కోనసీమ: ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్ లీక్, చెలరేగిన మంటలు - 13 ఫోటోలలో

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ బావినుంచి గ్యాస్ లీకై, మంటలు చెలరేగాయి.

సోమవారం (జనవరి5వతేదీ) ఉదయం 11. 30 గంటల ప్రాంతంలో ఓఎన్‌జీఎసీ బావి నుంచి అధికపీడనంతో కూడిన వాయువులు వెలువడిన కారణంగా మంటలు చెలరేగినట్టు జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ మీడియాకు చెప్పారు.

బ్లో అవుట్ ప్రాంతాన్ని కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. 1993 నుంచి ఆపరేషన్ లో ఉన్న బావిలో ఈ బ్లో అవుట్ సంభవించిందని చెప్పారు.

ఈ బావిని 2024లో డీప్ అనే కంపెనీకి సబ్ లీజ్‌కు ఇచ్చారని 2,500 మీటర్ల లోతులో వాయునిక్షేపాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని,. ఊహించినదానికంటే పెద్దఎత్తున గ్యాస్ బయటకు వచ్చిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12.30గంటలకు మంటలు మొదలయ్యాయని చెప్పారు.

మొత్తంగా 20,000 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

ఓఎన్‌జీసీ బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు.

మంటలను నియంత్రించడానికి ప్రాథమికంగా మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.

ముందుగా గ్యాస్‌ పొగమంచులా వ్యాపించింది. గ్యాస్‌ వాసన రావడాన్ని గుర్తించిన గ్రామస్తులు ఓఎన్‌జీసీ సిబ్బందికి సమాచారం అందించారు.

కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా బీబీసీతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదనీ, ఎవ్వరూ గాయపడలేదని చెప్పారు.

గ్రామానికి దూరంగా కొబ్బరితోటల్లో ఈ గ్యాస్ బావి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మలికిపురం తాసిల్దార్ శ్రీనివాసరావు బీబీసీ తో మాట్లాడుతూ పరిస్థితి అంత అదుపులో ఉందని, ఇరుసుమండ గ్రామస్తులను తూర్పు పాలెం, కేసనపల్లి గ్రామాలకు తరలించామని ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు

ఓఎన్‌జీసీ బావి నుంచి గ్యాస్ లీకవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు.మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌తోపాటు అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.

గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని... వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మంటలను వెంటనే అదుపులోకి అధికారులను సీఎం ఆదేశించారు.

మరోపక్క ఈ ఘటనపై ఓఎన్‌జీసీ కూడా ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గ్యాస్ లీకైన విషయం డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలియజేసిందని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే బావిని మూసివేయడానికి వీలైన సన్నాహాకాలు చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ బావి నియంత్రణ నిపుణులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)