You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ అండే నాకు బలాన్నిచ్చింది: కరుణానిధికి రాజా లేఖ
2జీ స్పెక్ట్రం కేసులో తనను దిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన అనంతరం టెలికం శాఖ మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత ఎ.రాజా తమ పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధికి ఉద్వేగపూరిత లేఖ రాశారు.
తనకు ఎప్పుడూ అండగా నిలిచారంటూ ఆయనకు రాజా కృతజ్ఞతలు తెలిపారు. 2జీ కేసులో తీర్పును మీ పాదాల చెంత ఉంచి, నమస్కరిస్తున్నానని చెప్పారు.
ఈ వివాదంతో వ్యక్తులపైనే కాదని, ఎంతో బలమైన సిద్ధాంతంతో ముందుకు సాగే డీఎంకేపైనా దాడి చేశారని ఆయన ఆరోపించారు. ''నేను జైల్లో ఉన్నప్పుడు మీరు(కరుణానిధి), డీఎంకే అగ్రనేత స్టాలిన్ నన్ను కలవడం నాకెంతో బలాన్నిచ్చింది.. నిస్పృహ నుంచి నన్ను బయటపడేసింది'' అన్నారు.
గిట్టనివారిపై వ్యక్తులు దాడులు చేయడం సాధారణమేనని, అయితే 2జీ స్పెక్ట్రం విషయంలో మాత్రం తమపై దాడికి వ్యక్తులు వ్యూహం పన్నితే, కొన్ని సంస్థలు దాడిని జరిపాయని ఆయన ఆరోపించారు.
యూపీఏ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ వివాదాన్ని సృష్టించారని, ఈ విషయాన్ని యూపీఏ ప్రభుత్వం కూడా గుర్తించలేకపోయిందని విమర్శించారు.
మొబైల్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడానికి తమ నిర్ణయమే కారణమని, ఇదో విప్లవాత్మక మార్పు అని, ఇంత మార్పుకు దోహదం చేస్తే, దానిని నేరంగా పరిగణించారని, ఈ దేశంలోనే ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
తనను జైల్లో పెట్టడం వల్ల తన మనసుకు అయిన గాయం నయమవుతుందని, కానీ రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణం పేరుతో 80 ఏళ్ల మీ(కరుణానిధి) సామాజిక జీవితాన్ని అవమానించారని, ఇంత చౌకబారు ఆలోచనలు చేసినవారికి శిక్ష ఏమిటని ప్రశ్నించారు.
''ఈ (2017 డిసెంబర్) నెల 16న నేను మిమ్మల్ని కలిశాను. మీ చెవి దగ్గరకు వచ్చి, '2జీ కేసులో తీర్పు రానుంది, దిల్లీ వెళ్తున్నాను, ఆశీర్వదించండి' అని అడిగాను. మీ కుడి చేతిని పైకి ఎత్తి, చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించారు'' అని రాజా గుర్తుచేసుకున్నారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)