You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పోస్ట్’మార్టం: ‘అదిరింది’ సినిమాకు ‘సోషల్ ఫీవర్’
ఇది సూపర్ స్టార్ ఫేస్‌బుక్ పోస్ట్ కాదు.. ఓ సాధారణ వ్యక్తి చేసిన పోస్టు. కానీ ఆ పోస్టు మాత్రం సాధారణమైంది కాదు.. కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది.
ఆ పోస్టే మెర్సల్ సినిమా తెలుగు వర్షన్. ఇది ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేసింది. క్లీన్ వీడియో, క్లియర్ ఆడియోతో ఈ సినిమా ప్రత్యక్షమైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళ సినిమా మెర్సల్‌కు తెలుగు అనువాదం 'అదిరింది' పేరుతో నవంబర్ 9న విడుదలైంది.
విడుదలైన రెండు రోజుల్లోనే మొత్తం సినిమాను ఫేస్‌బుక్‌లో ఉంచారు. సినిమా మొదటి నుండి చివరి వరకూ మొత్తం '2 గంటల 45 నిమిషాల 28 సెకన్లు' పోస్ట్ చేశారు.
9గంటల వ్యవధి తర్వాత ఈ ఉదయం 8గంటల ప్రాంతంలో పోస్టును తొలగించారు. ఈ వ్యవధిలోనే ఈ పోస్ట్‌కు 90 వేల వ్యూస్ వచ్చాయి.
తెలుగు సినిమాకు సోషల్ మీడియా దెబ్బ కొడుతోందా?
'పైరసీ' సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఇంతవరకూ ఉన్న అభిప్రాయం. కానీ పైరసీకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
‘చేతిలో ఫోను, అందులో నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. సినిమా థియేటర్‌కు పోవాల్సిన అవసరం కాదు కదా.. పది రూపాయల పైరసీ సీడీ కొనే అవసరం కూడా లేకుండానే కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి..’ అంటున్నారు నేటి యువత.
అయితే 'వ్యూస్' లో రికార్డయిన 90,000 మందిలో ఎంత మంది పూర్తి సినిమాను చూశారో తెలియదు. కానీ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవడం అందరికీ తెలిసిన విద్య కాబట్టి, చాలా మంది డౌన్‌లోడ్ చేసి తమ ఫోన్సు, కంప్యూటర్లలో సేవ్ చేసి ఉండొచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
90,000 మంది చూశారంటే ఈ తొంభై వేల టిక్కెట్లు పోయినట్టేనా?
మరి కోట్లు ఖర్చు పెట్టి సినిమాను తీసిన వారి పరిస్థితి?
కోట్లు ఖర్చు పెట్టి సినిమా కాపీరైట్లను కొన్నవారి పరిస్థితి??
ఒకవేళ ఈ తొంభైవేల మంది థియేటర్‌కు వెళ్లి సినిమా చూడరు.. అనుకుంటే సినిమాకు వచ్చే నష్టమెంత? సినిమా టిక్కెట్ అందాజుగా ఓ వంద రూపాయలు అనుకుంటే, ఆ నష్టాన్ని ఎవరైనా అంచనా వేయవచ్చు.
ఇది తొలిసారేం కాదు!
ఈ కథనానికి ఫేస్‌బుక్‌లో సినిమాను పోస్టు చేసిన సదరు వ్యక్తి టార్గెట్ కాదు. సదరు పోస్టు మాత్రమే సినిమా నిర్మాతను నష్టాల్లో ముంచెత్తకపోవచ్చు.
ఈ కథనం.. ఓ పరిణామానికి ఉదాహరణ మాత్రమే.
ఇలా ఫేస్‌బుక్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు కొత్తేం కాదు.
తెలుగు సీమలో ఇలాంటి సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ ‘బాహుబలి’ చిత్రాలు రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో వచ్చేశాయి.
ఈ సినిమాలను లీక్ చేసిన వారిపై కూడా దర్శక నిర్మాతలు కేసులు పెట్టారు.
గతంలో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా కూడా ఫేస్‌బుక్‌లో ‘విడుదలైంది’. ఈ పైరసీ పోస్టును 4 లక్షల మంది చూశారని అంచనా.
ఇక అదిరింది విషయానికి వస్తే.. ఈ సినిమాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడాన్ని కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఓ సినిమాను పైరసీ చేయడం కానీ పైరసీ చేసిన సినిమాను ఈవిధంగా పోస్టు చేయడం కానీ మంచి పద్దతి కాదని కొందరు యూజర్స్ కామెంట్ చేశారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)