‘సూరజ్ రేవణ్ణ నా దుస్తులు విప్పి నాతో అసహజ శృంగారానికి పాల్పడ్డారు’ - ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై ఓ యువకుడి ఫిర్యాదు, సూరజ్ అరెస్ట్

అసహజ శృంగారం, నేరపూరిత బెదిరింపుల అభియోగాలపై జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను హసన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ యువకుడి ఫిర్యాదు ఆధారంగా సూరజ్‌ను అరెస్ట్ చేశారు.

అంతకుముందు ఆ యువకుడిని సూరజ్ రేవణ్ణ మనుషులు అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఆ యువకుడు తొలుత తన ఫిర్యాదును జూన్ 21న డీజీపీ కార్యాలయానికి పంపారు.

కానీ, జూన్ 22న ఈమెయిల్ ద్వారా హసన్ పోలీసులకు కూడా పంపారు.

హసన్ పోలీసులు రేవణ్ణకు సమన్లు జారీచేసి, ఆయనను గత రాత్రి విచారించిన తరువాత ఫిర్యాదును హోలెనరసిపుర పోలీసులకు పంపారు.

‘‘ఆయన (సూరజ్ రేవణ్ణ)ను అరెస్ట్ చేశాం’’ అని హసన్ ఎస్పీ మహమ్మద్ సుజీత బీబీసీకి చెప్పారు.

తనపై వచ్చిన ఆరోపణలను సూరజ్ విలేఖరుల వద్ద ఖండించారు. అదో రాజకీయ కుట్ర అని అభివర్ణించారు.

ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడే సూరజ్ రేవణ్ణ

అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడే సూరజ్ రేవణ్ణ.

ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసిన మహిళను కిడ్నాప్ చేసిన కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, భవానీ రేవణ్ణ మరో కుమారుడు ఈ సూరజ్ రేవణ్ణ.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరజ్ రేవణ్ణను కలిసినట్టు ఫిర్యాదుదారుడు తెలిపారు.

‘‘మేం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. తరువాత గనికంద ఫామ్ హౌస్‌లో జూన్ 16న తనను కలవమని ఆయన చెప్పారు’’ అని ఆ యువకుడు వెల్లడించారు.

సూరజ్ రేవణ్ణను కలిసిన రోజున ఆయన తన శరీరభాగాలను అభ్యంతరకర రీతిలో తాకారని, తన దుస్తులు విప్పి, తన అభ్యంతరాలను పట్టించుకోకుండా అసహజశృంగారానికి పాల్పడటమే కాకుండా, తనను బెదిరించారని ఆ యువకుడు తెలిపారు.

‘‘నేనీ విషయం శివకుమార్‌కు చెపితే సూరజ్ నుంచి డబ్బు, ఉద్యోగం ఇప్పిస్తానని తనకు ఆశచూపారని’’ ఆ యువకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూన్ 22న ఆ ఫిర్యాదును అధికారులు స్వీకరించారు.

అయితే లైంగిక వేధింపుల గురించి బయటకు చెబుతామంటూ ఆ యువకుడు, అతని మామ మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించారంటూ సూరజ్ రేవణ్ణ అనుచరుడు శివకుమార్ కూడా ఫిర్యాదు చేశారు.

సూరజ్ రేవణ్ణకు చెప్పి తనకు ఉద్యోగం ఇప్పించాలని ఆ యువకుడు తనను కోరారని శివకుమార్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇక సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై సెక్షన్ 377 ( అసహజ శృంగారం), సెక్షన్ 342 (అక్రమ నిర్బంధం), సెక్షన్ 34 (కామన్ ఇంటెన్షన్), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులు) కింద అభియోగాలు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)