You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాగ్‌పూర్‌లో హింసాత్మక ఘటనలు.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎవరేమంటున్నారు?
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో సోమవారం (మార్చి 17) రాత్రి హింసాత్మక ఘటనలు జరిగాయి.
నగరంలోని మహల్ ప్రాంతంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని, వాహనాలను తగలబెట్టారు.
పెద్ద ఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందని నాగ్‌పూర్ పోలీసు కమీషనర్ డాక్టర్ రవీందర్ సింగల్ చెప్పారు. ప్రజలు శాంతంగా ఉండాలని కోరారు.
చిట్నిస్ పార్క్ ప్రాంతంలో అర్ధరాత్రి ఒకటి వరకు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి, సుమారు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ ఉంది.
సీఎం ఏమన్నారు?
ప్రజలు శాంతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ కోరారు.
'' నాగ్‌పూర్ శాంతిని కోరుకునే నగరం. ఒకరికొకరు సంతోషాన్ని, బాధలను పంచుకుంటూ ఉంటారు. ఇదే నాగ్‌పూర్ సంప్రదాయం. ఇలాంటి సమయంలో, ఏ వదంతులను ప్రజలు నమ్మకూడదు. పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలి.'' అని ఫడణవిస్ అభ్యర్థించారు.
నాగ్‌పూర్ నగరంలో సెక్షన్ 144ను విధించినట్లు తెలిపారు. ఎలాంటి కారణం లేకుండా ప్రజలు బయటికి రావొద్దని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా వదంతులను సృష్టిస్తే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
హింసాత్మక ఘటనలు సోమవారం రాత్రి 8 నుంచి 8.30 మధ్యలో జరిగాయని కమీషనర్ చెప్పారు. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారిని గుర్తించి, అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.
‘తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ఈ పరిస్థితి’
తప్పుడు సమాచారం వ్యాప్తికావడంతోనే ఈ ఘటనలు జరిగినట్లు మహల్ ప్రాంతంలోని నెలకొన్న హింసాత్మక పరిస్థితి గురించి నాగ్‌పూర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) అర్చిత్ చందక్ వ్యాఖ్యానించారు.
'' ప్రతిఒక్కరూ శాంతంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా. వదంతులను నమ్మొద్దు. చట్టాన్ని ఉల్లంఘించవద్దు. పోలీసులకు సహకరించాలి. ఈ ఘటనపై మేం న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాం.'' అని తెలిపారు.
''కొన్ని వదంతులు వల్ల నాగ్‌పూర్‌లో మతపరమైన ఘర్షణలు నెలకొన్నాయి. ఈ నగరం శాంతికి నిలయం. ఎలాంటి వదంతులను నమ్మొద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నా. లా అండ్ ఆర్డర్‌కు ప్రతి ఒక్కరం సహకరిద్దాం.'' అని కేంద్రమంత్రి గడ్కారీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
తప్పు చేసిన వారిపై లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
వారివల్లే ఇదంతా...
అసంబద్ధమైన ప్రకటనలు ఇస్తూ, సమాజంలో ద్వేషాన్ని నింపే మంత్రులను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు.
నాగ్‌పూర్ చాలా శాంతియుత నగరమని, కానీ, అధికార పార్టీ అండ చూసుకుని కొన్ని సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఇదంతా కేబినెట్‌లోని మంత్రులు చేసే అసంబద్ధమైన ప్రకటనల వల్లేనని ఆయన విమర్శించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)