You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సౌదీ అరేబియా: సినిమాలపై నిషేధం ఎత్తివేత
- రచయిత, వి. రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలకు డ్రైవింగ్ అనుమతి తర్వాత సౌదీ అరేబియా సంస్కరణల్లో మరో అడుగు ముందుకు వేస్తూ సినిమా థియేటర్లపై నిషేధాన్ని ఎత్తేసింది.
అరబ్ ప్రపంచంలో శక్తిమంతమైన దేశం సౌదీ అరేబియా. లక్షలాది మంది భారతీయ కార్మికులు ఇక్కడికి ఉపాధి కోసం వెళ్తుంటారు.
ఇతర ఇస్లాం దేశాల లాగే ఇక్కడా కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే మహ్మద్ బిన్ సల్మాన్ అధికారం చేపట్టాక సౌదీ అరేబియాలో కొన్ని సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి.
సంస్కరణల బాట
1970 ప్రాంతంలో సౌదీలో సినిమాలు ఆడేవి. ఇస్లాం సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కొందరు మత గురువులు సినిమాలను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో 1980 ప్రాంతంలో సినిమాలను సౌదీ నిషేధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తాజాగా ఆ దేశం ప్రకటించింది.
విజన్-2030 పేరుతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆర్థిక సంస్కరణలకు తెరతీశారు. ఇందులో భాగంగా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు.
ఓటు హక్కు
మహిళలకు సౌదీలో తొలిసారి 2015లో ఓటు హక్కు కల్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో వీరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 978 మంది మహిళలు పోటీ చేశారు కూడా.
డ్రైవింగ్ చేయొచ్చు
గతంలో మహిళలు వాహనాలు నడపడానికి సౌదీ అనుమతించేది కాదు. తాజాగా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి వీరికి లైసెన్సులు జారీ చేస్తారు.
క్రికెట్ చూడొచ్చు
సౌదీ అరేబియా చరిత్రలో తొలిసారి మహిళలు స్టేడియానికి వెళ్లి క్రికెట్ చూసేందుకు ఇటీవల అనుమతి ఇచ్చారు. గతంలో ఇది నిషేధం. కుటుంబ సభ్యులతో కలిసి స్టేడియానికి వెళ్లి ఆటల పోటీలను వీక్షించవచ్చు.
ఇప్పుడిప్పుడే సంస్కరణల బాట పడుతున్న సౌదీ అరేబియాలో ఇప్పటికీ ఎన్నో కఠినమైన నియమాలున్నాయి.
అవి ఏమిటో ఓసారి చూద్దాం. బీబీసీ, బ్రిటన్ ప్రభుత్వ వెబ్‌సైట్, సౌదీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయ వెబ్‌సైట్లలో లభిస్తున్న సమాచారం ప్రకారం..
పురుషుల అనుమతి లేకుండా సౌదీ మహిళలు కొన్ని పనులు చేయకూడదు.. అవి ఏమిటంటే..
- పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవడం
- విదేశీ ప్రయాణం చేయడం
- పెళ్లి చేసుకోవడం
- బ్యాంక్ ఖాతా తెరవడం
- వ్యాపారం ప్రారంభించడం
- కొన్ని రకాల ఆపరేషన్లు చేయించుకోవడం
- జైలులో ఉన్నప్పుడు బయటకు రావాలన్నా వారి కుటుంబంలోని పురుషుల అనుమతి కావాల్సిందే
పర్యాటకులు
- మద్యం సేవించి సౌదీకి రాకూడదు
- పంది మాంసంతో తయారు చేసిన ఉత్పత్తులు తీసుకురాకూడదు
- రెండు పాస్‌పోర్టులు కలిగి ఉండకూడదు
- ఇజ్రాయెల్ వెళ్లినట్లు మీ పాస్‌పోర్ట్ మీద ఉంటే అనుమతి నిషేధం
- బైనాక్యూలర్స్ తీసుకురాకూడదు
- మహిళలు శరీరమంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి
- బహిరంగ ప్రదేశాల్లో పురుషులు పొట్టి లాగులు ధరించకూడదు
ఈ ఫొటోలు తీయకూడదు
- ప్రభుత్వ భవనాలు
- సైనిక స్థావరాలు
- రాజభవనాలు
ఇవి నిషిద్ధం
- స్వలింగ సంపర్కం
- మద్యం వ్యాపారం
- అశ్లీల చిత్రాలు
- మాదక ద్రవ్యాలు
మతం
- ఇస్లాం తప్ప మరే మతాన్ని బహిరంగంగా ప్రచారం చేయకూడదు
- ఇతర మత గ్రంథాలను ఎక్కువ సంఖ్యలో తీసుకు రాకూడదు
- రంజాన్ మాసంలో పగలు బహిరంగంగా తినడం, తాగడం నిషిద్ధం
వీటికి మరణదండన
- వ్యభిచారం
- వివాహేతర సంబంధాలు
- అత్యాచారం
- స్వలింగ సంపర్కం
- మాదక ద్రవ్యాల రవాణా
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)