You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కృష్ణా నదిలో పడవ ప్రమాదం, 16 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద పర్యాటకులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బోటు బోల్తా పడింది.
ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప ప్రకటించారు. వీరిలో 15 మందిని గుర్తించారు.
మృతుల కుటుంబాలకు రూ. 8 లక్షల పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
చనిపోయిన వారిలో ఆరుగురు మహిళలు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పడవలో 30 మందికి పైగా ఉన్నట్టు తెలిసింది కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు.
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జయరామ్ రెడ్డి, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను హోంమంత్రి, వైద్యశాఖ మంత్రి, పర్యాటకశాఖ మంత్రి ఆదేశించారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ గాలింపు చర్యలు చేపడుతోంది.
'అనుమతి లేని బోటు'
ఈ బోటులో ఉన్న వారంతా భవానీ ద్వీపం నుంచి పవిత్ర సంగమం వైపు వెళ్తుండగా బోటు తిరగబడింది.
వీరందరూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వారని తెలిసింది. వివిధ వాకర్స్ గ్రూపులకు చెందిన వాళ్లు ఈ పడవలో ఉన్నారు.
రక్షణ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు, ఇతర బోట్ల సిబ్బంది కలిసి కొంత మందిని కాపాడారు. ఈ పడవ ఒక ప్రైవేటు కంపెనీకి చెందినది.
అయితే ఈ బోటు నిర్వహణకు అనుమతి లేదని హోంమంత్రి అన్నారు.
ప్రయాణికులంతా ఒక వైపుకే కూర్చోవడం వల్ల ఫెర్రీఘాట్ వద్ద బోటు మలుపు తిరుగుతున్న సమయంలో అది ఒక్కసారిగా తిరగబడిందని ప్రమాదం నుంచి బైటపడ్డ ప్రయాణికులు మీడియాకు తెలిపారు.
ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
రక్షణ, సహాయ పనుల కోసం అధికారులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్: 1800450101
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)