గుజరాత్‌: గెలిచేదెవరు? ఓడేదెవరు?

    • రచయిత, సతీష్ ఊరుగొండ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గుజరాత్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎందరో మహామహులు, తలపండిన రాజకీయ నేతలు ఎన్నికల కదన రంగంలో తలపడ్డారు. కొన్నిచోట్ల కమలానికి, మరికొన్ని చోట్ల హస్తానికి పట్టుంది. ఇంకొన్ని చోట్లా నువ్వా-నేనా అన్నట్లు ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.

గుజరాత్‌లోని 182 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 9 నియోజక వర్గాల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

కొన్ని స్థానాల్లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది. పార్టీల గెలుపోటములను ఆ స్థానాలు నిర్ధేశిస్తాయన్న విశ్లేషణ ఉంది.

ఇంతకీ అందరూ దృష్టి సారించిన ఆ నియోజక వర్గాలు ఏమిటి.. అక్కడ ఎవరెవరు పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

1. రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గం

సీఎం విజయ్ రుపానీ వర్సెస్ ఇంద్రాణి రాజ్యగురు

గుజరాత్‌లో కీలక స్థానం ఇది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ తరఫున ఇంద్రాణి రాజ్యగురు బరిలో ఉన్నారు.

కుల సమీకరణాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని అంచనా వేస్తున్నారు.

అందుకే కుల సమీకరణాల్లో భాగంగా రాజ్‌కోట్‌ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజ్యగురును రాజ్‌కోట్ పశ్చిమ స్థానం నుంచి కాంగ్రెస్ రంగంలోకి దింపింది.

సౌరాష్ట్రలో ఇది అతి పెద్ద నియోజకవర్గం. సుమారు మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

వ్యాపారులు, విద్యావేత్తలు ఎక్కువగా ఉన్నారు.

హార్ధిక్‌ పటేల్‌ బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. దీంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే ఉంది.

2. మెహ్‌సనా నియోజక వర్గం

డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వర్సెస్ జివా పటేల్

నరేంద్ర మోదీ సొంతూరు వడ్‌నగర్‌ మెహ్‌సనా జిల్లాలోనే ఉంది. అయితే, వడ్‌నగర్‌ ఈ నియోజకవర్గం కిందికి రాదు.

బీజేపీ తరఫున డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ , కాంగ్రెస్ నుంచి జీవా పటేల్ పోటీ చేశారు.

ప్రభుత్వంపై పాటీదార్ల ఆగ్రహం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

3. సౌరబ్ పటేల్ వర్సెస్ డీఎం పటేల్

సౌరాష్ట్రలోని బోతడ్‌లో పోటీ ఆసక్తికరంగా ఉంది.

ఇద్దరు పాత రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

మాజీ మంత్రి సౌరబ్ పటేల్‌తో కాంగ్రెస్ అభ్యర్థి డీఎం పటేల్ తలపడుతున్నారు.

మోదీ హయాంలో సౌరబ్, వైబ్రెంట్ గుజరాత్‌ సదస్సులు నిర్వహించే వారు.

కానీ సీఎం విజయ్ సౌరబ్‌ను పదవి నుంచి తప్పించారు.

ఇక్కడ ఎవరు గెలుస్తారన్న అంశం హార్దిక్ పటేల్ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.

4. వడ్‌గామ్‌ నియోజక వర్గం

ఇది కాంగ్రెస్ కంచుకోట. దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఇక్కడి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు.

ఆయనకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఇక్కడ తమ అభ్యర్థిని పెట్టలేదు.

బీజేపీ తరఫున చక్రవర్తి విజయ్ కుమార్ బరిలో ఉన్నారు.

వడ్‌గామ్‌ నియోజక వర్గంలో మొత్తం 2.60 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికం.

5. మణినగర్ నియోజక వర్గం

ఇది మరో కీలక స్థానం. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సురేశ్ భాయ్ పటేల్‌ కాంగ్రెస్ యువ నేత శ్వేత బ్రహ్మభట్‌‌ బరిలో ఉన్నారు.

ప్రధాని కాకముందు మోదీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. 2002, 2007, 2012లో మోదీ ఇక్కడి నుంచి గెలిచారు.

మోదీ రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సురేశ్ భాయ్ పటేల్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎంపికయ్యారు.

6. మాడ్వి నియోజకవర్గం

కచ్‌ ప్రాంతంలో మాడ్వి నియోజక వర్గం ఉంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ.

కాంగ్రెస్ నుంచి శక్తిసింగ్ గోహిల్, బీజేపీ నుంచి వీరేంద్ర సింగ్ జడేజా బరిలో ఉన్నారు.

2014లో అబ్‌దసా ఉప ఎన్నికల్లో గోహిల్‌ 750 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

మాజీ సీఎం సురేశ్ మెహతా ఐదుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు.

2002లో కాంగ్రెస్ ఇక్కడ జెండా పాతింది.

కానీ 2007, 2012లో బీజేపీ తిరిగి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది.

7. సూరత్ నార్త్ నియోజక వర్గం

ఇక్కడ తెలుగు ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా హిమత్‌భాయ్ బల్లర్, కాంగ్రెస్ అభ్యర్థి గా దినేశ్ భాయ్ పోటీ చేశారు.

అయితే, 1990 నుంచి ఇక్కడ బీజేపీనే గెలుస్తోంది.

8. పోరుబందర్ నియోజక వర్గం

ఇక్కడ పాత రాజకీయ ప్రత్యర్థుల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంది.

2002 నుంచి మొద్‌వాడియా, బొఖిరియా మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

గెలుపోటములపై కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

9. రాధన్‌పూర్ నియోజక వర్గం

రాధన్‌పూర్‌ నియోజక వర్గం చాలా కీలకమైంది. అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు.

బీజేపీ నుంచి లావింజి ఠాకూర్ బరిలో ఉన్నారు.

ఇక్కడ ఓబీసీలు ఎవరికి ఓటేస్తే వారే గెలుస్తారు. ఎందుకంటే మొత్తం ఓటర్లలో 67శాతం వాళ్లే ఉన్నారు.

ఠాకూర్‌, ముస్లిం, దళిత ఓట్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)