You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్‌లో రాణిస్తున్న అమ్మాయిలు
ఇక్కడ కనిపిస్తున్న వారంతా దివ్యాంగులే. కానీ, ఆ వైక్యలం వారిలోని ఆత్మవిశ్వాసాన్ని, క్రీడలపై ఉన్న ఆసక్తిని ఏమాత్రం కదిలించలేకపోయింది. ఈ అమ్మాయిలు బాస్కెట్ బాల్ క్రీడాకారిణులు.
2018 మార్చిలో థాయ్‌లాండ్‌లో జరగనున్న ఏషియన్ పారా గేమ్స్‌లో భారత్ తరపున పాల్గొనేందుకు చెన్నైలో సన్నద్ధమవుతున్నారు.
సాధారణంగా బాస్కెట్ బాల్ అంటే పైకి ఎగరాల్సి ఉంటుందని, వేగంగా పరిగెత్తాల్సి ఉంటుందని అందరూ అనుకుంటారు. మరి వీళ్లు చక్రాల కుర్చీలోంచి ఎలా ఆడతారు? వీరి ఆట ఎంత రసవత్తరంగా ఉంటుంది?
ఈ బృందంతో ఫొటో జర్నలిస్టు హరి అడివరేకర్ కొద్ది రోజులు గడిపారు.
అంతర్జాతీయ పారా టోర్నమెంటులో భారత బాస్కెట్ బాల్ బృందం పోటీపడటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఇండోనేషియాలో జరిగే ఫైనల్స్‌కు వెళ్లగలిగితే, 2020 పారాలింపిక్స్‌కి అర్హత లభిస్తుంది.
రోజూ ఏడు గంటల చొప్పున తొమ్మిది రోజుల పాటు చెన్నైలో సాధన చేశారు.
వేగంగా కదలాలంటే చక్రాలను బలంగా తిప్పాలి. దాంతో.. చక్రాలకు ఉండే రబ్బరు మరకలు అంటి అర చేతులు ఇలా నల్లగా మారిపోతాయి.
16 ఏళ్ల రేఖ (ఎడమ వైపు ఉన్న అమ్మాయి), భారత బృందంలో తక్కువ వయసున్న క్రీడాకారిణి.
మూడేళ్ల ప్రాయంలో ఈమె వైకల్యం బారిన పడ్డారు. కానీ, మూడేళ్ల క్రితం నుంచే వీల్‌ఛైర్ వాడుతున్నారు. టీంలో అత్యంత వేగవంతమైన క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్నారు.
"తలచుకుంటే మనకు అసాధ్యమనేది ఏదీ లేదు" అని అంటారీమె.
68 ఏళ్ల ఆంథోనీ పెరీరియా, భారత మిలిటరీలో పనిచేసిన మాజీ ఇంజనీర్. ఇప్పుడు వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ పురుషులు, మహిళల టీంలకు కోచ్‌గా పనిచేస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో గాయపడి వికలాంగుడిగా మారిన ఆయన, 1971 నుంచి పారా అథ్లెట్‌గా కొనసాగుతున్నారు.
"వైకల్యం బారిన పడ్డాక ఏదైనా ఓ మంచి పని చేయాలని అనుకున్నా. వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ ఆడటం ప్రారంభించాను. వయసు పెరిగాక నాలాంటి వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇప్పుడు కోచ్‌గా మారి శిక్షణ ఇస్తున్నాను" అని ఆంథోనీ తెలిపారు.
గతంలో భారత్‌లో వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ గురించి చాలా మందికి తెలిసేది కాదు. 2014లోనే భారత వీల్‌ఛైర్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఏర్పడింది.
ఈ క్రీడ తనకు జీవితాన్నిచ్చింది అని అంటారు ఫెడరేషన్ అధ్యక్షురాలు మాధవీలత. ఈ ఆట గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె చెబుతున్నారు.
అవగాహనలేమి కారణంగా తమకు ఆర్థిక సాయం పొందడం కష్టమవుతోందని అంటున్నారు.
థాయ్‌లాండ్ వెళ్లేందుకు 15 మంది సభ్యులకు విమాన టికెట్ల కోసం నాలుగున్నర లక్షల రూపాయలు సేకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
బాస్కెట్‌బాల్‌లో భారత్ తరఫున ఆడేందుకు వెళ్తుండటం చాలా ఆనందంగా ఉందని క్రీడాకారిణులు అంటున్నారు. క్రీడాకారులుగా ఏ సవాల్ అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
వీళ్లు ఎక్కడికైనా వీల్‌ఛైర్‌లోనే వెళ్లాలి. కానీ, ప్రాక్టీస్ చేసే చోట అందుకు అనుగుణంగా సదుపాయాలు లేవు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సౌకర్యాలు కల్పించడం ఫెడరేషన్‌కు కష్టంగా మారింది.
ఆట కోసం ఖరీదైన ప్రత్యేక చక్రాల కుర్చీలను, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
హిమ కల్యాణి (ఎడమ), మనీషా పాటిల్ (కుడి) ఇద్దరిదీ కర్ణాటక రాష్ట్రం. రోజూ హాస్టల్ నుంచి బాస్కెట్‌బాల్ కోర్ట్ వరకు కిలోమీటర్ దూరం ఈ కుర్చీలోనే వెళ్తారు.
మ్యాన్‌హోల్స్, ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు ఎదురవుతాయి.
2016 లెక్కల ప్రకారం, భారత్‌లో దాదాపు 21 లక్షల మంది మహిళా వికలాంగులు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
34 ఏళ్ల కార్తికి పటేల్ (కెమెరా వైపు చూస్తున్న క్రీడాకారిణి) ఈ బృందానికి సారథి. 2008లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఈమె వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది.
’’ఆ ప్రమాదానికి ముందు నేను బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. అయితే, అప్పట్లో ఆడటం ప్రారంభించినప్పుడు చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు. దాంతో, బ్యాడ్మింటన్ వైపు వెళ్లాను. ఇప్పుడు మళ్లీ బాస్కెట్ బాల్ ఎంచుకున్నా" అని కార్తికి తెలిపారు.
మిగతా క్రీడాకారులు, నిర్వాహకులు, కోచ్‌లు అందరూ వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా గడుపుతారు? వంటి విషయాలను వివరించారు.
కార్తికి పటేల్ మాత్రం తనకు మంచి వీల్‌ఛైర్ అవసరం ఉందని అన్నారు.
హరి అడివరేకర్ ముంబయి, బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఫొటో జర్నలిస్టు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)