You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఒగ్గు కథకు హావం..భావం.. చుక్క సత్తయ్య’
- రచయిత, వేణుగోపాల్ బొల్లంపల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘చుక్క సత్తయ్య ఒగ్గు కథ అంటే.. గతంలో చెవులు కోసుకునేవారు. రేడియోలో ఈయన కథ వస్తోందంటే.. ఊర్లో ఉన్న ఆ ఒక్క రేడియో చుట్టూ పదుల సంఖ్యలో గుమిగూడేవారు. ఈయన కథ చెప్పడం మొదలు పెడితే.. ఒకటీ రెండు గంటలు కాదు.. రోజుల తరబడి ఆడియన్స్ అక్కడే ఉండిపోవాల్సిందే. అదీ 'చుక్క సత్తయ్య' కథలో ఉన్న మజా.’’.. ఇదీ సత్తయ్య గురించి కొందరు సాహితీవేత్తల వద్ద ప్రస్తావించినపుడు వారు వెల్లడించిన అభిప్రాయం.
సత్తయ్యకు ఇంత క్రేజ్ ఎందుకని ప్రశ్నించినపుడు రచయిత అన్వర్, ఒగ్గు కథపై పరిశోధన చేస్తున్న ‘ఒగ్గు రవి’ కొన్ని విషయాలను బీబీసీతో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాట్లోనే..
సత్తయ్య ఒగ్గు కథ చెప్పే విధానం చాలా విభిన్నం.. ప్రత్యేకం.
గొల్ల కురుమలకే పరిమితమైన 'ఒగ్గు'ను సత్తయ్య ప్రత్యేక శైలితో అందరికీ తెలిసేలా.. ఇతర కులాల వారూ ఒగ్గు కథను చెప్పించుకునే స్థాయికి చేర్చారు.
చివరకు ఒగ్గు కథకు ఒక రూపమంటూ ఇచ్చి ఈ కథకు 'చుక్కాని'లా మారారు.
సత్తయ్య చనిపోయినా 'ఒగ్గు కథ'కు ఆయన నేర్పిన యాక్షన్ మాత్రం బతికే ఉంది. ఇంకా బతికే ఉంటుంది.
12వ ఏటనే మొదటి ప్రదర్శనను ప్రారంభించిన సత్తయ్య ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సత్తయ్య ముందటి తరం వరకూ ఒగ్గు కథ.. కేవలం ముగ్గురు కళాకరులు మాత్రమే నిలబడి చెప్పే కథగా ఉండేది.
ఒకరు గానం చేస్తుండగా ఒకరు డోలు వాయిస్తూ.. మరొకరు తాళం వేస్తూ వంత పాడేవారు.
కానీ సత్తయ్య కథ చెప్పడం మొదలు పెట్టాక ఆ విధానమే మారిపోయింది.
కేవలం ముగ్గురికే పరిమితమైన కథను ఈయన పది మంది కూడా కలిసి చెప్పవచ్చని నిరూపించారు.
కేవలం నిలబడి పాడితే సరిపోదని.. యాక్షన్ చాలా ఉండాలనేవారు.
నిలబడి చెబితే ఈ రోజుల్లో ఎవరూ వినరంటూ.. తన శైలితో ఈ కళను మరిన్ని కాలాల పాటు బతికేలా చేశారు.
కేవలం శివుని వేషధారణే కాకుండా అర్ధనారీశ్వర వేషంలో కూడా ఈయన ఒగ్గు కథనను చెప్ప వచ్చని నిరూపించారు.
కథలో గానానికి తగినట్లు నృత్యాలను కూడా ప్రశేపెట్టింది ఈయనే అని అంటారు అన్వర్. సత్తయ్య గొప్ప పరిష్కర్త అని కూడా ఈయన వివరించారు.
అప్పటి వరకూ సుదీర్ఘంగా సాగే చాలా కథలను ఈయన ఒక లాజికల్ కన్‌క్లూజన్‌కు (తార్కిక ముగింపునకు) తీసుకొచ్చారని తెలిపారు.
తాను పెద్దగా చదువుకోకపోయినా ఒగ్గు కథల్లోని అస్పష్ఠతను తొలగించేందుకు పెద్ద పరిశోధనే చేశారని వివరించారు.
మొత్తానికి చుక్క సత్తయ్య చాలా కథలకు మూలాలను అన్వేషించి.. వాటికి సరైన ముగింపులను రూపొందించారని చెబుతారు.
'ఒగ్గు రవి' మాట్లాడుతూ..'' సత్తయ్య కథ చెప్పడం మొదలు పెట్టక ముందు ఒగ్గు కథ 'కథాగానం'గా ఉండేది.
కానీ ఈయన వచ్చాక అది జానపద నాటకంగా మారింది. ఈయన వచన సాహిత్యంలో కొన్ని మార్పులు చేసి కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.'' దీంతో ఆయనకు ఆయన కథకు చాలా ప్రాచుర్యం లభించింది అని వివరించారు.
కేవలం కథను చెప్పి సరిపెట్టుకోకుండా దాని పుట్టు పూర్వోత్తరాలపై అధ్యయనం చేయడం వల్లే ఈయన ఇంత గొప్ప కళాకారుడయ్యారని అన్వర్ తెలిపారు.
ఒకదశలో ఈయన ఎదుగుదలను ఓర్వలేని తోటి కళాకారులు చాలా ఆటంకాలు సృష్టించారు. అయినా సత్తయ్య చాలా సామరస్యంగా ముందుకువెళ్లారని వివరించారు.
కథకు యాక్షన్ ఉంటేనే అందం.. ఆకర్షణ అని పేర్కొంటూ.. సత్తయ్య వారికీ 'తన విద్య'ను బోధించారని దీంతో వారూ తన బాటలోకి రాకతప్పలేదని.. అన్వర్ తెలిపారు.
చివరకు సత్తయ్య కథ అంటే.. సామాన్య జనం మాత్రమే కాకుండా.. మేధావులు కూడా చెవులు కోసుకొనేవాళ్లని నాటి విషయాలను వివరించారు.
బీరప్ప.. జాంబవంతుడు ఇలా ఏ కథను చెప్పినా సత్తయ్య ప్రత్యేక మార్కు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
ఈయన కుల వివక్ష నిర్మూలన కోసం ఒగ్గు కథతో ప్రచారమూ చేశారు. ‘‘అప్పటి వరకూ వెనుకబడిన కులాలకే పరిమితమైన ఒగ్గు కథను సత్తయ్య అగ్రకులస్థులు కూడా వినేలా చేశారు..’’ అని సాహితీవేత్తలంటుంటారు.
చుక్క సత్తయ్య కేవలం 15-20 మందికే స్వయంగా ఒగ్గు కథను నేర్పి ఉంటారని కానీ.. ఆయన కథ చెబుతుండగా తీసిన వీడియోలు చూసి వందల మంది నేర్చుకుని ఉంటారని అన్వర్ అంచనా వేశారు.
సత్తయ్య తల్లిదండ్రులకు ఒగ్గు కథ చెప్పడం రాదు .కానీ ఈయన మాత్రం తొమ్మిదో ఏట నుంచే నేర్చుకున్నారు. ఇప్పుడు సత్తయ్య కుమారుడు ఒగ్గు కథ చెబుతున్నారు.
సత్తయ్య కథల్లోకి పలు పాత్రలను ప్రవేశపెట్టడంతో.. కేవలం ముగ్గురికే పరిమితమైన ఒగ్గు కథ ప్రదర్శన ఇప్పడు పది మంది దాకా చేరింది. ఒగ్గు కథ కేవలం పురాణాలకే పరిమితం కాదని.. దీంతో సామాజిక సమస్యలపైనా ప్రజల్లో అవగాహన పెంచొచ్చని సత్తయ్య అనేవారు.
అందుకే ఉన్నత విద్య, మూఢనమ్మకాలు, చెడు అలవాట్లపైనా పలు కథలు రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారని ఆయనతో అనుబంధం ఉన్నవారు వివరించారు.
సత్తయ్య 1935 మార్చి 29న తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం మాణిక్యపురంలో జన్మించారు.
ఒగ్గు కథ అంటే..
ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం ఈ కథాగానం. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరూ ముగ్గురూ లేక అంతకు ఎక్కువ మంది సహా కళాకారులుంటారు. ఒగ్గు కథలను చెప్పే కళాకారులను ఒగ్గు గొల్లలు అంటారు.
ప్రేక్షకుడిని విరామం లేకుండా కట్టి పడేసే కళ ఒగ్గు కథ. ఇది కేవలం కథ మాత్రమే కాదు. గానం, నృత్యం, నాటక మిశ్రమం.
గొల్ల, కురుమలు తమ కుల పురుషుడు బీరప్ప కథ చెప్పేందుకు ఎంచుకున్న రూపమే ఒగ్గు కథ అనీ అంటారు. పెద్దగా చదువు సంధ్యలు లేని వారు కూడా ఈ కథా ప్రక్రియలో రాణించారు.
డోలు, తాళం, కంజీర వాయిద్యాలతో, తెలంగాణ భాషలో గంటల కొద్ది ఎన్నయినా కథలు చెబుతారు. పాటలు జోడించి కథను పండిస్తారు. పురాణాల మీద పట్టుతో ఆశువుగా కథ అలా చెప్పేస్తారు. నెత్తిన బోనం ఉంచుకుని కథ చెబుతూనే నేలను తలతో ముద్దాడతారు.
కొమురవెల్లి, అయినవోలు వంటి తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ఇప్పటికీ ఒగ్గు కథలు చెబుతుంటారు.
ఆధారం: పంచతంత్ర.ఆర్గ్, సాహితీవేత్తలు, వికీపీడియా
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)