హాంకాంగ్ నిరసనలు: తుపాకీ కాల్పులకు కారణమేంటి?

ఒకే భావజాలమున్న కొంతమంది టెలిగ్రాం వేదికగా కలవడంతో ఇదంతా మొదలైంది.
హాంకాంగ్ నివాస ప్రాంతంలో పెట్రోల్ బాంబులు, తుపాకుల మోతలతో ఇది ముగిసింది.

హాంకాంగ్‌లో గత వేసవిలో ఈ రాజకీయ సంక్షోభం రాజుకుంది. నివాస ప్రాంతాల నుంచి షాపింగ్ సముదాయాల వరకు నలుమూలలా విస్తరించింది. క్రమంగా విధ్వంసకర ఘర్షణలుగా రూపాంతరం చెందింది.
జూన్ నుంచి ఎక్కడో ఒకచోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఆగస్టు మొదటి వారంలో పరిస్థితి శాంతించినట్లు అనిపించింది. ఒక్కచోట కూడా ఆందోళన జరగకపోవడంతో అంతా ముగిసిపోయిందని అనుకున్నారు. అనంతరం ఆగస్టు 25 నాటి షాన్‌వాన్ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఘర్షణలు మరింత తీవ్రతతో చెలరేగాయి. ఓ పోలీసు అధికారి హెచ్చరిక కాల్పులూ జరిపారు. జూన్‌లో నిరసనలు మొదలైన నాటి నుంచీ తూటా పేలడం ఇదే తొలిసారి. మొదటిసారిగా జల ఫిరంగులూ కనిపించాయి. అరెస్టైన వారిలో 12 ఏళ్ల బాలుడూ ఉన్నాడు. ఇప్పటి వరకూ పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఇతడే చిన్నోడు.
ఈ ఘటనలన్నీ ఏదో విధ్వంసకర పరిణామం సంభవిస్తున్న వాతావరణాన్ని సృష్టించాయి.
ఇది హాంకాంగ్‌లో ఓ సాయంత్రం జరిగిన కథ.

అనువాదం చేసిన, మార్చిన టెలిగ్రామ్ చాటింగ్. పేర్లు మార్చాం
అనువాదం చేసిన, మార్చిన టెలిగ్రామ్ చాటింగ్. పేర్లు మార్చాం
షాన్‌వాన్ ఘర్షణలు సాధారణ నిరసనల్లానే మొదలయ్యాయి. నగరంలో చాలా చోట్ల కనిపిస్తున్న ఆందోళనలు తమ ప్రాంతంలోనూ మొదలుకావాలని కొందరు భావించారు.
ఇది జరిగేలా చూసేందుకు వారిముందున్న ఏకైన మార్గం టెలిగ్రాం. ఈ సామాజిక అనుసంధాన వేదికపై నిత్యం నిరసనలు జరిగేలా చూసేందుకు డజన్ల కొద్దీ బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌లతో నిరసనలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి.
కొన్ని బృందాల్లో వేల మంది సభ్యులున్నారు. వీరు వ్యూహాత్మక అంశాలపై ఇక్కడ చర్చించుకుంటున్నారు. కొన్ని చిన్న బృందాలు నిరసన సామగ్రి అందేలా చూస్తున్నాయి. ర్యాలీలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి. కొన్ని ఛానెళ్లు ఫస్ట్ ఎయిడ్ సామగ్రి, పోస్టర్లు లాంటివీ అందేలా చూస్తున్నాయి.
ఆగస్టు 25 నాటి నిరసన చేపట్టేందుకు క్వాయ్ ఛంగ్, షువాన్ వాన్ ప్రాంతాలకు చెందిన కొందరు జూన్‌లోనే టెలిగ్రాంలో ఓ బృందంగా ఏర్పడ్డారు.
వారిలో 26 ఏళ్ల పోటర్ ఒకరు.

‘‘ఈ పని మేం పూర్తి చేయగలమని అసలు అనుకోలేదు. మాకు నిరసనల నిర్వహణపై ఎలాంటి అవగాహనా లేదు’’ అని ఆయన అన్నారు.
కొన్ని రోజుల్లోనే టెలిగ్రాంలో నిరసనల ప్రమోషన్, సామగ్రి పంపిణీ, వైద్య సాయం లాంటి వ్యవహారాలు చూసేందుకు ఏర్పాటైన కొన్ని గ్రూప్‌లు భారీ నిరసన కోసం పనిచేయడం మొదలుపెట్టాయి.
ర్యాలీకి అవసరమైన అనుమతులను పోలీసుల నుంచి ఎలా సంపాదించాలనే అంశంపై సలహాలిచ్చే వారూ ఇక్కడ ఉన్నారు.
ఆదివారం, ఆగస్టు 25- ర్యాలీకి సన్నద్ధం
మొదట స్థానికులు విరాళంగా ఇస్తున్న మంచి నీరు, బ్యాండేజీలు, ఇతర సామగ్రిని పది భారీ బ్యాగుల్లో పంపిణీల బృందం సేకరించింది.
‘‘ర్యాలీకి ముందుగా కొన్ని ప్రధాన ప్రాంతాలను గుర్తించాం. అక్కడ కొంత సామగ్రి అందుబాటులో పెట్టుకున్నాం’ అని వాలంటీర్‌గా పనిచేస్తున్న వీటా తెలిపారు.

‘‘అందరూ తమకు తోచిన విధంగా సాయం చేస్తూ ముందుకు రావడం వల్లే ర్యాలీ ఇంత పెద్దదయ్యింది’’ అని పోటర్ వివరించారు.
అయితే, తాను ఈ ర్యాలీకి నాయకుణ్ని కాదని, అసలు అలాంటి వారెవరూ లేరని ఆయన వివరించారు. ఎవరు ఉద్యమాన్ని నడిపిస్తున్నారో గుర్తించలేకపోతే... దాన్ని అదుపు చేయడం చాలా కష్టమవుతుందని నిరసనకారులకు బాగా తెలుసు.
2014లో ప్రపంచ దేశాల దృష్టిని తమవైపుు తిప్పుకొన్న అంబ్రెల్లా మూవ్‌మెంటే తాజా నిరసనకు మార్గదర్శిగా మారింది. ఆనాడు 79 రోజులపాటు సెంట్రల్ హాంకాంగ్‌లో నిరసనలు జరిగాయి. అయితే, ప్రభుత్వం వారి డిమాండ్లకు అంగీకరించలేదు. నిరసనలకు నేతృత్వం వహించినవారిని జైలుకు పంపించింది.

అంబ్రెల్లా మూవ్‌మెంట్ – అక్టోబరు 19, 2014
అంబ్రెల్లా మూవ్‌మెంట్ – అక్టోబరు 19, 2014
ఈ సారి ఉద్యమానికి దిశానిద్దేశం చేసే నిర్ణయాలు తీసుకొనేందుకు ఎల్‌ఐహెచ్‌కేజీని ఉపయోగించుకున్నారు. ఇక్కడి పోస్ట్‌లపై ఓటింగ్ నిర్వహించేవారు. వేల సంఖ్యలో ప్రజలు దీనిలో పాలుపంచుకొనేవారు. ఎక్కువ మంది మద్దతు పలికే వ్యూహాలను అమలు చేసేవారు.
శాంతియుతంగా ర్యాలీ చేపట్టేందుకు పోటర్ సాయం చేస్తున్నారు. అయితే, ఇదివరకటి ర్యాలీల్లానే హింస చోటుచేసుకునే అవకాశముందని చాలా మంది నిరసనకారులకు తెలుసు.
పోలీసుల జల ఫిరంగులకు ఎదురొడ్డి మొదటి వరుసలో నిలబడే కరడుగట్టిన బృందాలు చాలా చిన్నవి. వారి టెలిగ్రాం సందేశాలు ప్రైవేట్‌మోడ్‌లో ఉండేవి. తాము అనుసరించాల్సిన విధానాలపై నిర్ణయాలను చివర్లోనే తీసుకుంటామని స్కోర్చ్డ్ ఎర్త్ పేరుతో ఖాతా నిర్వహిస్తున్న ఓ అతివాద నిరసనకారుడు తెలిపారు.
‘‘నిరసనల తర్వాత ఘర్షణలు చోటుచేసుకున్న ప్రతిసారీ మేం పోరాడతాం’’ అని ఆయన వివరించారు.
‘‘పరిపాలన సాగించేందుకు పోలీసుల బలప్రయోగంపై ఈ ప్రభుత్వం ఆధారపడుతోంది. మేం పోలీసులను ఓడిస్తే.. మాతో చర్చలను ప్రభుత్వం తప్పించుకోలేదు’’ అని అన్నారు.

15:00 - నిరసన ప్రారంభం
ప్లాన్ చేసిన మార్గంలో షాన్‌వాన్ ప్రధాన కూడలి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర కుండపోత వర్షంలోనే వేలాది మంది ప్రశాంతంగా కదిలారు.
"హ్యూంగ్ గాంగ్ యాన్ గా యౌ" లాంటి నినాదాలు చేశారు. 'ముందుకెళ్లండి' అంటూ నిరసనకారులను ఉత్సాహపరిచేందుకు ఈ నినాదాన్ని వాడారు. ఈ ఉద్యమంలో వినిపించిన ప్రధాన నినాదాలలో ఇదొకటి.
చిన్న పిల్లలతో తల్లిదండ్రులు, వృద్ధులు, యువకులు అందరూ కలిసిపోయారు. కానీ, పోలీసులు కనిపించలేదు. బహుశా మునుపటి నిరసనల మాదిరిగానే, ఇక్కడ కూడా హింస చెలరేగదని వారు అనుకుని ఉంటారు.
వాహనాలు రాకుండా రహదారిలో కొంత భాగంలో యువకుల చిన్న బృందం బారికేడ్లను ఏర్పాటు చేసింది. ఆ బృందంలో ఒక పిల్లాడి వయసు 15 సంవత్సరాలే ఉంటుంది.
వారు తమ ముఖాలను దాచేందుకు చాలా ప్రయత్నించారు.
ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచీ, నిరసనకారులు తమ గుర్తింపును దాస్తున్నారు.
ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ మొబైల్ యాప్‌లను ఉపయోగించడంతో పాటు, జర్నలిస్టులకు కూడా చాలా వరకు తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వలేదు. అధికారులు తమ కదలికలను ట్రాక్ చేస్తారనే భయంతో.. రవాణా కోసం వారి వ్యక్తిగత రైలు పాస్‌లను కూడా ఉపయోగించలేదు.
మూడేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలతో వచ్చిన ఓ కుటుంబం, తమ ఇంట్లో తయారు చేసుకొచ్చిన బియ్యం బంతులను రోడ్డు వెంట నిరసనకారులకు పంచింది.

షాన్ వాన్ పార్కుకు ప్రజల ప్రవాహం చేరుకోవడంతో ర్యాలీ ముగుస్తుందని అధికారికంగా తెలిసిన విషయం. కానీ, అది అక్కడితో ముగియలేదు. ఆ తర్వాత ఆ జనప్రవాహం ఎటు కదులుతుందన్నది ఎవరికీ తెలియదు.
‘‘హాంకాంగ్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది’’ అని చెప్పిందో యువతి. నిండా నలుపు రంగు దుస్తులు ధరించిన ఆ యువతి టెలిగ్రామ్ చాట్‌లో లైవ్ అప్‌డేట్స్ చూస్తోంది.

పరిస్థితులు హింసాత్మకంగా మారితే రంగంలోకి దిగటానికి వైద్య వలంటీర్లు ఒక మండపం కింద తుది సన్నాహాలు చేస్తున్నారు.
‘‘అత్యవసరమైతే గస్తీ బృందాలు ఎక్కడ ఉండాలనిది నిర్ణయిస్తున్నాం’’ అని చెప్పాడు జొనాథన్. అక్కడున్న సుమారు 80 మంది వైద్య వలంటీర్లలో అతనొకడు. వైద్య విద్యార్థి.
కొన్ని వందల మీటర్ల దూరంలో యేంగ్ ఉక్ రోడ్ మీద బారికేడ్లు పెడుతున్నారు. ఈ పారిశ్రామిక వాడలో అదో ప్రధాన రద్దీ రహదారి.
మరోవైపు.. అతివాద నిరసనకారులు వందలాదిగా పోగవుతున్నారు. నల్లటి దుస్తులు ధరించారు. తలల మీద పసుపు రంగు గట్టి టోపీలున్నాయి. వారిలో కొందరు శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనను దాటి వచ్చారు.
ప్రభుత్వం స్పందించాలంటే నిరసనను తీవ్రం చేయటం, పోలీసులను రెచ్చగొట్టటం ఒక్కటే మార్గమని వీరు నమ్ముతున్నారు. టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లను ఎదుర్కోవటానికి సిద్ధపడి వచ్చారు. పోలీసుల మీద విసరటానికి పేవ్మెంట్ల నుంచి ఇటుకలను తవ్వి తీశారు. ఇనుప గేట్లు, వెదురు బొంగులు ఏరుకొచ్చి బారికేడ్లుగా పెడుతున్నారు. వారి పట్టుదల ఏ స్థాయిలో ఉందో ఇది చెప్తోంది.
ఈ దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమే అయినా.. ఈ అతివాద నిరసనకారుల్లో పోరాట తత్వం మరింతగా పెరిగింది. ప్రతి వారం వీరు తమ తీవ్రతను పెంచుతూ పోతున్నారు.
ఇప్పుడు వీళ్లు పెట్రోల్ బాంబులతో వచ్చారు.
16:50 - అల్లర్లను నియంత్రించే పోలీసులు వచ్చారు
అందరికీ టెలిగ్రామ్‌లో అప్‌డేట్ వచ్చింది. దీంతో ఏం జరగబోతోందనే అంచనా ఈ సమూహంలో వ్యాపించింది.
‘‘1650 మంది రయట్ పోలీసులు ముందుకువస్తున్నారు’’ అని ఆ అప్‌డేట్ చెప్పింది.
ఏదో ఉప్పందినట్లుగా ఈ సమూహం యేంగ్ ఉక్ రోడ్డు దిశగా కదిలింది. తమ మద్దతును నినదించటానికి.. నాటకం ఆరంభాన్ని తిలకించటానికి.
అక్కడ రయట్ పోలీసులు రోడ్డు మీద వరుసల్లో నిలుచుని ఉండటం చూశారు. పోలీసుల చేతుల్లోని నిలువెత్తు షీల్డులతో.. వారి ముందు పారదర్శకమైన బుల్లెట్ ప్రూఫ్ గోడగా అమర్చుకున్నారు. సమూహంలో ముందున్నవారిలో, పక్కనున్న వారిలో నడక వంతెనల మీద గుమిగూడిన వారిలో ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసింది.
ఈ ఉద్యమంలో పాల్గొంటున్న చాలా మందికి పోలీసులంటే ద్వేషానికి చిహ్నంగా మారిపోయారు.
నినాదాలు, తిట్లు వెల్లువెత్తాయి. కొందరు నిరసనకారులు ప్రకాశవంతమైన బ్లూ లేజర్ కిరణాలను పోలీసుల మీదకు పంపించారు. పోలీసులను రెచ్చగొట్టటానికి, వారిని గందరగోళ పరచటానికి ఓ ఎత్తుగడ ఇది.
‘‘హాంగ్ కాంగ్ పోలీసులు తెలిసే చట్టాన్ని ఉల్లంఘిస్తారు’’ - ఎవరో అరిచారు.
జనం నినాదాలు చేస్తూ తమ గొడుగులను తమ దగ్గర్లో గట్టిగా ఉన్న ఏదో ఒక వస్తువు మీద చరుస్తూ లయబద్ధంగా పెద్ద డప్పు శబ్దం చేస్తున్నారు.
అకస్మాత్తుగా ముందున్న దుడుకు నిరసనకారులు తమ బారికేడ్లను ముందుకు నెడుతూ వెళ్లారు. పోలీసులకు 50 మీటర్ల దూరంలోకి వచ్చారు. గొడుగులు వేసుకుని.. నీటితో నింపిన ప్లాస్టిక్ బారియర్ల వెనుక వంగి దాక్కున్నారు. వారి చేతుల్లో ఇటుకలు, ఇనుప కడ్డీలు ఉన్నాయి.
పోలీసులు ముందుకు రాకుండా నిలువరించటానికి రోడ్డు మీద కొందరు గుడ్లు విసిరారు. ఇంకొందరు సోప్ పోశారు. బ్యాటరీలు విసిరారు.
‘‘మేం మా మనోభావాలను వ్యక్తీకరించటానికి ప్రయత్నిస్తున్నాం. నిరసనకారులు, పాత్రికేయుల మీద పోలీసులు బలప్రయోగం చేస్తున్నారని మేం అనుకుంటున్నాం. ఇటువంటి పిచ్చితననానికి వ్యతిరేకంగా మాట్లాడాలని, అడ్డుకోవాలని మేం భావిస్తున్నాం’’ అని చెప్పాడు ముందువరుసలో ఉన్న ఒక నిరసనకారుడు. అతడి మొఖం అంతా కప్పేసుకుని ఉన్నాడు.
పోలీసులు ఎరుపు రంగు హెచ్చరిక పతాకాన్ని పైకెత్తారు. ఈ సమూహాలను చెదరగొట్టటానికి బలప్రయోగం చేస్తామనే సంకేతమది. కొన్ని నిమిషాల తర్వాత నల్ల జెండా పైకెత్తారు. ఇక టియర్ గ్యాస్ ప్రయోగిస్తామనే సంకేతంగా.
17:15 - పోరాటం ప్రారంభం
పోలీసులు గ్యాస్ మాస్కులు ధరించారు. తమ షీల్డులు పైకెత్తిపట్టుకుని నిల్చున్నారు. టియర్ గ్యాస్ కాల్పులు జరపటానికి సిద్ధమయ్యారు.
హెచ్చరికకు – టియర్ గ్యాస్ ఫైరింగ్కు మధ్య.. జనం సమీప ప్రాంతాల నుంచి వెళ్లిపోవటానికి వీలుగా కొంత సమయం ఉండాలని పోలీస్ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కానీ నిరసనకారులు భయపడలేదు. ఇప్పుడు టియర్ గ్యాస్ ప్రయోగం మామూలైపోయింది. వాళ్లు కూడా తమ సొంత మాస్కులు ధరించారు.
ఉద్రిక్తంగా 20 నిమిషాలు గడిచాయి. పోలీసులను గేలిచేస్తూ నినాదాలు, గొడుగులతో చప్పుళ్లు చేయటం పెరిగింది.
‘‘ఇప్పుడు పోలీసులు చాలా మంది ఉన్నారు. మాకు కొంత భయంగా ఉంది. రక్షణ పరికరాలు లేనివాళ్లు సురక్షితంగా వెళ్లిపోయేలా చూడాలనుకుంటున్నాం’’ అని చెప్పాడో నిరసనకారుడు. ముందువరుసలో ఉన్న అతడు తలమీద హెల్మెట్, ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడు.
నిరసనకారుల మీద పోలీసులు మొదటి రౌండ్ టియర్ గ్యాస్ పేల్చుతుంటే.. నిరసనకారులు తమ సొంత ఆయుధాలనూ సిద్ధం చేసుకున్నారు. అవి మొలోతోవ్ కాక్టెయిల్స్ – అంటే సొంతంగా తయారుచేసుకున్న పెట్రోల్ బాంబులు.
బాష్పవాయువు ఈ సమూహంలోకి వ్యాపిస్తోంటే.. వీరు తొలి విడత పెట్రోల్ బాంబులు విసిరారు. అవి ఇరుపక్షాల మధ్య ఉన్న ఖాళీ ప్రాంతంలో పడ్డాయి.
బాష్పవాయు గోళాలు రోడ్డు మీద పడగానే వాటిని ఆర్పివేయటానికి వాటర్ గన్లు ధరించిన కొందరు నిరసనకారులు పరుగు తీశారు.
రక్షణ కోసం భుజాలకు స్విమ్మింగ్ ఫ్లోట్స్ ధరించిన ఒక వ్యక్తి చేతిలో టెన్నిస్ రాకెట్ పట్టుకుని.. పోలీసులు పేల్చే బాష్పవాయుగోళాలను వారిమీదకే తిప్పికొట్టటం మొదలుపెట్టాడు.

ఇంకొంతమంది తాము తెచ్చిన ఇటుకలు, బాణాలు విసిరారు. వెదురు బొంగులు, ఇనుప గేట్లు, సైన్బోర్డులు కూడా పోలీసుల వైపు గాలిలో దూసుకుపోయాయి.
కొంతమంది తమ చేతుల్లోని గొడుగులతో టియర్ గ్యాస్ గోళాలను ఒడిసి పట్టుకుని.. వాటిని మళ్లీ పోలీసుల వైపు విసురుతున్నారు.
పొడవాటి జుట్టున్న ఓ వ్యక్తి బాష్పవాయువులోని సీఎస్ గ్యాస్ను పీల్చటంతో మోకాళ్లపై కూలబడ్డాడు. ఆ గ్యాస్ పీల్చుకుంటే కళ్లుతిరగటంతో పాటు శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. అతడికి ఎవరో ఒక వాటర్ బాటిల్ అందించారు. ఆ నీటిని ముఖం మీద పోసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఒక విద్యార్థినికి టియర్ గ్యాస్ నుంచి తనను తాను రక్షించుకోవటానికి ఏమీ లేదు. ఇరవయ్యేళ్లున్న ఆ యువతి ఇంతకుముందు శాంతియుత ప్రదర్శనలో పాల్గొంది. భాష్పవాయువు ప్రభావం ఆమెకు కొత్త.
‘‘నేను భయపడటం లేదు. మానసికంగా దీనికి సిద్ధపడే ఉన్నా’’ అని చెప్పిందామె.
భాష్పవాయువు ప్రభావానికి గురైన నిరసనకారులకు సమీపంలోని ఒక షాపింగ్ సెంటర్‌లో వైద్య వలంటీర్లు సాయం చేస్తున్నారు. గ్యాస్ ప్రభావంతో ఎర్రబడిన వారి కళ్లను ఉప్పు నీటితో కడుగుతున్నారు. పొగ పీల్చుకుని వాంతులు చేసుకుంటున్న వారికి సపర్యలు చేస్తున్నారు.
18:00
టెలిగ్రామ్‌లో కొత్త హెచ్చరిక వచ్చింది. ఈ ప్రాంతంలో వాటర్ క్యానన్ (నీటి ఫిరంగుల) ట్రక్కులు కనిపించాయని.
కొంతమంది పాదచారుల వంతెన మీదకు ఎక్కి అక్కడి నుంచి పెట్రోల్ బాంబులు, ఇటుకలు విసురుతున్నారు. వారిని ఆపటానికి డజన్ల మంది పోలీసులు మెట్ల మీదుగా పరుగెత్తారు.
![ELEGRAM CHAT ON 25 AUGUST (NIGHT OF PROTEST) 8.25 Tsuen-Kwai-Tsing March public group 2,340 members, 102 online. HK add oil: Two water cannons are coming from Sham Tseng [Water cannon Video] 17:12 Tofu: Leave! 17:12 Love 852: #TsuenKwaiChingMarch #evacuation route 17:12 Little Otaku: Forwarded Message From: 612 reminder 1712, black flag raised outside of CityWalk 17:13 . . FreedomNow: TG fired on Yeung Uk Road. 17:34 Sandy: Leave! Be water 17:34](https://news.files.bbci.co.uk/include/extra/shorthand/assets/telugu/Fdxr7xfAF3/assets/8ZRW0kq76S/900x_hong_kong_shorthand_telegram_2-918x2883.png)
అనువాదం, మార్పులు చేసిన టెలిగ్రామ్ చాటింగ్ ఇది. పేర్లు మార్చాం.
అనువాదం, మార్పులు చేసిన టెలిగ్రామ్ చాటింగ్ ఇది. పేర్లు మార్చాం.
18:30
నిరసనకారుల్లో చాలా మంది తమ తమ స్థానాల్లో స్థిరంగా ఉన్నారు. చాలా మంది కిందికి వంగి.. నేల మీద, రెయిలింగ్స్ మీద తమ చేతుల్లోని ఇనుప కడ్డీలు, వెదురు బొంగులతో కొడుతూ ఉన్నారు.
కొంతమంది పాదచారుల వంతెన మీదకు ఎక్కి అక్కడి నుంచి పెట్రోల్ బాంబులు, ఇటుకలు విసురుతున్నారు. వారిని ఆపటానికి డజన్ల మంది పోలీసులు మెట్ల మీదుగా పరుగెత్తారు.
18:53
రెండు వాటర్ క్యానన్ ట్రక్కులు ప్రధాన రహదారి మీదకు వచ్చాయి. వాటి వెనుకే పోలీసుల వరుస కూడా వచ్చింది. అప్పుడు పోరాటం ఆగింది.
శక్తివంతమైన నీటి గన్లతో రోడ్డు మీద బాష్పవాయుగోళాలు, ఇటుకలు, వెదురు బొంగుల మీదకు నీటిని చిమ్మారు. నిరసనకారులు నెమ్మదిగా వెనుకంజవేశారు.

యెంగ్ ఉక్ రోడ్డు మీద ఆగస్టు 25 నాటి సంఘర్షణ ఎంత తీవ్రమైనదైనా.. ఆ దృశ్యాలతో హాంగ్ కాంగ్ను ఇప్పుడికేమాత్రం దిగ్భ్రాంతికి గురిచేయలేదు.
కానీ.. ఆ తర్వాత జరిగిన ఘటనే ప్రతి ఒక్కరినీ షాక్కు గురిచేసింది.


చట్టవ్యతిరేకంగా సమావేశమవటం, ఆయుధాలు కలిగివుండటం, పోలీసులపై దాడి చేయటం నేరారోపణలతో ఆదివారం నిర్బంధించిన 54 మందిలో ఒక 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు అతడు. అతడి అరెస్ట్ వార్త ఆన్‌లైన్‌లో వ్యాపించింది.
ఆ బాలుడు తనని అరెస్ట్ చేస్తున్నపుడు అతడు అరుస్తూ తన కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నంబర్లు చెప్పాడు. ఒక సామాజిక కార్యకర్త వారిని సంప్రదించాడని అనంతరం ఆ బాలుడిని బెయిల్ మీద విడుదల చేశారని మాకు తర్వాత తెలిసింది.
యెంగ్ ఉక్ రోడ్డు మీద ఘర్షణ తర్వాత త్సూయెన్ వాన్ ఇరుకు సందుల్లో కొంత మంది యువకులు నాటు ఆయుధాలతో చిన్న చిన్న గుంపులుగా తిరిగారు. వాటర్ క్యానన్ ట్రక్కులు ఆ వీధుల్లో పట్టవు.
19:30 - గాలిలోకి తుపాకీ కాల్చారు
సుమారు 19:30 గంటలకు పోలీసు బృందానికి ఒక నిరసనకారుల బృందం ఎదురుపడింది.
ఒక పోలీస్ అధికారి తన షీల్డ్ ఎత్తిపట్టుకుని.. గాలిలోకి తూటా పేల్చాడు. పన్నెండు వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనల్లో పోలీసులు నిజమైన తూటాను ఉపయోగించటం ఇదే ప్రధమం.
వెంటనే మరో ఐదుగురు పోలీసులు తమ తుపాకులు బయటకు తీసి నిరసనకారుల మీదకు ఉరికారు.
ఈ పోలీసుల బృందం కళ్లు పెద్దవి చేస్తూ తుపాకులు చేతపట్టుకున్న ఆ క్షణం – ఆ దృశ్యం ఆ రాత్రికి నిర్వచనం చెప్పే దృశ్యంగా మారింది.

పోలీసులు ముందుకు వస్తూ.. మధ్యలో బనియన్, షార్ట్స్ ధరించిన ఒక మధ్య వయస్కుడిని కాలితో తన్నారు. అతడి చేతిలో ఒక్క గొడుగు మాత్రమే ఉంది. అతడు తనను షూట్ చేయవద్దని ప్రాధేయపడుతూ మోకాళ్లపై కూలబడ్డాడు.

Lam Yik Fei /NYT/eyevine
Lam Yik Fei /NYT/eyevine
కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటో పోలీసుల క్రూరత్వానికి అది ఉదాహరణగా చెప్తూ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తియానాన్మెన్ స్క్వేర్లో ట్యాంక్ మ్యాన్ ఫొటోతో – మూడు దశాబ్దాల కిందట చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన రక్తపాత ఉదంతంలో యుద్ధ ట్యాంకుల వరుసను.. ఎటువంటి ఆయుధాలూ లేకుండా చేతిలో షాపింగ్ సంచులు పట్టుకుని ఎదుర్కొన్న ఒక వ్యక్తి సంచలన ఫొటోతో దీనిని పోల్చటం కూడా మొదలైంది.

కానీ.. ఈ మొత్తం దృశ్యాలను పలు కోణాల నుంచి నిశితంగా పరిశీలిస్తే.. 2019 ఆగస్ట్ 25 నాటి కథ దానికన్నా చాలా సంక్లిష్టమైన కథ అని తెలుస్తుంది.
ఆ సమయంలో పోలీసులు తమను తాము రక్షించుకోవటానికి వేరే మార్గం లేకపోయిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ సంఘర్షణ అనంతరం నిరసనకారులు చెదిరిపోయి దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోయారు. షామ్ షూ పో, త్సిమ్ షా త్సూ, క్రాస్ హార్బర్ టన్నెల్లలో కనిపించారు.
ఇలా వెనుదిరిగే క్రమంలో నిరసనకారులు ‘బి వాటర్’ (నీటిలా ఉండటం) అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు.
వేగంగా మారే పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవటానికి వీలుగా ఉండాల్సిన ప్రాధాన్యతను వివరిస్తూ ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం బ్రూస్ లీ చెప్పిన మాట అది.
హాంగ్ కాంగ్‌లో.. వేగంగా మారే పరిస్థితులకు తగ్గట్టు ఒదిగిపోవటం కోసం నిరసనకారుల నినాదంగా మారిందీ మాట.
కాబట్టి.. పోలీసులను ఏమార్చే ప్రయత్నంలో భాగంగా నిరసనకారులు వేగంగా నగరంలోని ఇతర ప్రాంతాలకు కదిలిపోతారు.

త్సూన్ వాన్‌లో ఆ సాయంత్రం హింస మొదలవుతున్నపుడు.. అక్కడి ఇళ్లలో నివసించే చాలా మంది పౌరులు వీధుల్లో వరుసగా నిలుచుని నినరసకారులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు.
చైనాకు అనుకూలమైన వారివి కావచ్చునని తాము భావించిన కొన్ని స్థానిక దుకాణాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్నట్లుగా భావించే నేర ముఠాలు మళ్లీ రంగంలోకి దిగుతాయన్న భయాలు చెలరేగాయి.
జూలై చివర్లో తెల్లదుస్తులు ధరించిన పురుషులు యెన్ లాంగ్ జిల్లాలో నల్ల దుస్తులు ధరించిన నిరసనకారుల మీద దాడులు చేశారు. ఆ తెల్లదుస్తులు ధరించిన వారిని నేర ముఠాలుగా భావిస్తున్నారు. త్సూన్ వాన్‌లో సైతం కొన్ని వారాల కిందటే ఒక నిరసనకారుడి మీద కత్తి దాడి జరిగింది.
ఇదిలావుంటే.. షామ్ షుయ్ పో జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ వెలుపల ఒంటరిగా ఉన్న ఓ వ్యక్తి.. నిరసనకారులను ధిక్కరిస్తూ చైనా జెండా ఊపుతూ కనిపించాడు. నిరసనకారులు ద్వేషించే రెండు చిహ్నాలు అవి.. చైనా జెండా, పోలీస్ స్టేషన్. దీంతో నల్లదుస్తులు ధరించిన నిరసనకారులు ఆగ్రహంతో తిడుతూ ముందుకెళ్లారు.
ఆ వ్యక్తిని పోలీసులు వేగంగా స్టేషన్ లోపలికి లాక్కెళ్లారు. అతడిని రక్షించటం కోసమే వారు అలా చేసినట్లు కనిపించింది.
ఈ నిరసన ఉద్యమం తమ దైనందిన జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తున్నా కానీ హాంగ్ కాంగ్ ప్రజలు దీనికి ఇంకా మద్దతిస్తూనే ఉన్నారు. రెండు రకాల నిరసనకారుల మధ్య ఒక అవగాహన ఉంది.
చాలా దుడుకుగా ముందుకెళుతున్న వాళ్లు చాలా ప్రమాదానికి సిద్ధమవుతున్నారు కాబట్టి.. తాము పెద్ద సంఖ్యలో వీధుల్లోకి రావాలని చాలా శాంతియుతంగా ఉండే వాళ్లు భావిస్తున్నారు.
పాటర్ అనే నిర్వాహకుడు తన శాంతియుత నిరసన ప్రదర్శనలో హింసాత్మక ఘటనలు తలెత్తినప్పటికీ.. అతివాద నిరసనకారులకు తాను దూరం జరగబోనని చెప్తున్నాడు. ఎందుకంటే తమవందరి లక్ష్యమూ ఒకటేనని అంటాడు.
‘‘మా ప్రతిఘటనను తీవ్రతరం చేసే ధైర్యం మాకు లేకపోతే.. మేం నమ్మకం కోల్పోతాం. నిరాశావాదం మమ్మల్ని నిస్సహాయులను చేస్తుంది’’ అని చెప్తాడు.

క్రెడిట్స్:
రచయితలు: సైరా అషర్, గ్రేస్ త్సోయ్
అడిషనల్ రిపోర్టింగ్: డానీ విన్సెంట్, ఫాన్ వాంగ్
ఫొటోలు: కర్టిస్‌లో
గ్రాఫిక్స్: సీన్ విల్మాట్
వీడియో: టెస్సా వాంగ్, కర్టిస్ లో, ఆండ్రియాస్ ఇల్మర్
అదనపు ఫొటోలు: లామ్ యిక్ ఫే / ఎన్వైటీ / ఐవైన్, రాయిటర్స్, గెటీ ఇమేజెస్
డిజైన్: సీన్ విల్‌మోట్
ప్రొడ్యూసర్: జేమ్స్ పెర్సీ
ఎడిటర్స్: కాథరిన్ వెస్ట్కాట్, సమంతి దిస్సనాయకే
మరిన్ని కథనాలు
చార్మినార్: ఈ అపూర్వ కట్టడం ఇప్పుడెలా ఉంది?
ఈ బాలుడు 30 ఏళ్ల తరువాత తల్లిని ఎలా కలిశాడు?
Publication date: 30 August 2019

