90 సెకన్ల ముందే పరీక్ష ముగించారంటూ సుమారు రూ. 12 లక్షల పరిహారం డిమాండ్ చేస్తున్న విద్యార్థులు

    • రచయిత, ఫాన్ వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

షెడ్యూల్ సమయాని కంటే 90 సెకన్ల ముందు ఎగ్జామ్‌ను ముగించారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై దావా వేస్తున్నారు విద్యార్థులు.

కాలేజీ ప్రవేశ పరీక్ష సందర్భంగా దక్షిణ కొరియాలో ఈ ఘటన జరిగింది.

మళ్లీ ఈ పరీక్ష రాయడానికి ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చును ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రతీ ఒక్కరికి స్థానిక కరెన్సీలో 20 మిలియన్ వోన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.12.76 లక్షల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు.

ఈ పొరపాటుతో మిగిలిన పేపర్లను విద్యార్థులు సరిగా రాయలేకపోయారని విద్యార్థుల తరఫు లాయర్ వాదించారు.

దక్షిణ కొరియాలో నిర్వహించే కాలేజీ ప్రవేశ పరీక్ష పేరు ‘సునెంగ్’. ఈ పరీక్ష 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. వెంటవెంటనే ఒకదాని తర్వాత మరొక సబ్జెక్టులో పరీక్ష రాస్తారు.

ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో సునెంగ్‌ ఒకటి. దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది.

యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్, ఉద్యోగాలను మాత్రమే కాకుండా భవిష్యత్‌ ఎదుగుదలకు కూడా ఈ పరీక్ష కీలకం.

ఏడాదికోసారి జరిగే ఈ పరీక్ష రాసేటప్పుడు విద్యార్థుల ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో అధికారులు చాలా రకాల చర్యలు తీసుకున్నారు.

దేశ గగనతలాన్ని మూసేయడం, స్టాక్ మార్కెట్‌ను ఆలస్యంగా ప్రారంభించడం వంటివి ఈ చర్యలలో భాగమే.

ఈ ఏడాది జరిగిన సునెంగ్ పరీక్షా ఫలితాలు డిసెంబర్ 8న విడుదలయ్యాయి.

‘‘సియోల్‌లోని ఒక పరీక్షా కేంద్రంలో నిర్ణీత సమయం కంటే ముందుగా బెల్‌ను మోగించారు. తొలి సబ్జెక్టు అయిన కొరియన్ పేపర్ రాస్తుండగా ఇలా జరిగిందంటూ’’ మంగళవారం దాఖలు చేసిన దావాలో విద్యార్థులు పేర్కొన్నారు. 39 మందికి పైగా విద్యార్థులు ఈ విషయం మీద దావా వేశారు.

గంట తొందరగా మోగడంతో వెంటనే కొందరు విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ సూపర్‌వైజర్లు తమ పేపర్లను తీసుకున్నారని వారు చెప్పారు.

జరిగిన పొరపాటును తర్వాతి సెషన్‌ ప్రారంభానికి ముందు టీచర్లు గుర్తించారు. లంచ్ బ్రేక్ సమయంలో విద్యార్థులకు ఒకటిన్నర నిమిషం ఇచ్చిన టీచర్లు వదిలేసిన ఖాళీలను మాత్రమే పూరించాలని, ఇప్పటికే రాసిన సమాధానాలను మార్చకూడదని చెప్పారు.

ఇలా జరగడంతో మిగిలిన పరీక్షపై విద్యార్థులు దృష్టి సారించలేకపోయారని, విద్యార్థులు చాలా కలత చెందారని యోనాప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

కొందరు విద్యార్థులు పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయారని యోనాప్ తెలిపింది.

జరిగిన పొరపాటుకు విద్యాశాఖ అధికారులు క్షమాపణలు చెప్పలేదని స్థానిక మీడియాతో విద్యార్థుల తరఫు లాయర్ కిమ్ సుక్ అన్నారు.

ఆ పరీక్ష కేంద్రానికి బాధ్యత వహించిన సూపర్‌వైజర్ సమయం విషయంలో పొరపాటుపడ్డారని అధికారులను ఉటంకిస్తూ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ కేబీఎస్ పేర్కొంది.

ముందుగా గంటను మోగించారంటూ విద్యార్థులు దావా వేయడం ఇదే మొదటిసారి కాదు.

2021 సునెంగ్ పరీక్ష సందర్భంగా 2 నిమిషాల ముందుగా బెల్‌ను మోగించడంతో తమకు నష్టం కలిగిందని విద్యార్థులు దావా వేయడంతో విద్యార్థులకు 7 మిలియన్ వోన్ల (రూ. 4.46 లక్షలు)ను ఇవ్వాలని సియోల్ కోర్టు తీర్పునిచ్చింది.

2012లో నేషనల్ కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సందర్భంగా హునాన్ ప్రావిన్సు పరీక్షా కేంద్రంలో 4 నిమిషాల 48 సెకన్ల ముందుగా బెల్ మోగించిన ఒక వ్యక్తిపై ఒక సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)