You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లీ చాంగ్‌యే : ఒకనాటి బిచ్చగాడు నేడు ప్రాణాలు కాపాడే వైద్యుడిగా ఎలా మారారు?అసలు ఆయన్ను బిచ్చగాడిగా మార్చింది ఎవరు?
లీ చాంగ్‌యే. బాల్యంలో తోటి పిల్లల్లాగే స్కూల్‌కు వెళ్లాలని కలలు కనేవారు. కానీ, ఆయన తరచూ హేళనకు గురయ్యేవారు.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో 1988లో లీ చాంగ్‌యే ఒక పేద కుటుంబంలో జన్మించారు. పుట్టిన ఏడు నెలలకే పోలియో సోకింది. దీంతో ఎదిగాక సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. నడవలేని అతన్ని చూసి ''ఎందుకూ పనికిరానివాడు'' అని కొంతమంది పిల్లలు ఎగతాళి చేసేవారు.
దీనివల్ల తాను తీవ్ర వేదనకు గురయ్యానని లీ చెబుతారు.
లీ కి తొమ్మిదేళ్ల వయసున్నప్పడు ఆపరేషన్ చేయిస్తే నడవగలడని ఆయన తల్లిదండ్రలు భావించారు. అందుకోసం అప్పు చేశారు.
''నేను చికిత్స పొందుతున్న వార్డులో మిగతా పిల్లలు ఏడుస్తున్నారు. కానీ నేనుమాత్రం త్వరలో మిగతావారిలా నడవగలననే సంతోషంతో నవ్వుతున్నాను'' అని లీ చెప్పారు.అయితే శస్త్రచికిత్స విఫలం కావడంతో లీ ఆశలు అడియాశలయ్యాయి.
తన జీవితానికి ఇక అర్థం లేదని లీ బాధపడ్డారు. తాను చనిపోవాలనుకున్నారు. ఆ మాటే తల్లితో చెప్పారు. ఆమె అతన్ని వారించారు. ఆశ వదులుకోవద్దని ఓదార్చారు.
‘‘మా జీవిత చరమాంకంలో మాకు తోడుగా ఉంటావనే కదా నిన్ను పెంచుతున్నాం’’ అన్న తల్లిమాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయంటారు లీ.
''నా తల్లిదండ్రులు, కుటుంసభ్యులు నా కోసం చేసిన త్యాగాల గురించి ఆలోచించాను. నాకు కన్నీళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత, నేను నాకోసం మాత్రమే కాకుండా, వారి కోసం కూడా బతకాలని అర్థమైంది'' అన్నారు లీ.
పని పేరుతో బిచ్చగాడిని చేశారు
కొంతకాలం తర్వాత.. వైకల్యం ఉన్నప్పటికీ పనిచేయగలిగే పిల్లల కోసం వెతుకుతూ ఒకరు లీ గ్రామానికి వచ్చారు.
''నా తల్లిదండ్రులు వద్దన్నారు. కానీ, నా కుటుంబం మీద భారం తగ్గడానికి, నేనే డబ్బు సంపాదించడానికి ఇదొక అవకాశం అనుకున్నాను'' అని లీ చెప్పారు.
''అతనితో వెళ్లడానికి అంగీకరించాను. కానీ, అతను చెప్పిందంతా అబద్ధం. అతనొక బిచ్చగాడు. బలవంతంగా నా చేతికి పాత్ర ఇచ్చి నాలాంటి చాలామందితో కలిసి వీధుల్లోకి వెళ్లి అడుక్కోమనేవాడు'' అని లీ గుర్తు చేసుకున్నారు.
''రోజూ కొన్ని వందల యువాన్లు సంపాదించేవాణ్ణి. కానీ, అదంతా అతనే తీసుకునేవాడు. ఒకవేళ ఇతర పిల్లల కంటే తక్కువ తెస్తే, నేనొక బద్దకస్తుడినని ఎగతాళి చేసేవారు. దాడి చేసేవారు. ఇది చాలా బాధగా ఉండేది'' అని చెప్పారు.
అలా ఏడేళ్లపాటు లీ భిక్షాటన చేశారు .
''ప్రజలు నా పట్ల జాలి చూపించాలని నా కాళ్లు వెనక్కి వంచేశారు. నరకయాతన అనుభవించాను. అవమానంగా భావించి, ఎవరి కళ్లలోకి చూడలేకపోయేవాడిని. యాచనకు వెళ్లకుండా వర్షం పడాలని, చీకటి పడాలని కోరుకుంటూ ఉండేవాడిని’’ అని బీబీసీ వరల్డ్ సర్వీసు అవుట్ లుక్ కార్యక్రమంలో లీ తన బాధాకరమైన గతాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇరవై సంవత్సరాలైనా నాటి గాయం అలాగే ఉందని లీ చెప్పారు. నిద్రలో భయంతో మేల్కొనే తాను, అదొక పీడకల అనుకొని ఊపిరి పీల్చుకుంటానన్నారు.
కొత్త జీవితంలోకి అడుగులు...
అప్పటికి తన వయసు 16 ఏళ్లు, వీధిలో ఒక వార్తాపత్రికను లీ చదవడానికి ప్రయత్నించారు. కానీ తనపేరుకు సంబంధించిన అక్షరాలను మాత్రమే చదవగలుగుతున్నానని తెలుసుకున్నారు. అందుకే ఇంటికి తిరిగి వెళ్లిపోయి చదువుకోవాలనుకున్నారు.
''చదువుతో మాత్రమే నా జీవితాన్ని మార్చుకోగలననుకున్నాను'' అని లీ చెప్పారు.
అదే సమయంలో వైకల్యం ఉన్న పిల్లలతో భిక్షాటన చేయించడం నేరమంటూ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది.
తనను భిక్షాటనలోకి నెట్టిన ఆ వ్యక్తితో తాను ఇంటికి వెళ్లిపోతానని లీ చెప్పేశారు.
తల్లిదండ్రుల సాయంతో ప్రాథమిక పాఠశాలలో లీ రెండో తరగతిలో చేరారు. అక్కడున్న విద్యార్థుల కంటే తాను వయస్సులో పదేళ్లు పెద్ద.
అక్కడ కూడా తోటి విద్యార్థులు తనను ఎగతాళి చేసినా, గతంలో తాను ఎదుర్కొన్న అవమానాలతో పోల్చుకుంటే తక్కువే అనుకున్నానని, చదువుపైనే తాను దృష్టి పెట్టానని లీ చెప్పారు.
ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసిన తర్వాత కాలేజీ విద్య కోసం దరఖాస్తు చేయడానికి వచ్చినప్పుడు అతని శారీరక వైకల్యం అక్కడ తన ఎంపికకు అడ్డంకిగా మారింది.
అయినా, ఆయన పట్టుదలతో మెడికల్ ప్రోగ్రామ్స్ (వైద్య విద్య)కు దరఖాస్తు చేసుకోగలిగారు. ''నేను వైద్యుడినైతే నా సమస్యపై పరిశోధన చేయగలను, నా కుటుంబానికి అండగా ఉంటూ ఇతరుల జీవితాలనూ కాపాడగలను. సమాజానికి సేవ చేయగలనని బలంగా అనుకున్నాను'' అని లీ చెప్పారు.
రక్తమోడుతున్నా పర్వతారోహణ
లీ తన 25వ ఏట మెడికల్ స్కూల్‌లో చేరారు. కానీ ప్రాక్టికల్ క్లాసులు ఆయనకు చాలా కష్టమయ్యేవి.
దీంతో శారీరకంగా తనను తాను మరింత బలంగా మార్చుకోవాలని గ్రహించిన లీ, తానొక కొండ ఎక్కాలని నిర్ణయించుకున్నారు.
తన తొలి ప్రయత్నంలో, మౌంట్ తాయ్ పర్వత శిఖరాన్ని ఐదు రోజుల పాటు కష్టపడి అధిరోహించారు. చేతులు, కాళ్లు చీరుకుపోయి రక్తమోడుతున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. పర్వతారోహణను తన అభిరుచిగా మార్చేసుకున్నారు. ఇందుకు సంబంధించి డాక్టర్ లీ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఇప్పుడు, డాక్టర్ లీ షింజియాంగ్‌లో ఒక చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నారు. అక్కడ అన్నివేళలా ఆయన అందుబాటులో ఉంటారు.
''జీవితంలో ఎప్పుడూ సానుకూల దృక్పథంతో, ఆశావాదంతో ఉండాలి. కలలను ఎన్నడూ వదులుకోకూడదని భావిస్తాను'' అంటారు డాక్టర్ లీ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)