You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రమేశ్ విశ్వాస్ కుమార్: విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి ఈయనే అంటూ రిపోర్టులు
- రచయిత, ఆండ్రీ రోడెన్-పాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలో కలిచివేసే దృశ్యాలుంటాయి)
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కూలిపోయింది.
అయితే, ఈ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
మరోవైపు ఇండియా టుడేతోపాటు పలు మీడియా సంస్థలు రమేశ్ విశ్వాస్ కుమార్ ప్రమాద స్థలం నుంచి గాయాలతో వెళుతున్న దృశ్యాలను ప్రసారం చేశాయి.
ఎవరీ రమేశ్ విశ్వాస్?
''బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సీటు 11A లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు'' అని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ వార్తాసంస్థ ఏఎన్ఐతో చెప్పారు.
ప్రాణాలతో బయటపడిన వ్యక్తి "ఆసుపత్రిలో ఉన్నారు. చికిత్స పొందుతున్నారు" అని ఆయన తెలిపారు.
ఎయిర్ ఇండియా అధికారులు ముందుగా షేర్ చేసిన ఫ్లైట్ మ్యానిఫెస్ట్‌లో 11A సీటులో ఉన్న ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ అని, ఆయన బ్రిటిష్ పౌరుడని ఉంది.
విశ్వాస్‌తో ఆసుపత్రిలో మాట్లాడినట్లు ఏఎన్ఐ తెలిపింది. తన బోర్డింగ్ పాస్‌ను తమకు షేర్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. అందులో ఆయన పేరు, సీటు నంబర్ 11A ఉన్నట్లు తెలిపింది.
''టేకాఫ్ అయిన 30 సెకన్లకు పెద్దగా శబ్ధం వినిపించింది. ఆ తర్వాత విమానం క్రాష్ అయింది. ఇదంతా చాలా వేగంగా జరిగింది'' అని విశ్వాస్ చెప్పినట్లుగా ఏఎన్ఐ తెలిపింది.
రమేశ్ బంధువులతో మాట్లాడిన బీబీసీ
లీసెస్టర్‌లో రమేశ్ విశ్వాస్ కుమార్ బంధువు అజయ్ వాల్గితో బీబీసీ మాట్లాడింది. ప్రమాదం జరిగిన తర్వాత కాసేపటికి రమేశ్ తమకు ఫోన్ చేశారని, తాను బాగానే ఉన్నట్లు చెప్పారని అజయ్ వాల్గీ వెల్లడించారు.
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న తన సోదరుడు అజయ్ ఏమయ్యాడో తనకు తెలియదని రమేశ్ విశ్వాస్ కుమార్ తెలిపినట్లు బీబీసీకి చెప్పారు వాల్గి.
ప్రమాద ఘటన తెలిసిన వెంటనే కుటుంబంలోని బంధువులంతా దు:ఖంలో మునిగిపోయారు.
రమేశ్ విశ్వాస్ కుమార్‌కు భార్య, కూతురు ఉన్నారనీ, ఇండియాలో పుట్టిన ఆయన గత కొన్నేళ్లుగా యూకేలో ఉంటున్నారని బీబీసీ గుర్తించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)