You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గజల్ శ్రీనివాస్ కేసు.. అసలేం జరిగింది?
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"నేను ఎదుర్కొన్న వేధింపులు మరే అమ్మాయికీ ఎదురు కాకూడదనే ధైర్యం చేసి ఆ విషయాలు బయట పెట్టాను. అమ్మాయిలెవరైనా అవసరమైతే గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేయాలి" అని ఆమె వివరించారు. 'గజల్ శ్రీనివాస్ రాసలీలలు' అని పేర్కొంటూ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశారు.
మరోవైపు గజల్ శ్రీనివాస్.. బాధితురాలిని సొంత బిడ్డలాగా భావించానని అన్నారు. "నేను భుజానికి ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నా. ఆ రోజు థెరపిస్ట్ రాలేదు. దీంతో నేను చేస్తా అంది. నేను ఏనాడూ కూడా ఆమెనలా దురాలోచనతో చూడలేదు'' అని మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.
కేశిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ 'సేవ్ ది టెంపుల్' అన్న పేరిట స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్నారు.
అదే సంస్థలో 'ఆలయ వాణి' పేరిట ఒక రేడియో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.
ఈ ప్రోగ్రామ్ కోసం పని చేస్తున్న మహిళ గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 29న ఫిర్యాదు చేశారు.
ఈ మహిళ బీబీసీతో మాట్లాడారు.
గజల్ శ్రీనివాస్ తనను బలవంతంగా లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, మసాజ్ చేయాలి అని బలవంతం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అదే సంస్థలో పని చేస్తున్న మరో మహిళ పార్వతి ద్వారా తనపై 'ఒత్తిడి' తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ వివరించారు.
"నేను అలా చేయలేను, ఉద్యోగం మానేస్తా అని ప్రాధేయపడ్డా. ఈ విషయం ఎవరితో చెప్పినా.. తన పలుకుబడి ఉపయోగించి కేసులలో ఇరికిస్తానని గజల్ శ్రీనివాస్ బెదిరించారు" అని ఆ మహిళ తెలిపారు.
'వేధింపులు భరించలేకే ఎలాగైనా.. ఈ విషయం అందరికీ తెలియాలని రహస్యంగా కెమెరా పెట్టి రికార్డు చేశాను' అని బాధితురాలు చెప్పారు.
"చివరికి ఏదేమైనా సరే అని రిస్క్ తీసుకున్నా. ఎందుకంటే గజల్ శ్రీనివాస్ ఒక ముసుగులో జీవిస్తున్న వ్యక్తి. ఆ విషయాన్ని ఎవరికి చెప్పినా నన్ను నమ్మరు. అందుకే ఆధారాలతోనే అతని బాగోతం బయట పెట్టాలని ఇలా చేశా. ఇవాళ అదే నన్ను కాపాడింది" అని వివరించారు.
అయితే.. బాధితురాలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని, తానెప్పుడూ అసలు ఇటువంటి పనులకు ఒత్తిడి చేయలేదని ఈ కేసులో రెండో నిందితురాలు, పనిమనిషి పార్వతి చెప్పారు.
"నేను ఇరవై సంవత్సరాలుగా శ్రీనివాస్ గారి ఇంట్లో పని చేస్తున్నా. ఏనాడూ అలాంటి పనులు అయన చేయలేదు. అసలు నేను ఎందుకు ఆ అమ్మాయిని ఒత్తిడి చేస్తా?" అని పార్వతి అన్నారు.
పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పార్వతి 'అక్యూజ్డ్ నెంబర్ 2'.
పంజాగుట్ట పోలీసులు మంగళవారం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
జుడీషియల్ కస్టడీ కింద చంచల్‌గూడ జైలుకు తరలించారు.
"గజల్ శ్రీనివాస్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తాం. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వారు మరెవరైనా ఉంటే మమ్మల్ని ఆశ్రయించవచ్చు'' అని పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
బాధితురాలు ఈ సంస్థలో ఉద్యోగం మొదలు పెట్టి ఎనిమిది నెలలు అవుతోందని, రెండు నెలలుగా లైంగిక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు విజయ్ కుమార్ వివరించారు.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)