You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బడ్జెట్ సమావేశాలు: వ్యూహాలు, ప్రతివ్యూహాలు
సోమవారం ఉదయం 11 గంటలకు భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి.
రెండు దశల్లో సాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో మొదటి దశ ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతుంది. ఈ దశలో ప్రభుత్వం సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
మధ్యంతర సెలవు తర్వాత రెండో దశ మార్చి 5న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది.
ఓ రకంగా చెప్పాలంటే, 16వ లోక్‌సభలో ఇది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి సంపూర్ణ బడ్జెట్ అవుతుంది. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయనేది తెలిసిందే.
హామీలు పూర్తి చేయాలనే ఒత్తిడి
ఈ కారణం వల్లనే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చూరగొనాలనే ఒత్తిడి ఉన్నట్టు భావిస్తున్నారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచించవచ్చని అంటున్నారు.
"అరుణ్ జైట్లీ, ఆయన బృందం మొత్తం బడ్జెట్ కోసం సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అవన్నీ నెరవేరుస్తామని అనుకుంటున్నాం" బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు నోట్ల రద్దు, జీఎస్టీ, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి అంశాలను విపక్షాలు అస్త్రాలుగా మలచుకుంటాయనడంలో అనుమానం లేదు.
కాంగ్రెస్ దూకుడు పెంచుతుందా?
శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా కనిపించింది. ప్రభుత్వంపై దాడి చేసేందుకు దొరికిన ఏ అవకాశాన్నీ వదిలేది లేదన్న సంకేతాలను కాంగ్రెస్ ఇచ్చింది.
"కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనవసర రాద్ధాంతాలు చేస్తుంది. అన్ని సమావేశాల్లోనూ ఆ పార్టీ వ్యవహారశైలి అలాగే ఉంటుంది. వాళ్ల ఆలోచన చర్చ జరగాలన్నది కాదు. సభను నడవకుండా చేయడమే వారికి కావాల్సింది" అని షానవాజ్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతోంది.
ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వ తన హామీలను నెరవేర్చలేదు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
"ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. సామాన్య ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. వ్యాపారవేత్తలను కాకుండా ఈ సారి అయినా మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచిస్తుందని అనుకుంటున్నాం" అని కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ అన్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)