You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సైబర్ క్రైమ్: పోలీసులు మైనర్లను విచారించవచ్చా, నిబంధనలేంటి?
- రచయిత, నవదీప్ కౌర్ గ్రేవల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చండీగఢ్‌ను ఆనుకుని ఉన్న జిరాక్‌పూర్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి మౌలిక్ వర్మ ఆత్మహత్య కేసుతో పోలీసులు మైనర్లతో వ్యవహరించే విధానంపై చర్చ జరుగుతోంది.
గత శనివారం(మార్చి 22) జిరాక్‌పూర్‌లోని తన ఇంట్లో మౌలిక్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మౌలిక్ వర్మ కుటుంబం ఇప్పటికే జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసింది.
విద్యార్థి ఆత్మహత్యకు కారణమేంటి?
మౌలిక్ వర్మ చండీగఢ్, సెక్టార్ 21లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పాఠశాల ఉపాధ్యాయులపై అభ్యంతరకరమైన పోస్టులు కనిపించడంతో, స్కూల్ యాజమాన్యం చండీగఢ్ సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేసింది.
సైబర్ సెల్ ఒక ఐపీ చిరునామాను గుర్తించి కొంతమంది విద్యార్థులను ప్రశ్నించింది.
మౌలిక్ వర్మను కూడా సెక్టార్ 17లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు హింసించడంతోనే మౌలిక్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.
మౌలిక్ కుటుంబ సభ్యుల ఆరోపణలేంటి?
పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఇతర విద్యార్థుల్లో ఒకరిని హింసించారని, ఆ బాలుడి దగ్గర నుంచి ఇతర విద్యార్థుల పేర్లు అడిగి తీసుకున్నారనీ, అందులో భాగంగానే మౌలిక్‌ను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిచారని మౌలిక్ మామ శుభ్‌నీత్ చెప్పారు.
ఫేక్ అని చెబుతున్న ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సృష్టించినవారిలో మౌలిక్ లేరని శుభ్‌నీత్ తెలిపారు. కొన్ని నెలల కిందట మొదటిసారి ఈ వ్యవహారం బయటికి వచ్చినప్పుడు మౌలిక్‌కు ఇందులో ప్రమేయం లేదని టీచర్లు కూడా అంగీకరించారని ఆయన చెప్పారు.
ఒక మైనర్‌ను తల్లిదండ్రుల తోడు లేకుండా ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు ఎలా పిలిపించారని శుభ్‌నీత్ ప్రశ్నించారు.
''మౌలిక్ తల్లిని పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. కానీ ఆమె జలంధర్ వెళ్లారు. దీంతో ఆమె ఈ విషయం మౌలిక్‌కు చెప్పలేదు. కానీ మౌలిక్‌ను అప్పటికే స్టేషన్‌కు పిలిపించారని ఆమెకు తెలియదు'' అని శుభ్‌నీత్ తెలిపారు.
ఇతర పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నారని, కానీ మౌలిక్ ఒంటరిగా ఉన్నారని, జలంధర్ నుండి మౌలిక్ తల్లి జిరాక్‌పూర్‌లోని తన ఇంటికి చేరుకునే సమయానికి, మౌలిక్ ఆత్మహత్య చేసుకున్నాడని శుభ్‌నీత్ ఆవేదన వ్యక్తంచేశారు.
మౌలిక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత, ఆయన స్నేహితులకు ఫోన్ చేసినప్పుడు, పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం, అక్కడేం జరిగిందన్న విషయం తమకు తెలిసిందని శుభ్‌నీత్ అన్నారు.
''ప్రతి విద్యార్థిని ఒక ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి కొట్టారని, తమ కొడుకును తమ కళ్ల ముందే కొట్టినట్లు మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు'' అని శుభ్‌నీత్ తెలిపారు.
‘‘స్టేట్‌మెంట్‌పై సంతకం చేయమని పోలీసులు నన్ను ఒత్తిడి చేశారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నా కోసం ఆమె ఎవరినైనా ప్రాధేయపడడం నాకిష్టం లేదు. ఈ ఒత్తిడితోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా'' అని సూసైడ్ నోట్‌లో మౌలిక్ రాసినట్టు శుభ్‌నీత్ చెప్పారు.
స్కూల్ విద్యార్థులు మీమ్స్ తయారు చేస్తున్నారని తెలియదు - ప్రిన్సిపల్
చండీగఢ్‌లోని సెక్టార్ 21లో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ సుఖ్‌పాల్ కౌర్ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.
ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌తో అసభ్యకర మీమ్‌లు, తీవ్ర అభ్యంతరకరమైన పోస్టులు చేశారని, దీనిపై స్కూలు తరఫున చండీగఢ్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశామని ప్రిన్సిపల్ తెలిపారు.
పోలీసు స్టేషన్ దగ్గర విద్యార్థులను విచారించినప్పుడు తాను అక్కడే ఉన్నానని, పోలీసులు ఎవరినీ కొట్టలేదని సుఖ్‌పాల్‌కౌర్ చెప్పారు.
ఆ పోస్టులు చేసిన వారిని గుర్తించి, ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను నిలిపివేయాలని కోరామని తెలిపారు.
స్టేషన్‌లో మౌలిక్ వర్మను తాను చూడలేదని, పోలీసులు అతని పేరును ప్రస్తావించలేదని, తన ముందుకు కూడా పిలిపించలేదని సుఖ్‌పాల్ అన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తాను సలహా ఇచ్చానని, పిల్లలను తిట్టవద్దని చెప్పానని సుఖ్‌పాల్ కౌర్ వెల్లడించారు.
మౌలిక్‌ను పాఠశాలలో కూడా మందలించారనే ఆరోపణల గురించి మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి పదకొండవ తరగతి విద్యార్థులను లేదా వారి తల్లిదండ్రులను తాను ఎప్పుడూ పిలిపించలేదని కౌర్ స్పష్టం చేశారు.
ఈ పోస్టులు ఎవరైనా చేసి ఉంటే, ఆపేయాలని స్కూల్ అసెంబ్లీలో ప్రకటించామన్నారు.
పోలీసులేమంటున్నారు?
చండీగఢ్ సైబర్ సెల్ ఎస్పీ గీతాంజలి ఖండేల్వాల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు.
‘‘నకిలీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా పాఠశాల ఉపాధ్యాయుల గురించి అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ అయినట్లు ఫిర్యాదు అందిన తర్వాత సైబర్ సెల్ సదరు ఐపీ చిరునామాను గుర్తించింది. ఆ ఐపీ అడ్రస్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తిని సంప్రదించి ఆయన కొడుకును తీసుకొచ్చాం.
ఆ విద్యార్థి తన స్నేహితుల గురించి చెప్పారు. విచారణ మొత్తం ఒక సాధారణ హాలులో జరిగింది. అక్కడ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు ఉన్నారు. మొత్తం ప్రక్రియ జరుగుతున్నప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విచారణ సమయంలో ఎలాంటి హింస జరగలేదు" అని ఎస్పీ అన్నారు.
ఈ కేసులో చండీగఢ్ సైబర్ సెల్‌కు చెందిన ఒక ఏఎస్ఐని సస్పెండ్ చేశామని తెలిపారు.
చండీగఢ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పంజాబ్, చండీగఢ్ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయంలో పోలీసులు, పాఠశాల నుంచి వివరణ కోరాయి.
మైనర్లపై చట్టపరమైన కేసులకు సంబంధించిన నియమాలు
పోలీస్ స్టేషన్ల వాతావరణం పిల్లలు, మహిళలకు అనుకూలంగా లేదని సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ బెయిన్స్ అన్నారు.
"ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, మైనర్లను పోలీస్ స్టేషన్‌కు పిలవకూడదన్నది అందరికీ తెలిసిన విషయం. దానికి బదులుగా, వారి ఇళ్లలో, వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విచారించాలి" అని ఆయన అన్నారు.
''ఈ కేసులో మానసిక కౌన్సెలింగ్ అవసరం, పోలీసుల కౌన్సెలింగ్ కాదు'' అని ఆయనన్నారు.
"పోలీసుల పద్ధతులు కఠినంగా ఉంటాయి. వారికి పిల్లల మనస్తత్వం గురించి, ముఖ్యంగా టీనేజర్ల మనస్తత్వం గురించి అవగాహన ఉండదు. అసలు పోలీసులకు కౌన్సెలింగ్ అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది పిల్లలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించేంత పెద్ద నేరం కాదని ఆయన అన్నారు.
‘‘ఐపీ అడ్రస్ ద్వారా గుర్తించి, వారిని ఇంటి నుంచి కౌన్సెలింగ్ చేయవచ్చు. వారిది చాలా సున్నితంగా ఆలోచించే వయస్సు. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం ఏ పిల్లలకైనా భయం కలిగిస్తుంది'' అని ఆయనన్నారు.
‘జువెనైల్ జస్టిస్ చట్టాన్ని అనుసరించాలి’
పంజాబ్, హరియాణా హైకోర్టులో న్యాయవాది అర్జున్ షారన్ మాట్లాడుతూ, మైనర్ కేసు లేదా పిల్లవాడికి సంరక్షణ, రక్షణ అవసరమైనప్పుడు, జువెనైల్ జస్టిస్ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు.
ఈ చట్టం ప్రకారం,
పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఏదైనా చట్టపరమైన నేరానికి పాల్పడినట్టు నిర్ధరణ అయితే, దోషిగా తేలితే జువెనైల్ జస్టిస్ బోర్డు వారిపై విచారణ జరుపుతుంది. ప్రతి జిల్లాలో ఈ బోర్డు ఉంటుంది. ఇందులో ఒక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉండాలి. సామాజిక కార్యకర్త స్త్రీ అయి ఉండాలి.
నేరం చేసినట్టు అనుమానం ఉన్న ఏ పిల్లలనైనా స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్‌కి తీసుకువెళతారు. ఆ తరువాత స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ద్వారా 24 గంటల్లోపు (ప్రయాణ సమయం మినహా) బోర్డు ముందు హాజరుపరుస్తారు.
ఈ మొత్తం ప్రక్రియను బోర్డు నిర్వహిస్తుంది. పిల్లలు నేరం చేశారా..లేదా అని నిర్ధరించడం బోర్డు పని.
ప్రక్రియ ప్రతి దశలోనూ పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండేలా చూసుకోవడం, పిల్లల హక్కులకు రక్షణ కల్పించడం, ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, భాష అర్థం కాకపోతే అనువాదకులు, వ్యాఖ్యాతలను అందించడం బోర్డు పని.
నెలకోసారి పిల్లల ప్రత్యేక పరిశీలన గృహాలను సందర్శించి అవసరమైన చర్యలు తీసుకోవడం కూడా బోర్డు పని.
జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం, పిల్లలను జైలులో లేదా పోలీసు లాకప్‌లో ఉంచకూడదు, పిల్లల చేతికి సంకెళ్లు వేయడానికి, కొట్టడానికి, హింసించడానికి అనుమతిలేదు.
బెయిల్ మంజూరు కాని పిల్లలను పరిశీలన గృహాలలో లేదా ఇతర సురక్షిత ప్రదేశాలలో ఉంచుతారు.
నేరం బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ అయినా, పిల్లలకు బెయిల్ ఇవ్వాలనేది నియమం. కొన్ని సందర్భాలలో మాత్రమే బెయిల్ మంజూరు చేయరు. పిల్లలను విడుదల చేయడం వల్ల ఇతరుల నుంచి ప్రమాదముంటుందని, వారికి నైతిక, శారీరక, మానసిక ప్రమాదం జరిగే అవకాశముందని, అది న్యాయప్రక్రియను ప్రభావితం చేసే ఆస్కారముంటుందని భావించినప్పుడే బెయిల్ ఇవ్వరు.
పిల్లలపై వచ్చిన ఆరోపణలపై నాలుగు నెలల్లోపు దర్యాప్తు చేయాలి. అవసరమైతే దర్యాప్తు గడువును మరో రెండు నెలలు పొడిగించవచ్చు. మూడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష విధించదగిన నేరాలలో, ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి కాకపోతే, కేసు మూసివేస్తారు.
బాలుడు లేదా బాలిక నిర్దోషి అని బోర్డు గుర్తిస్తే విడుదల చేస్తారు. దోషిగా గుర్తిస్తే, కేసు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపడం, గ్రూప్ కౌన్సెలింగ్, కమ్యూనిటీ సర్వీస్ ఆర్డర్లు, పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు జరిమానా విధించడం లేదా మూడు సంవత్సరాల పాటు ప్రత్యేక పరిశీలన గృహానికి పంపడం వంటివి ఉంటాయి.
జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం మైనర్‌కు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించరు.
16 ఏళ్లు పైబడినవారు దారుణమైన నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటే, బోర్డు అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయన లేదా ఆమెను పెద్దవారిగా పరిగణించి విచారించమని కోరవచ్చు.
ఆత్మహత్య ఆలోచన రానివ్వొద్దు
ఆత్మహత్య అన్నది తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య.
మీరు ఒత్తిడి గురవుతున్నట్లు భావిస్తే కేంద్ర ప్రభుత్వ హెల్ప్‌లైన్ 18002333330 నుంచి సహాయం పొందవచ్చు.
మీరు మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)