ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినట్లే ఉత్తర కొరియా కూడా దక్షిణా కొరియాకు షాక్ ఇస్తుందా... కిమ్ జోంగ్ ఉన్ అంత పనీ చేస్తారా?

    • రచయిత, జీన్ మెకంజీ
    • హోదా, సియోల్ కరస్పాండెంట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆస్టిన్‌కు ఓ అభ్యర్థన చేశారు.

హమాస్ తరహా వ్యూహాలతో ఉత్తర కొరియా కూడా హఠాత్తుగా దాడులు చేసే అవకాశాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆస్టిన్‌ను కోరారు.

అక్టోబరు7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడులు చేసినప్పటి నుంచి ఉత్తరకొరియా కూడా అటువంటి ఎత్తుగడలతో విరుచుకుపడుతుందేమోనని దక్షిణకొరియా రాజకీయనాయకులు, అధికారులు భయపడుతున్నారు.

కిందటి నెలలో దక్షిణకొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా ఉత్తరకొరియా హమాస్ తరహా దండయాత్రకు పాల్పడేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అయితే, దక్షిణ కొరియాకు నిజంగానే ఇటువంటి ప్రమాదం పొంచి ఉందా? లేక హమాస్ దాడి, దక్షిణ కొరియా తన రక్షణబలాన్నిమరింత పెంచుకుని, ఉత్తరకొరియాతో పోరుకు సర్వసన్నద్ధంగా ఉండేందుకు అవకాశం ఇచ్చిందా?

హమాస్ ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులతోపాటు, గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన ఫైటర్లను ఇజ్రాయెల్లోకి చొరబడేలా చేసింది. దీనిని హైబ్రిడ్ యుద్ధ వ్యూహానికి ఓ ఉదాహరణగా చెపుతున్నారు.

అయితే, హైబ్రిడ్ యుద్ధంలోకి ఉత్తరకొరియా దిగితే దక్షిణ కొరియా ఇబ్బందిపడక తప్పదని 21 సెంచరీ మిలటరీ స్టడీస్ ఇనిస్టిట్యూట్ ‌లో పరిశోధకుడుగా ఉన్న ర్యూసుంగ్-యెప్ చెప్పారు.

అక్టోబరు 7వ తేదీ తెల్లవారకముందే హమాస్ ఇజ్రాయెల్‌పై 5వేల రాకెట్లను ప్రయోగించింది. అయితే ప్యోంగ్యాంగ్ (ఉత్తర కొరియా రాజధాని) ఫిరంగులకు గంటకు 16వేల రౌండ్లను పేల్చగల సామర్థ్యం ఉంది. ఈ పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తరహాలో దక్షిణ కొరియా కూడా ఐరన్‌డోమ్ లా తన సొంత రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటోంది.

గాజా తరహాలోనే ఉత్తర కొరియా కూడా భూగర్భ సొరంగాల నెట్ వర్క్‌ను నిర్మించి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీటిల్లో కొన్నింటిని ఆయుధాలతో నింపి ఉంచారని, పెద్దఎత్తున దండయాత్రకు దిగిన సందర్భంలో వీటిని ఉపయోగించుకుంటారని భావిస్తున్నారు.

నార్త్ నుంచి నిజంగానే ముప్పు ఉందా?

దశాబ్దాల తరబడి ఉత్తర, దక్షిణ కొరియాల వైరం అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరాయి.

13ఏళ్ళ కిందట దక్షిణ కొరియాకు చెందిన ద్వీపాన్ని ఉత్తరకొరియా చుట్టుముట్టి ఇద్దరు నావికులను,ఇద్దరు పౌరులను హతమార్చింది.

అప్పటి నుంచి ఉత్తరకొరియా వ్యూహాలకు పదును పెరిగిందని, దాని లక్ష్యం దక్షిణకొరియా సరిహద్దులు దాటడం కాదని, రాజధాని సియోల్‌ను ధ్వంసం చేయడమేనని భద్రతా నిపుణులు చెపుతున్నారు.

‘‘హమాస్ తక్కువ దూరంలోని లక్ష్యాలను చేధించే రాకెట్లపై ఆదారపడిందని, కానీ ఉత్తరకొరియా దగ్గర విస్తృతమైన ఫిరంగుల శ్రేణి ఉందని. వీటి పేలుడు సామర్థ్యం హమాస్‌ను మించి ఎన్నోరెట్లు ఎక్కువ’’ అని కొరియా ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేషన్ లో నార్త్ కొరియాన్ రీసెర్చ్ డైరక్టర్‌గా ఉన్న హోంగ్ మిన్ చెప్పారు.

ఇటీవల కాలంలో ప్యోంగ్యాంగ్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ముఖ్యంగా అణ్వాయుధాలతోపాటు కీలకమైన అణ్వాయుధాలను మోసుకుపోగల షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్టు చెపుతున్నారు. దీన్నిబట్టి చూస్తే హమాస్ తరహా వ్యూహాలను ఉత్తరకొరియా అనుసరిస్తుందని చెప్పలేం.

‘‘ఉత్తర కొరియా ఓ సార్వభౌమదేశం, దానికి తన సొంత ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయి’’ అని ప్రభుత్వ మాజీ రక్షణ సలహాదారు చో సియోంగ్ రైల్ చెప్పారు.

‘‘ఉత్తర కొరియా ఇప్పటికిప్పుడు యుద్ధం చేయాలని తహతహలాడటంలేద’ని కియాంగ్నమ్ వర్సిటీలో మిలటరీ స్టడీస్ ప్రొఫెసర్‌ చో చెప్పారు.

ఒకవేళ దక్షిణ కొరియాపై ఎటువంటి దాడి జరిపినా అది కిమ్ ప్రభుత్వపతనానికి దారితీస్తుందని ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా పదేపదే స్పష్టం చేస్తున్నాయి. కిమ్‌కు కూడా తన అధికారాన్ని నిలుపుకోవడానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

2018 ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా?

ఇజ్రాయెల్ పై దాడి తరువాత దక్షిణ కొరియాలోని సంప్రదాయ ప్రభుత్వాన్ని సరిహద్దు వెంబడి భద్రత బలంగా ఉందా, లేక మరింత బలోపేతం చేయాలా అనే ప్రశ్నకు గురిచేసింది.

దక్షిణ కొరియా పాలకులు నార్త్ కొరియాపై కఠినవైఖరి తీసుకుంటున్నారు. మిటలరీ బలోపేతానికి ప్రాధాన్యమిస్తున్నారు.

ప్రత్యేకించి సరిహద్దు వెంబడి దాడులు, వాదోపవాదాలను నియంత్రించేందుకు మునుపటి దక్షిణ కొరియా ప్రభుత్వం 2018లో ఉత్తరకొరియాతో చేసుకున్న సైనిక ఒప్పందాన్ని ప్రస్తుత ప్రభుత్వం తప్పుపడుతోంది.

ఈ ఒప్పదంలో సరిహద్దు వెంబడి ఇరుపక్షాలు యుద్ధవిమానాలు, నిఘాపరికరాలను ఎగురవేయకుండా నిషిద్ధ గగనతలాన్ని సృష్టించారు.

సరిహద్దు వద్ద ఉత్తర కొరియా నిఘాడ్రోన్‌లను ఉపయోగించడంతో ఇటీవల దక్షిణకొరియా రక్షణ మంత్రిగా నియమితులైన షిన్ వాన్ సిక్ ఈ ఒప్పందాన్ని బుట్టదాఖలా చేయాలని ప్రతిపాదించారు.

‘‘ 2018 సైనిక ఒప్పందం మా నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించిందని’’ హమాస్ దాడుల నేపథ్యంలో షిన్ చెప్పారు.

ఇజ్రాయెల్ కనుక తన సరిహద్దు వద్ద మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే మరణాల సంఖ్యను తగ్గించి ఉండగలిగేదని తెలిపారు.

2018 నుంచి ఉత్తర కొరియా అనేకసార్లు ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ సరిహద్దుల వద్ద వాగ్విదాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఒప్పందాన్ని వదిలించుకుంటే ఉద్రిక్తతలు పెరగడమే కాకుండా, దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని కొందరు నిపుణులు చెపుతున్నారు.

‘‘ఒప్పందాన్ని వదిలించుకోవడం వలన సరిహద్దుల వద్ద పర్యవేక్షణను మెరుగుపరుచుకునే అవకాశం దొరుకుతుంది, కానీ చెప్పుకోదగ్గ స్థాయిలోకాదు’’ అని కొరియా ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ యూనిఫికేసన్ కు చెందిన హోంగ్ మిన్ చెప్పారు.

‘‘ఉత్తర కొరియా దాడి చేయకుండా చూడటంపైనే ముందుగా దృష్టి కేంద్రీకరించాలని, ఈ సమయంలో ఉత్తరకొరియా దగ్గర ఉన్న అన్ని ఆయుధాలనుంచి రక్షణ కల్పించడం ఏ దేశానికి సాధ్యం కాదు’’ అని హోంగ్ చెప్పారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)