You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘భారతీయ పౌరులు’ అని ధ్రువీకరించే సర్టిఫికెట్ ఏదీ ఉండదు, ఎందుకు...
- రచయిత, ఉపాసన
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన 'భారతీయ పౌరులు కాదని' బాంబే హైకోర్టు ఇటీవల పేర్కొంది.
ఈ కార్డులన్నీ గుర్తింపును నిరూపించుకోవడానికి మాత్రమే.
దీంతో పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఏం కావాలనే చర్చ మొదలైంది.
కోర్టు వ్యాఖ్యల తర్వాత భారత పౌరుడని నిరూపించుకునే పత్రం ఏదనే ప్రశ్న ఎదురవుతోంది.
భారతదేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఏ పత్రాన్నీ చట్టబద్దంగా, అధికారికంగా ప్రకటించలేదు.
అయితే రాజ్యాంగంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.
అవన్నీ ఉంటేనే భారత పౌరులవుతారు. అసలు పౌరసత్వం అంటే ఏంటి? అది ఎందుకు అవసరం?
పౌరసత్వం ఎందుకంటే..
దేశానికి దేశంలో ప్రతీ పౌరుడికి మధ్య చట్టపరమైన సంబంధం ఉంది. ఈ సంబంధానికి ఆధారంగా నిలుస్తుంది పౌరసత్వం. దేశంలోని పౌరులకు పౌరసత్వం అనేక రకాల హక్కులు, సౌకర్యాలను అందిస్తుంది.
ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు, చట్టపరమైన హక్కులు, పని చేసే హక్కుతో పాటు ఇంకా అనేక రక్షణలు లభిస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ దేశం నాది అనే భావన ఏర్పడుతుంది.
దేశ పౌరులంటే ఎవరు? ఎవరు కాదు అనేది నిర్ణయించడానికి చట్టాలు, నిబంధనలు ఉన్నాయి.
భారత పౌరసత్వం ఎలా పొందవచ్చు?
రాజ్యంగంలోని 5-11ఆర్టికల్స్ భారత పౌరసత్వం గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటి ప్రకారం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నాటికి దేశంలో ఉన్న వారంతా భారత పౌరులు.
ఇంకా..
- దేశంలో పుట్టిన వారు
- తల్లిదండ్రుల్లో ఒకరు దేశంలో పుట్టిన వారు
- రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఐదేళ్ల ముందు భారతదేశంలో నివసిస్తున్న వారు..
- ఈ ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రకారం పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చినవాళ్లు, తల్లిదండ్రులు, లేదా తాతముత్తాలు అవిభక్త భారత్‌లో జన్మించిన వాళ్లు, భారత్ నుంచి పాకిస్తాన్ వలస వెళ్లి, ఆ తర్వాత తిరిగి భారత్ వచ్చి స్థిరపడిన వారు
తల్లిదండ్రులు, తాత ముత్తాలు అవిభక్త భారత్‌లో పుట్టి, ప్రస్తుతం భారత్ బయట జీవిస్తున్నా వారిని భారత పౌరులుగా గుర్తిస్తున్నారు.
పౌరసత్వ చట్టం 1955 ఏం చెబుతోంది?
1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ పరిధిని మరింత విస్తృతం చేస్తూ1955లో ఒక చట్టం చేశారు. ఇది పౌరసత్వ చట్టం 1955గా అమల్లోకి వచ్చింది.
భారత పౌరసత్వాన్ని పొందడానికి, రద్దు చేయడానికి షరతులను ఈ చట్టంలో ప్రస్తావించారు.
5 అంశాల ద్వారా భారత పౌరసత్వం పొందడం గురించి చట్టంలో పేర్కొన్నారు.
- పుట్టుకతో..
- వంశపారంపర్యంగా..
- రిజిస్ట్రేషన్ ద్వారా..
- కొన్ని షరతులకు లోబడి సహజంగా ఒక వ్యక్తి భారత పౌరుడు కావచ్చు.
- ఏదైనా కొత్త భూభాగం భారత్‌లో అంతర్భాగమైనప్పుడు
భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 3 పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని గుర్తిస్తుంది. దీని ప్రకారం దేశంలో పుట్టిన వ్యక్తి చట్టబద్ధంగా భారతీయ పౌరుడిగా పరిగణిస్తారు.
అయితే ఆ వ్యక్తి.. 1950 జనవరి 26 నుంచి 1986 జులై 1న జన్మించిన వారు లేదా 1987 జులై 1 నుంచి పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి రాకముందు పుట్టిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండాలి.
పౌరసత్వ సవరణ చట్టం 2003 అమల్లోకి వచ్చిన రోజున లేదా ఆ తర్వాత భారత్‌లో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఒకరు భారతీయ పౌరులైనా అయి ఉండాలి. అయితే రెండో వారు అక్రమంగా వలస వచ్చినవారై ఉండకూడదు.
వంశపారంపర్యంగా..
భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి కూడా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రులలో ఒకరికి సదరు వ్యక్తి పుట్టిన సమయంలో భారతీయ పౌరసత్వం ఉండాలి.
పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 4లో పేర్కొన్న షరతుల ప్రకారం ఒక వేళ:
1950 జనవరి 26న లేదా ఆ తర్వాత, 1992 డిసెంబర్ 10కి ముందు జన్మించినవారు
సదరు వ్యక్తి పుట్టినప్పుడు తండ్రి భారతీయ పౌరుడై ఉండాలి.
1992 డిసెంబర్ 10న లేదా ఆ తర్వాత పుట్టి ఉండాలి. పుట్టినప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి.
2004 డిసెంబర్ 3 తర్వాత భారతదేశం బయట పుట్టిన వ్యక్తి, తాను పుట్టిన ఏడాది లోపు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకుంటేనే వంశపారంపర్యంగా భారత పౌరసత్వం లభిస్తుంది.
ఏడాది దాటిన తర్వాత నమోదు చేసుకోవాలనుకుంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ ద్వారా లభించే పౌరసత్వం
భారత పౌరసత్వం కోరుకుంటున్న విదేశీయులు చాలా మంది ఉన్నారు. వీరంతా భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5 కింద ఇండియన్ సిటిజన్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
అయితే వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు కొన్ని షరతులు ఉన్నాయి.
ఈ షరతులను నెరవేర్చినట్లయితే విదేశీయులు భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తును భారత ప్రభుత్వం ఆమోదిస్తే, ఆ వ్యక్తి అప్పటి వరకు ఉన్న దేశ పౌరసత్వాన్ని వదులుకోవాలి.
నేచురలైజేషన్ ద్వారా పౌరసత్వం ఎలా?
ఈ నిబంధన కింద భారతదేశంలో చాలాకాలంగా నివసిస్తున్న వారు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందు కోసం వాళ్లు పౌరసత్వ చట్టం సెక్షన్ 6లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఒక ఫామ్ నింపి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో కూడా కొన్ని షరతులు ఉన్నాయి.
వారి దరఖాస్తును ఆమోదించిన తర్వాతనే వారికి పౌరసత్వం లభిస్తుంది.
భారతదేశంలో అంతర్భాగమైన ప్రాంతాల ప్రజల పరిస్థితేంటి?
పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఏదైనా విదేశీ భూభాగం భారతదేశంలో భాగమైతే అక్కడ నివసించే ప్రజలను భారత పౌరులుగా గుర్తించవచ్చు.
దీనికోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.
భారత ప్రభుత్వం ఆ ప్రాంతానికి చెందిన వాళ్లందరికీ భారత పౌరుల హోదా ఇచ్చి వారి పేర్లతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
గెజిట్‌లో పేర్కొన్న తేదీ నుంచి వారికి భారత పౌరుల హోదా లభిస్తుంది.
పౌరసత్వానికి రుజువు ఉంటుందా?
భారతదేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి అధికారిక డాక్యుమెంట్లు జారీ చేయలేదని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సోషియాలజీ ప్రొఫెసర్ వివేక్ కుమార్ చెప్పారు.
భారత్‌లో జన్మించిన వ్యక్తి భారత పౌరుడని రాజ్యాంగం చెబుతోంది. దేశంలో పుట్టిన వారి పిల్లలు లేదా వారసులు కూడా భారత పౌరులే.
భారత్‌లో పుట్టి విదేశాలలో నివసిస్తున్న వ్యక్తికి భారత పౌరసత్వం మంజూరు చేసే నిబంధన ఉంది.
భారత్‌లో పుట్టిన వ్యక్తి బర్త్ సర్టిఫికేట్ చూపించడం ద్వారా తాము ఈ దేశ పౌరులని నిరూపించుకోవచ్చు.
పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పోరేషన్ బర్త్ సర్టిఫికేట్ జారీ చేస్తాయి. ఒక వేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే దరఖాస్తు చేసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక ఫామ్ పూర్తి చేయాలి.
అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత దాన్ని దగ్గరలో ఉన్న జనన మరణ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించాలి.
అధికారిక బర్త్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో కూడా ఆన్‌లైన్ ద్వారా బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌కు ఆమోదం లభించాక మీకు బర్త్ సర్టిఫికేట్ అందుతుంది.
బర్త్ సర్టిఫికెట్‌లో జన్మస్థలం ఏదో రాస్తారు. ఇది పుట్టుక ఆధారంగా భారత పౌరసత్వం అనే షరతుకు ఆమోదయోగ్యంగా మారుతుంది.
రిజిస్ట్రేషన్ (సెక్షన్ 5) నేచురలైజేషన్ (సెక్షన్ 6) కింద భారత పౌరులుగా మారిన వారికి సర్టిఫికేట్ ఇస్తారు.
ఈ సర్టిఫికేట్‌పైన భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ లేదా అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారి సంతకం చేస్తారు.
ఈ సర్టిఫికెట్లు పౌరసత్వానికి రుజువుగా పనిచేస్తాయి.
ఈ సర్టిఫికేట్లు పౌరసత్వానికి రుజువైతే పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటరు ఐడి మరియు రేషన్ కార్డ్ అంటే ఏమిటి?
ఇవి లేకుండా కూడా మనం భారత పౌరులుగా పరిగణించబడతామా? అనే సందేహాలు రావచ్చు.
అవును. ప్రభుత్వం ఈ పత్రాలలో దేనినీ పౌరసత్వ ధృవీకరణ పత్రంగా అధికారికంగా అంగీకరించదు.
ఈ పత్రాలన్నీ గుర్తింపు కార్డు లేదా నివాస ధృవీకరణకు ఉపయోగ పడతాయి. ఇవి మీ పౌరసత్వాన్ని నిర్ణయించవు.
ఈ పత్రాల ఆధారంగా ప్రభుత్వం ఎవరికీ పౌరసత్వం ఇవ్వదు. ఒకవేళ మీకు భారత పౌరసత్వం ఉంటే ఈ పత్రాలు లేకున్నా మీ పౌరసత్వానికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)