You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆరోపణలు రుజువైతే షమీకి పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశం
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీపై ఆయన భార్య చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు ఆయనపై గృహహింస కింద కేసు నమోదు చేశారు.
షమీ భార్య హసీన్ జహాన్ ఆయనకు వివాహేతర సంబంధాలున్నాయని, తనను హింసిస్తుంటారని ఆరోపిస్తున్నారు.
అయితే షమీ తన భార్య చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.
2012 నుంచి షమీ ఇప్పటివరకు అన్ని రకాల ఫార్మాట్లలో 87 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. షమీపై నమోదైన ఆరోపణలు నిరూపితమైతే ఆయనకు 10 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
షమీపై ఆరోపణలేమిటి?
మంగళవారం హసీన్, షమీ తన నాలుగేళ్ల వైవాహిక జీవితంలో పలువురు మహిళలకు పంపిన మెసేజ్‌లను ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
షమీకి అనేక మందితో సంబంధాలున్నాయని, వాటిని కొనసాగిస్తున్నారని తెలిపారు.
షమీ సోదరుడు తనపై అత్యాచార యత్నం చేశాడని కూడా హసీన్ ఫిర్యాదు చేశారు.
ఆమె ఆరోపణలను ఖండించిన షమీ.. ఇది తనను అపఖ్యాతి పాలు చేయడానికి జరుగుతున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు.
''నాపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం'' అంటూ షమీ ట్వీట్ చేశారు.
భారత క్రికెట్ బోర్డు ఏమంటోంది?
బీసీసీఐ మానిటరింగ్ కమిటీ షమీపై ఆరోపణలు తమను ఇరకాటంలో పడేశాయని పేర్కొంది.
కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్, క్రికెట్ వెబ్ సైట్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో తో, ''వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం రెండూ వేర్వేరు. అయితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మీరు ఇంకా ఎలా రివార్డులు ఇస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.