అతడికి వినిపించకపోయినా.. అందరూ వినేలా చెబుతాడు

ఓ మంచి పని చేయడానికి తన వైకల్యం ఏమాత్రం అడ్డంకి కాదంటున్నాడు వీరమణి. మైమ్ కళే సాధనంగా మూడేళ్లుగా అతడు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాడు.

తమిళనాడుకు చెందిన వీరమణి శేఖర్ పుట్టుకతోనే బధిరుడు.

ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే అతడు వారాంతాల్లో క్రమం తప్పకుండా చెన్నై జంక్షన్‌ల దగ్గర కనిపిస్తాడు.

క్లౌన్‌లా మేకప్ వేసుకొని వాహనదార్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తాడు.

'ఓసారి నా కూతురూ, నేనూ బైక్ మీద వెళ్లేప్పుడు యాక్సిడెంట్ అయింది. దాంతో కాస్త భయమేసింది. అదృష్టం కొద్దీ మాకేం కాలేదు. అప్పట్నుంచీ జీవితం ఎంత విలువైందో వివరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నా' అంటాడు వీరమణి

అతడు తన మైమ్ ద్వారా వాహనదార్లని నవ్విస్తూనే వాళ్లలో ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు.

యాక్సిడెంట్ ఫ్రీ నేషన్ అనే సంస్థకు అతడు వలంటీర్‌గా ఉన్నాడు.

'యాక్టింగ్ ద్వారా వీరమణి చేసే క్యాంపైన్ ప్రజలకు సులువుగా చేరువవుతుంది. అతడు బధిరుడు కావడంతో వాహనాల శబ్దాలు వినిపించవు. అందుకే మేం అతడి భద్రతపైనా దృష్టిపెట్టాలి' అంటారు యాక్సిడెంట్ ఫ్రీ నేషన్ కన్వీనర్ రాధాకృష్ణన్.

ఆరేళ్లపాటు వీరమణి మైమ్ ఆర్ట్ నేర్చుకున్నాడు. స్కూళ్లూ కాలేజీల్లో తరచూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

'వీరమణి పుట్టుకతోనే బధిరుడన్న విషయం మొదట్లో నాకు తెలీదు. అతడు ఏ విషయమైనా త్వరగా నేర్చుకుంటాడు. అందుకే అతడికి మైమ్ నేర్పడం సులువైంది' అంటారు గోపి. ఆయన సినిమాల్లో నటించడంతో పాటు మైమ్ టీచర్‌గానూ సేవలందిస్తున్నారు.

దివ్యాంగులైనా సరే సమాజంలో మార్పు తేవడానికి ఎంతో కొంత ప్రయత్నించాలన్నది వీరమణి మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)