You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'పారిపోయే దారిలేక మంటల్లో 17మంది సజీవదహనం'
దిల్లీ బావన పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో 20మందికి గాయాలు అయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
శనివారం రాత్రి దిల్లీ శివారులోని బావన పారిశ్రామిక వాడలోని ఒక కర్మాగారంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.
1999లో లాల్ ఖాన్ రసాయన మార్కెట్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో 57 మంది చనిపోయారు.
ఆ తర్వాత దిల్లీలో అలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.
మంటలు చెలరేగిన సమయంలో 30మంది కార్మికులు ఉన్నారు.
మంటల్ని చూసిన కార్మికులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
కానీ 2 అంతస్తుల భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఒకే ఒక దారి ఉంది.
ఈ భవనం బేస్‌మెంట్‌లో బాణాసంచా నిల్వ చేశారు.
మంటలు క్రమంగా బేస్‌మెంట్‌ను చేరడంతో బాణాసంచా మొత్తం పేలిపోయింది.
ఈ కారణంగా కార్మికులు సకాలంలో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
రెండో అంతస్తు నుంచి కిందికి దూకిన మహిళ
మృతదేహాలను బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
రెండు రోజుల క్రితమే పనిలో చేసిన సీతాదేవి అనే మహిళ మంటలను తప్పించుకునేందుకు రెండో అంతస్తు నుంచి కిందికి దూకేసింది.
ఆమెకు శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగినట్లు మహర్షి వాల్మీకి ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు.
అగ్నిప్రమాదం చిన్నదే అయినా.. మంటలు బాణాసంచాకు అంటుకోవడం, తప్పించుకునే దారిలేకపోవడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఇదే భవనంలో రెండో అంతస్తులో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
దిల్లీ ప్రభుత్వం ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది.
మృతుల కుటుంబ సభ్యులకు ఐదు 5, గాయపడిన వారికి లక్షచొప్పున దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఈ భవనానికి ఎన్‌ఓసీ లేదని అధికారులు తెలిపారు. భవనాన్ని సీజ్ చేశారు.
15 రోజుల క్రితమే ఈ భవనంలో బాణాసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
భవనం యజమానిపై కేసు నమోదు చేసినట్లు రోహిని డిప్యూటి కమిషనర్ చెప్పారు.
బాణాసంచాను బయటి నుంచి తీసుకొచ్చి ఈ భవనంలో నిల్వ చేశారని కార్మికులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.