You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మాంచెస్టర్‌లో యూదు ప్రార్థనా మందిరంపై దాడి, ఇద్దరి మృతి, నిందితుడిని కాల్చివేసిన పోలీసులు
యూకెలోని మాంచెస్టర్ నగరంలో గురువారం ఉదయం ఒక యూదు ప్రార్థనా స్థలం (సినగోగ్‌పై) దుండగుడు జరిపిన దాడిలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
హీటన్ పార్క్ హీబ్రూ ప్రార్థనామందిరం బయట ఉన్న ప్రజలపైకి కారును పోనిచ్చి, కత్తితో దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు ఘటనాస్థలంలోనే కాల్చి చంపారు.
నిందితుడిని 35 ఏళ్ల జిహాద్ అల్-షమీగా గుర్తించారు. ఆయన బ్రిటన్ పౌరుడు. ఆయనకు సిరియా మూలాలు ఉన్నాయి.
యూదులకు, అత్యంత పవిత్రమైన పర్వదినమైన యోమ్ కిప్పుర్ నాడే ఈ దాడి జరిగింది.
ఈ దాడిని 'ఉగ్రదాడి'గా వ్యాఖ్యానించిన యూకె ప్రధాని సర్ కీర్ స్టార్మర్ , దేశ వ్యాప్తంగా ఉన్న యూదు ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు రక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామని ప్రకటించారు.
దాడి సమయంలోనే ఘటనాస్థలంలో నిందితుడిని కాల్చి చంపిన గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో భాగంగా దాడికి సంబంధించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
వీధుల్లోనూ, క్యాంపస్‌లలో సోషల్ మీడియాలోనూ ఇలా ప్రతీచోటా పెరిగిపోయిన యూదు వ్యతిరేకత ఫలితమే ఈ విషాద ఘటన అనియూదుమతాచార్యుడు సర్ ఎఫ్రైమ్ మిర్విస్ అన్నారు.
‘‘ఇలాంటి రోజు రాకూడదని ఆశించాం. కానీ ఇలాంటిరోజు ఒకటి వస్తుందని మనసు చెబుతూనే ఉంది. అదే ఈ రోజు’’ అని ఆయన చెప్పారు.
గాయపడిన ముగ్గురిలో కత్తిదాడికి గురైన వ్యక్తి, కారు దాడిలో గాయపడిన వ్యక్తి, పోలీసులు పరిస్థితిని అదుపు చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ఉన్నారు.
ఈ ఘటనకు కుట్రపన్నారనే అనుమానంతో 30 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులను అలాగే 60 ఏళ్ల వయసున్న మహిళను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు.
దాడి సమయంలో నిందితుడు ధరించిన ఒక అనుమానాస్పద వస్తువు పేలుడు పదార్థం కాదని పోలీసులు నిర్థరించారు.
గురువారం ఉదయం పొద్దున 9:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు) హీటన్ పార్క్ హీబ్రూ ప్రార్థనా స్థలం బయట కారు దాడి గురించి పోలీసులకు సమాచారం అందింది.
దాడి జరిగిన వెంటనే దుండగడు సినగోగ్ లోపలికి ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో, నేల మీద ఉన్న ఒక వ్యక్తి వద్ద బాంబు ఉందని ప్రజలను హెచ్చరిస్తూ అతనివైపు పోలీసులు గన్‌తో గురిపెట్టినట్టు కనిపిస్తుంది. సరిగ్గా 9:38 నిమిషాలకు నిల్చునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని అక్కడిక్కడే కాల్చి చంపారు, పోలీసులు. ఇదంతా 7 నిమిషాల వ్యవధిలో జరిగింది.
భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తి
మరింత పెద్ద దాడి జరగకుండా సమయస్ఫూర్తితో ఆపారంటూ సినగోగ్ భద్రతా సిబ్బందిని, అధికారులను మతాచార్యుడు డానియల్ వాకర్‌ను ప్రధాని కీర్ స్టార్మర్ ప్రశంసించారు .
దాడి సమయానికి ప్రార్థనలు మొదలవడంతో మతాచార్యుడు డానియల్ వాకర్ మందిరంలోని వారందరిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
సినగోగ్ పక్కనే నివసించే మరో మహిళా సాక్షి, దుండగుడు కారు నుంచి బయటకు రాగానే కంటపడిన ప్రతీ ఒక్కరిపైనా కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు.
ఆమె డెయిలీ మెయిల్‌తో మాట్లాడుతూ ‘‘డానియల్ వాకర్ కంగారు పడకుండా ప్రార్థనామందిరం తలుపులు మూసివేసి, నిందితుడు లోపలకు రాకుండా చూశారు’’ అని తెలిపారు.
‘‘లోపలున్నవారందరికీ ఆయన రక్షణ కవచంలా నిలిచారు. ఆయనో హీరో. ఈఘటన మరింత విషాదకరం కాకుండా ఆయన అడ్డుకున్నారు’’ అని చెప్పారు.
వెంటనే స్పందించి ధైర్యాన్ని చాటుకున్న సినగోగ్ భద్రతా సిబ్బంది, లోపల ప్రార్థనలో ఉన్న వారు, పోలీసులు, అందరూ నిందితుడు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారని గ్రేటర్ మాంచెస్టర్ పొలీస్ చీఫ్ కానిస్టేబుల్ సర్ స్టీఫెన్ వాట్సన్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)