You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతిచెందారు.
ఈ మేరకు పాకిస్తాన్ సైన్యం ముషారఫ్ మరణవార్తను ‘బీబీసీ’ ప్రతినిధి షుమైలా జాఫ్రీకి ధ్రువీకరించింది.
మాజీ దేశాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు జనరల్ ముషార్రఫ్ మరణం పట్ల సైన్యం సంతాపం తెలిపింది.
చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా దుబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముషార్రఫ్ అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారని గత ఏడాది వార్తలు వచ్చాయి. ఈ వ్యాధిలో శరీరంలోని అవయవాలు పనిచేయటం ఆగిపోతుంది.
ముషార్రఫ్ ఆదివారం దుబాయిలోని ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన వయసు 79 సంవత్సరాలు.
దిల్లీలో పుట్టి..
ముషారఫ్ 1943 ఆగస్ట్ 11న అవిభాజ్య భారతదేశంలోని పాత దిల్లీలో జన్మించారు.
1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి తరలి వెళ్లింది.
ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫ్ దౌత్యాధికారిగా పనిచేసేవారు. 1949 నుంచి 1956 వరకు ఆయన తుర్కియేలో నివసించారు. అనంతరం 1964లో సైన్యంలో చేరారు.
క్వెటాలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న ముషారఫ్ లండన్ రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్డడీస్‌లోనూ చదువుకున్నారు.
1965, 1971 నాటి భారత్, పాకిస్తాన్ యుద్ధాల్లోనూ ముషారఫ్ పాల్గొన్నారు. 1965 యుద్ధంలో పాల్గొన్నందుకు ఆయనకు పాకిస్తాన్ గాలంట్రీ అవార్డు కూడా ప్రదానం చేసింది. 1971 యుద్ధంలో ఆయన ఒక కమాండో కంపెనీకి నాయకత్వం వహించారు
ముషారఫ్ 1998లో జనరల్ ర్యాంక్‌కు ఎదిగారు. అనంతరం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ పాకిస్తాన్ పదవి చేపట్టారు.
అనంతరం అధికారాన్ని హస్తగతం చేసుకుని పాకిస్తాన్ అధ్యక్షుడయ్యారు.
జనరల్ పర్వేజ్ ముషరఫ్ 1999 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో పాకిస్తాన్‌లో అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.
2001 జూన్‌లో ముషరఫ్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నప్పుడు తనను తాను అధ్యక్షుడుగా ప్రకటించుకున్నారు.
2002 ఏప్రిల్‌లో ఒక వివాదాస్పద జనాభిప్రాయ సేకరణ ద్వారా ముషరఫ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగారు.
2007 అక్టోబరులో ఆయన మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు.
కానీ ఆయన ఎన్నికను అక్కడి పార్టీలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఆ తర్వాత ముషరఫ్ దేశంలో అత్యవసర స్థితి విధించారు.
చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధరి స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించారు. ఆయన ముషరఫ్ ఎన్నికకు ఆమోదముద్ర వేశారు.
2008 ఆగస్టులో ముషరఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అధికారంలో ఉన్న రెండు ప్రముఖ పార్టీలు తనకు వ్యతిరేకంగా మహాభియోగ తీర్మానం తీసుకురావాలని ఏకాభిప్రాయానికి రావడంతో పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయించారు.
దేశ ద్రోహం కేసులో మరణశిక్ష
దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక బెంచ్ 2019లో ముషారఫ్‌కు మరణశిక్ష విధించింది.
ముషారఫ్ మరణించినట్లు గతంలో పలుమార్లు వదంతులు వ్యాపించాయి.
అములాయ్‌డోసిస్ అనే వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు అప్పట్లో తెలిపారు.
‘డెమొక్రసీతో ఏం లాభం’
ప్రజల కోసం పనిచేయని డెమొక్రసీతో లాభం లేదని, పాకిస్తాన్ సైనిక పాలనలోనే అభివృద్ధి చెందిందని ముషారఫ్ గతంలో ‘బీబీసీ’తో చెప్పారు.
‘అయూబ్ ఖాన్ పాలన అయినా, నా పాలన అయినా పాకిస్తాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్యం, విద్య అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సాధించింది. ఇప్పుడు ఎవరూ వినడానికి సిద్ధంగా లేకపోతే ఏం చేయాలి. డెమాక్రసీ-డెమాక్రసీ. డెమాక్రసీతో మనం ఏం చేయాలి. ప్రజల కోసం పనిచేయని డెమాక్రసీ ఉండి ఏం లాభం?’ అని ఆయన 2019లో బీబీసీ హిందీతో మాట్లాడినప్పుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)