పఠాన్‌కోట్ దాడికి రెండేళ్లు: 'నా కొడుకు మరణం మమ్మల్ని కకావికలం చేసింది'

    • రచయిత, అరవింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి, చండీగఢ్

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ ఫోర్స్ స్థావరంపై మిలిటెంట్ల దాడి జరిగి రెండేళ్లు అవుతోంది. 2016 జనవరి 2న సాయుధులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు జవాన్లు మృతి చెందారు.

వారిలో ఒకరు హరియాణాకు చెందిన యువ గరుడ కమాండో గుర్‌సేవక్ సింగ్.

మాట్లాడిన మరుసటి రోజే

2016 జనవరి 1న గురుసేవక్ సింగ్ తన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ మరుసటి రోజే ఆయన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ కుటుంబం మౌనంగా రోదిస్తూనే ఉంది.

ఆ దుఃఖంలోనూ.. వారు చెప్పే మాట.. "మా గుర్‌సేవక్ సింగ్ (25) దేశం కోసం ప్రాణాలర్పించారు. ఎంతో గర్వంగా భావిస్తున్నాం".

"మీరు మీ ఇంట్లో సహజంగా చనిపోతారు కావచ్చు. కానీ.. నా కొడుకు తన మాతృ భూమి కోసం పోరాడి ప్రాణాలు అర్పించాడు. ఎంతో గర్వంగా ఉంది" అని పఠాన్‌కోట్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన గరుడ కమాండో గురుసేవక్ సింగ్ తండ్రి సుచా సింగ్ అంటున్నారు.

ప్రస్తుతం గురుసేవక్ సింగ్ కుటుంబం తన స్వగ్రామం హరియాణాలోని గర్నాలా‌లో ఉంటోంది.

"పంజాబ్‌లోని జలంధర్‌లో ఆయనకు పోస్టింగ్ వచ్చింది. 2016 జనవరి 1న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మాతో మాట్లాడాడు. ఇంటికి వస్తున్నావా? అని అడిగితే.. లేదు నాన్నా మరికొన్ని రోజులపాటు వీలుకాదన్నాడు. ఆ మరుసటి రోజే అతడు మరణించాడన్న సందేశం వచ్చింది" అంటూ బరువెక్కిన స్వరంతో సుచా సింగ్ తన కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

పెళ్లైన ఆరు వారాలకే ..

"పఠాన్‌కోట్ దాడికి సరిగ్గా నెలన్నర ముందే గురుసేవక్ సింగ్ వివాహమైంది. ఇప్పుడు ఆయన కుమార్తె వయసు ఏడాదిన్నర. ఆమెకు గుర్రీత్ అని పేరు పెట్టుకున్నాం" అని సుచా సింగ్ తెలిపారు.

తమ మనవరాలు పెద్దయ్యాక భారత ఆర్మీలో చేరతానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని ఆయన అంటున్నారు.

సుచా సింగ్ కూడా ఆర్మీలో పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడు హరిదీప్ కూడా ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.

"నా కొడుకు మరణం మమ్మల్ని కకావికలం చేసింది. ఉగ్రవాదులు ఎంత మందిని చంపుతున్నామన్నదే చూశారు. కానీ.. ఎవరిని చంపుతున్నామన్న విషయాన్ని పట్టించుకోలేదు" అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడుగురు జవాన్ల మృతి

2016 జనవరి 1 అర్ధరాత్రి దాటాక భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని పఠాన్‌కోట్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై దాడి చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. నాలుగు రోజులకు ఆపరేషన్ ముగిసింది.

ఈ మొత్తం ఆపరేషన్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది గాయపడ్డారు. ఐదుగురు సాయుధులు హతమయ్యారని భారత ప్రభుత్వం వెల్లడించింది.

ఈ దాడి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూప్ జైష్-ఎ-మహమ్మద్ పనేనంటూ భారత్ ఆరోపిస్తోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)