ఇప్పుడు 'జ్ఞానం'తో ఇబ్బంది లేదు! బగ్‌ను ఫిక్స్ చేసిన ఆపిల్!

ఆపిల్ ఫోన్‌లో ఇక 'జ్ఞ' అక్షరాన్ని హాయిగా రాసుకోవచ్చు.

ఈమధ్య కాలంలో 'జ్ఞ' అక్షరాన్ని టైప్ చేయగానే ఆపిల్ ఫోన్ల పనితీరు స్తంభించింది. ఆపిల్ పరికరాలను ఇబ్బంది పెడుతోన్న 'టెక్స్ట్ బాంబ్' సిరీస్‌లో ఈ బగ్ ఓ తాజా సమస్య. కానీ ఈ సమస్యను ఆపిల్ అధిగమించింది.

కొందరు వ్యక్తులు ఈ అక్షరాన్ని ఉపయోగించి ఆపిల్ ఫోన్లు, సోషల్ మీడియా, ప్రైవేట్ మెసేజెస్‌తోపాటు ఉబర్ యాప్‌లో కూడా సమస్యను సృష్టించారు.

ఈ నేపథ్యంలో ఆపిల్ సంస్థ.. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆపిల్ ఫోన్లు, ఐపాడ్లు, మ్యాక్ కంప్యూటర్లు, స్మార్ట్ వాచ్‌లు, టీవీ సెట్ టాప్ బాక్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇలాంటి ఇబ్బందులు ఆపిల్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సమస్యలను ఆపిల్ ఎదుర్కొంది.

అందులో...

  • ఆపిల్ మెసేజ్ యాప్‌లో.. ఓ లింక్‌ను టైప్ చేయగానే ఫోన్లు స్తంభించిపోయేవి లేదా రీస్టార్ట్ అయ్యేవి.
  • వైట్ ఫ్లాగ్, సున్నా, హరివిల్లు ఎమోజీలు లాంటి బొమ్మలు, అంకెలు ఉన్న మెసేజ్‌లు వస్తే.. వెంటనే ఇలాంటి సమస్యే తలెత్తేది.
  • అరబిక్‌ లిపిలో ఉంటూ ఏ అర్థమూ లేని ఓ పదం కూడా గతంలో సమస్యలు సృష్టించింది.

'ది అలోహా మొబైల్ వెబ్ బ్రౌజర్'కు చెందిన డెవలపర్లు మొదటిసారిగా ఈ సమస్యను ఫిబ్రవరి 12న వెలుగులోకి తెచ్చారు.

ఆపిల్ ఫోన్‌లోని మెసేజ్ యాప్‌తోపాటు థర్డ్ పార్టీ సర్వీసులైన వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, ట్విటర్, ఔట్‌లుక్, జీమెయిల్‌లపై ఈ బగ్ ప్రభావం చూపింది. కానీ టెలిగ్రామ్, స్కైప్ యాప్‌లపై బగ్ ప్రభావం లేదని 'వర్జ్' న్యూస్ సైట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)