బడ్జెట్ 2024: ఇన్‌కమ్ ట్యాక్స్‌లో నిర్మలా సీతారామన్ చెప్పినట్లు రూ.17,500 ఎలా ఆదా అవుతుందంటే....ఇదీ లెక్క...

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో కేంద్ర బడ్జెట్‌లో కొంతైనా ఊరట లభిస్తుందని ఉద్యోగులు ఆశిస్తూ వచ్చారు. తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ‘న్యూ ట్యాక్స్ రెజీమ్’ శ్లాబ్‌లలో మార్పులు చేయడం ద్వారా వారికి కొంత ఊరట కల్పించారు.

ఈ కొత్త శ్లాబుల ప్రకారం ఆదాయ పన్నులో రూ. 17,500 వరకు ఆదా చేయొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

మరి ఈ 17,500 రూపాయలు ఎలా ఆదా అవుతుంది?

న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో ఇప్పటివరకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉండేది. దాన్ని ఇప్పుడు రూ.75 వేలకు పెంచారు.

అలాగే ట్యాక్స్ శ్లాబ్‌లలో రూ. 3 లక్షల లోపు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. అలాగే రూ. 15 లక్షలకు పైన ఆదాయానికి 30 శాతం పన్ను అనే విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు.

అంటే రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయానికి చెల్లించే పన్నులో మార్పులు వచ్చాయి. ఈ విభాగంలో, స్టాండర్డ్ డిడక్షన్‌లో ఆదా చేయడానికి అవకాశమేర్పడింది.

రూ. 17,500 ఆదా ఇలా

రమేశ్ అనే ఉద్యోగికి సంవత్సరానికి రూ. 15,75,000 జీతం/ఆదాయం వస్తుందని అనుకుందాం.

తాజా శ్లాబుల మార్పునకు ముందున్న ‘న్యూ ట్యాక్స్ రెజీమ్’ ప్రకారం చూసుకుంటే... రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పోను రూ. 15 లక్షల 25 వేల మొత్తానికి పన్ను మదింపు చేయాలి.

ఇందులో..

  • రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  • రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాలి. అంటే రూ. 3 లక్షల ఆదాయంపై 5 శాతం లెక్కన రూ. 15 వేల పన్ను పడుతుంది.
  • రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఆదాయం..అంటే రూ. 3 లక్షలపై 10 శాతం లెక్కన రూ. 30 వేల పన్ను పడుతుంది.
  • రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం...అంటే రూ.3 లక్షలపై 15 శాతం లెక్కన రూ. 45 వేల పన్ను పడుతుంది.
  • రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు...అంటే రూ. 3 లక్షల ఆదాయానికి 20 శాతం లెక్కన రూ. 60 వేల పన్ను పడుతుంది.
  • రూ. 15 లక్షల పైన ఉన్న రూ. 25 వేల మొత్తానికి 30 శాతం లెక్కన రూ. 7,500 పన్ను పడుతుంది.

ఇప్పుడు ఇవన్నీ కలిపితే...అంటే రూ. 15 వేలు + రూ. 30 వేలు + రూ. 45 వేలు + రూ. 60 వేలు + రూ. 7,500 కలిపితే రూ. 1,57,500 మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అదే ఇప్పుడు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, శ్లాబుల్లో మార్పు ప్రకారం లెక్కిస్తే రమేశ్‌ ఎంత ఆదాయ పన్ను చెల్లించాలో చూద్దాం.

రమేశ్ వార్షిక జీతం రూ. 15,75,000లో రూ. 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ పోను రూ. 15,00,000కు పన్ను మదించాల్సి ఉంటుంది.

ఇందులో రూ. 3 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

  • రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు అంటే 4 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను చెల్లించాలి. 5 శాతం లెక్కన రూ. 20 వేల పన్ను పడుతుంది.
  • రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం.. అంటే రూ. 3 లక్షలపై 10 శాతం లెక్కన రూ. 30 వేల పన్ను పడుతుంది.
  • రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఆదాయం.. అంటే రూ. 2 లక్షలపై 15 శాతం లెక్కన రూ. 30 వేల పన్ను పడుతుంది.
  • రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు.. అంటే రూ. 3 లక్షల ఆదాయానికి 20 శాతం లెక్కన రూ. 60 వేల పన్ను పడుతుంది.
  • ఇవన్నీ.. అంటే రూ. 20 వేలు + రూ. 30 వేలు + రూ. 30 వేలు + రూ. 60 వేలు కలిపితే రూ. 1,40,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అంటే తాజా మార్పులకు ముందు రూ.1,57,500 పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండగా.. వచ్చే ఏడాది నుంచి ఈ మార్పుల ప్రకారం మదిస్తే రూ. 1,40,000 పన్ను పడుతుంది.

ఇలా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పిన రూ. 17,500 పన్ను ఆదా అవుతుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)