ముగిసిన 20 ఏళ్ల యాత్ర

నాసా ప్రతిష్ఠాత్మకంగా భావించే కస్సీని ఉపగ్రహం సుదీర్ఘ యాత్ర శుక్రవారంతో ముగిసింది.

దాదాపు 13 ఏళ్ల పాటు శని గ్రహం, దాని ఉప గ్రహాలను చుట్టేసి అక్కడి ఎన్నో రహస్యాలను ప్రపంచానికి చెప్పింది. శని గ్రహానికి ఉపగ్రహాలైన ఎన్సెలడస్‌, టైటాన్‌లపై ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో గుర్తించింది.

శని గ్రహంతోపాటు ఉపగ్రహాల ఫొటోలు తీసేందుకు 1997లో కస్సీని ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపింది. 2004లో అది శని గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కక్ష్యలో తిరుగుతూ పరిశోధకులకు విలువైన సమాచారాన్ని అందిస్తూ వచ్చింది.

అక్కడ వాతావరణ పరిస్థితులు, నీటి వనరులు ఎలా ఉన్నాయి? జీవుల మనుగఢ సాధ్యమేనా? అనే అంశాలకు సంబంధించి కీలక సమాచారాన్ని నాసాకు చేరవేసింది.

కస్సీని విశేషాలు..

ప్రయాణం: దాదాపు 788కోట్ల 57 లక్షల 85 వేల 600 కిలోమీటర్లు

వేగం: గంటకు 1.12 లక్షల కిలోమీటర్లు

తీసిన ఫొటోలు: 4,50,000

గుర్తించిన ఉపగ్రహాలు: 6

ఆఖరి తేది శుక్రవారం(15-09-2017)

ఇటీవల ఇంధనం అయిపోవడంతో కస్సీని కక్ష్య నుంచి శని గ్రహంపైకి పడిపోవడం ప్రారంభించింది. శుక్రవారం సాయంత్రానికి శని గ్రహం వాతావరణంలోకి ప్రవేశించగానే విచ్ఛిన్నమైపోయింది.