You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ నేపాలీ కుర్రాడి గూగ్లీ ఆ దేశ క్రికెట్ దశను మార్చేస్తుందా?
- రచయిత, నిరంజన్ రాజ్‌బన్షీ
- హోదా, బీబీసీ నేపాలీ
నేపాల్ సంచలనం 17 ఏళ్ల లెగ్ స్పిన్నర్ సందీప్ లామిఛానె ఐపీఎల్ వరకు చేరుకున్న తీరు ఆ దేశ క్రికెట్‌కు సంబంధించి ఓ విజయగాథగా మారింది.
రెండేళ్ల కిందటి వరకు అతని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేపాల్ క్రికెట్‌లో అతని పేరు ఓ ప్రభంజనం.
ప్రస్తుతం సందీప్ సారథ్యంలోనే అండర్-19 నేపాల్ క్రికెట్ ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ హాంకాంగ్ బ్లిడ్ట్ టోర్నమెంట్‌లోనూ సందీప్ మెరిశాడు.
అక్కడే సందీప్ బౌలింగ్ శైలి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ క్లార్క్‌ను ముగ్ధున్ని చేసింది. అప్పటి నుంచి సందీప్‌కు మార్గదర్శిగా ఉంటూ, అతని ఎదుగుదలలో క్లార్క్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
త్వరలో ఐపీఎల్‌లో దిల్లీ డేర్ డెవిల్స్ తరఫున సందీప్ ఆడనున్నాడు.
గతేడాది అండర్ -19 వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సందీప్ హ్యాట్రిక్ సాధించాడు. అప్పటి నుంచి స్వదేశంలో అతన్ని 'షేన్ వార్న్' ఆఫ్ నేపాల్‌గా పిలుస్తున్నారు.
లెగ్ బ్రేక్ గూగ్లీలు వేయడం సందీప్ బౌలింగ్‌లోని ప్రత్యేకత. అతని బౌలింగ్ నైపుణ్యం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్‌ను కూడా ఆకట్టుకుంది. వీటన్నింటి ఫలితమే చివరకు సందీప్‌ను ఐపీఎల్‌కు ఎంపిక చేశాయి.
ఐసీసీ అనుబంధ దేశాల నుంచి మొట్టమొదటిసారిగా ఐపీఎల్‌కు ఎంపికైన వ్యక్తిగా సందీప్ చరిత్ర సృష్టించారు. సందీప్ ఐపీఎల్‌కు ఎంపికవడం నేపాల్‌లో పెద్ద వార్తగా మారింది. అక్కడ క్రికెట్‌ను అభిమానించే వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. సోషల్ మీడియాలో సందీప్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
''శుభాకాంక్షలు సందీప్, నేనే కాదు దేశం మొత్తం నిన్ను చూసి గర్విస్తోంది'' అంటూ నేపాల్ ప్రధాని బహుదూర్ దేవ్‌బా కూడా సందీప్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
నేపాల్ జాతీయ క్రికెట్ అసోసియేషన్‌ను ఐసీసీ సస్పెండ్ చేసిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో 2 ఏళ్ల నుంచి పూర్తిగా స్తబ్దత నెలకొంది. అలాంటి విపత్కర పరిస్థితిలో సందీప్ తన ఆటతీరుతో ఐపీఎల్‌కు ఎంపికవడం నేపాలీ క్రికెట్‌కు ఊపిరి పోసినట్లైంది.
సందీప్ ఐపీఎల్‌కు ఎంపికైన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ దశ మారుతుందని అక్కడి క్రికెట్ అధికారులు ఆశిస్తున్నారు.
''సందీప్ కేవలం ఒక ఉదహారణ మాత్రమే. నేపాల్‌లో సామర్థ్యం, నైపుణ్యం ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అతని విజయం దేశంలోని యువ క్రికెటర్లకు ప్రేరణనిస్తుంది'' అని నేపాల్ క్రికెట్ జట్టు మాజీ శిక్షకులు రాజు బస్నెట్ అన్నారు.
సందీప్ నేపథ్యం ఏంటీ?
సందీప్‌ది పశ్చిమ నేపాల్‌లోని కొండప్రాంతమైన శాంగ్జా జిల్లా. తండ్రి భారతీయ రైల్వేలో పని చేయడంతో సందీప్ భారత్‌లోనే పుట్టిపెరిగారు. ఇక్కడే క్రికెట్‌లో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు.
ఆ తర్వాత తండ్రితో పాటు అతను నేపాల్‌కు వెళ్లాల్సి వచ్చింది.
తాను ఉండే ప్రాంతం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉండే క్రికెట్ అకాడమీలో సాధన చేస్తూ సందీప్ క్రికెట్ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకున్నాడు.
''తీవ్రంగా సాధన చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోడానికి సందీప్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు'' అని అతని శిక్షకులు రాజు ఖడ్కా అన్నారు.
తర్వాత ఏంటి?
దిల్లీ డేర్ డెవిల్స్ సందీప్‌ను ఎంపిక చేసుకుంది. కానీ, అతనితో పాటు జట్టులో మరో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఉన్నాడు. ఆయనను డేర్ డెవిల్స్ రూ. 4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే, తుది జట్టులో అమిత్‌ను కాదని సందీప్‌కు అవకాశం కల్పిస్తారా? ఇప్పుడు నేపాల్‌లో ఇదే చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై సందీప్ బీబీసీతో మాట్లాడుతూ, ''తుది జట్టులో ఉంటానా లేదా అనేది ఆలోచించడం లేదు. జట్టుకు ఏది అవసరమో అదే కావాలి. జట్టులోని సభ్యుడిగా నా వంతు సహాయం ఏ విధంగానైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా'' అని పేర్కొన్నారు.
''నిజంగా నేను అదృష్టవంతున్ని. నా మీద పెద్ద బాధ్యత ఉందని తెలుసు. నా ప్రదర్శన మరింత మంది నేపాలీ క్రికెటర్లకు ప్రేరణగా ఉండొచ్చు. నేపాల్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదని ప్రపంచానికి తెలుస్తుంది'' అని సందీప్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)