు వచ్చినా రాహుల్ ఇప్పటికీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం కోసం ఆరాటపడటం లేదు.
మోదీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించేందుకు రాహుల్ ఆసక్తిగా లేకపోవడం కాంగ్రెస్‌కు అతిపెద్ద అవరోధంగా చెప్పొచ్చు.
నేను ఇటీవల రాసిన పుస్తకం 'బ్యాలెట్ - టెన్ ఎపిసోడ్స్ దట్ హ్యావ్ షేప్‌డ్ ఇండియాస్ డెమోక్రసీ'లో వివరించినట్టుగా స్వతంత్ర భారత దేశంలో 1951-52 ఎన్నికలు మొదలుకుని ఇప్పటి వరకు అన్ని లోక్‌సభ ఎన్నికల్లో నాయకుల వ్యక్తిగత జనాదరణే కీలక పాత్ర పోషించింది.
1951- 52, 1957 , 1962 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సాధనం నెహ్రూనే.
అనంతరం 1984 వరకూ ఇందిరాగాంధీ కీలక పాత్ర పోషించారు.
రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, సోనియా గాంధీలూ అదే కోవలోకి వస్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్‌తో సహా, విపక్షాలలో మోదీకి కౌంటర్ ఇచ్చే స్థాయిలో ఎవరూ కనిపించడంలేదు. 2019 ఎన్నికల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించనుంది.
రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో సోషలిస్టులు, వెనకబడిన తరగతుల వారు సంఘటితం అవుతున్నారని గ్రహించిన ఇందిరా గాంధీ, ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తన జండర్‌ను, మూలాలను అస్త్రాలుగా వాడుకున్నారు.
1967 జనవరి 20న రాయబరేలీలో ఇందిరా గాంధీ తన ప్రసంగం ద్వారా తనను తాను ఓ శక్తిగా, మదర్ ఇండియాగా సంబోధించుకున్నారు.
యావత్ దేశం తన కుటుంబమని, దేశ ప్రజల కష్టాలను ఎలా తన భుజాలపై వేసుకుంటానో ఆమె వివరించారు.
అదే సమయంలో జైపూర్‌లో జరిగిన సభలో మాజీ రాజకుటుంబం మీద, మహారాణి గాయత్రీ దేవి మీద ఇందిర విమర్శల బాణాలు వదిలారు.
గాయత్రి దేవి 1962లో లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు.
అందమైన రాణిగా పేరొందిన గాయత్రి దేవి, ఇందిరా గాంధీకి పోటీ ఇచ్చేది తానేనని చెప్పుకునేవారు. స్వంతంత్ర పార్టీని స్థాపించారు కూడా.
కొన్ని దశాబ్దాల తర్వాత.. మోదీ కాంగ్రెస్‌ను ఎదుర్కొనడానికి తన చాయ్‌వాలా మూలాలను తెరపైకి తెచ్చారు.
ఈ విషయంలో మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు మోదీకి బాగా కలిసొచ్చాయి.
మరోవైపు తాజా ప్లీనరీలో చాలా అంశాలు కీలకంగా మారాయి..
వేదికపై కాంగ్రెస్, ఆ పార్టీ చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బ్యానర్లు ఏమీ లేవు.
సీనియర్ నాయకులను కూడా వేదికపై కూర్చోవడానికి అనుమతించలేదు.
ఈ సీట్ల ఏర్పాటు చూస్తే.. రాహుల్‌కి ఇప్పుడు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతుంది.
ఈ సంస్కరణలు గతంలో వృద్ధనేతల నాయకత్వ తీరుకు భిన్నంగా ఉన్నాయి.
ఇందులో భాగంగానే రాహుల్‌కు సీడబ్ల్యూసీలో 24 పోస్టులనూ భర్తీ చేసే అధికారం లభించింది.
అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కీలక, సిద్ధాంతపరమైన అంశాలు, పార్టీలో వైరుధ్యాలు, సీఎం అభ్యర్థులు, ఇతర అంశాలపై చర్చించకపోవడం విచారకరం.
ఎన్నికల్లో ఈవీఎంలను వ్యతిరేకించడం.. మళ్లీ బ్యాలెట్ పేపర్ కోసం పట్టుబట్టాలని నిర్ణయించడం తదితర చర్యలు మమతా బెనర్జీ, మాయావతి వంటి నేతలను సంతోషపెట్టవచ్చు.
అయితే కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ ఈవీఎంలు వాడాలా వద్దా అన్న అంశంపై ముందుగా రాష్ట్రాలు, నగరాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)