You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జింక్ అంటే ఏమిటి, అది శరీరానికి ఎందుకు అవసరం?
- రచయిత, లారా టిల్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జింక్ మన శరీరానికి అవసరమైన ఒక మినరల్. తక్కువ మొత్తంలోనే అయినా, ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా అవసరం.
ఇతర మినరల్స్ మాదిరిగానే, మన శరీరం జింక్‌ను తయారు చేసుకోలేదు. అందువల్ల తీసుకునే ఆహారంలో జింక్ ఉండేలా చూసుకోవాలి.
శరీరంలో భారీ పరిమాణంలో జింక్ నిల్వ ఉండదు, కాబట్టి శరీరానికి తగినంత జింక్ అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి.
అలాగే, తగినంత జింక్ మీ శరీరానికి అందుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ అవసరమైనంత జింక్ శరీరానికి అందకపోతే ఏమవుతుంది?
జింక్ ఎందుకు అవసరం?
మానవ శరీరానికి జింక్ ఎన్నోవిధాలుగా అవసరమైన మినరల్. శరీరంలో 300పైగా ఎంజైమ్‌లు జింక్‌పై ఆధారపడి ఉన్నాయి. రసాయనిక చర్యలను వేగవంతం చేయడంలో సహాయపడే ప్రోటీన్లే ఈ ఎంజైమ్‌లు.
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల అరుగుదల నుంచి డీఎన్‌ఏ నిర్మాణం వరకూ ఎన్నో ముఖ్యమైన జీవక్రియలకు జింక్‌తో సంబంధముంది. ఎముక నిర్మాణంలో కాల్షియంతో పాటు ఇతర మినరల్స్‌ను ఒక్కటి చేసేందుకు, ఎముకల అభివృద్ధికి జింక్ అవసరం.
జింక్ యాంటీ ఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. జీవకణాలు దెబ్బతినకుండా కాపాడడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ సాఫీగా పనిచేయడంలో సాయపడుతుంది.
సంతానోత్పత్తిలోనూ జింక్ పాత్ర కీలకం. మహిళల్లో అండాల ఉత్పత్తిలో, పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి, వీర్యకణాలు చురుగ్గా కదలడంలో ఉపయోగపడుతుంది.
చిన్నారుల ఎదుగుదలకు, మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్థిలో ఇది పాత్ర పోషిస్తుంది.
జలుబుని తగ్గిస్తుందా?
రోగనిరోధక వ్యవస్థలో జింక్‌ది ముఖ్యమైన పాత్ర. 1980ల నాటి నుంచి జలుబుకి ఉపయోగించే ఔషధాల్లో ఇదొక సాధారణ పదార్థంగా మారిపోయింది. అప్పట్లో నిర్వహించిన అధ్యయనాల్లో జలుబుకి కారణమయ్యే వైరస్‌ల వ్యాప్తిని జింక్ నిరోధించగలదని తేలింది.
అయితే, జింక్ జలుబును నివారించడంలో కంటే జలుబు కాలవ్యవధిని తగ్గించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. దాదాపు 30కిపైగా అధ్యయనాలను సమీక్షించినప్పుడు, జింక్ జలుబును నివారించగలదనేందుకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం ముందుగా తీసుకుంటే, జలుబు ఉండే కాలవ్యవధిని ఒకటి రెండు రోజులు తగ్గుతుందని సూచించాయి.
కాకపోతే, ఏ రకం జింక్ తీసుకున్నారు, ఎంత మోతాదులో తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు తీసుకున్నారు వంటి విషయాల్లో వ్యత్యాసాల కారణంగా ఈ ఫలితాలను కచ్చితమైనవిగా నిపుణులు పరిగణనలోకి తీసుకోరు.
జింక్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులో సమస్యలు, వాంతులతో పాటు నోటి రుచి కూడా మారిపోతుంది.
జింక్ ఎంత అవసరం..
యూకేలో, పురుషులకు రోజుకి 9.5 మి.గ్రా, మహిళలకు 7 మి.గ్రాములను సిఫార్సు చేశారు.
పాలిచ్చే మహిళలకు, మొదటి నాలుగు నెలల్లో సాధారణ మోతాదుకి అదనంగా రోజుకి 6 మి.గ్రా, 4 నెలల తర్వాత సాధారణ మోతాదుకి అదనంగా 2.5 మి.గ్రా అవసరమవుతంది.
ఏయే ఆహార పదార్థాల్లో జింక్ ఉంటుంది?
మాంసం
బఠాణీలు, బీన్స్
గింజలు, విత్తనాలు
తృణధాన్యాలు, బ్రౌన్ రైస్
గుడ్లు
డెయిరీ ఉత్పత్తులు
పండ్లు, కూరగాయల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, కానీ జింక్ చాలా తక్కువ ఉంటుంది. శాకాహారం నుంచి వచ్చే జింక్ కంటే, మాంసాహారం ద్వారా అందే జింక్ ఉత్తమం.
ఎందుకంటే, మొక్కల ద్వారా వచ్చిన ఆహారంలో ఫైటేట్లు (నిల్వవున్న భాస్వరం) కూడా ఉంటాయి. ఇవి పేగులో జింక్‌కు అంటుకుని దాని శోషణను నిరోధిస్తాయి.
శాకాహారుల్లో జింక్ స్థాయిలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
శాకాహారంలో జింక్ శోషణను మెరుగుపరిచేందుకు కొన్నిమార్గాలున్నాయి. నానబెట్టిన, మొలకెత్తిన బీన్స్, ధాన్యం గింజల్లో ఫైటేట్ స్థాయిలు తగ్గుతాయి.
ప్రపంచంలోని జనాభాలో 30 శాతం మందిలో జింక్ లోపం తలెత్తే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
సప్లిమెంట్లు తీసుకోవచ్చా?
మీరు జింక్ సప్లిమెంట్లు తీసుకోవాలని అనుకుంటే, అతిగా తీసుకోకుండా ఉండడం ప్రధానం.
రోజుకి 25 ఎంజీ కంటే ఎక్కువ జింక్ తీసుకోకూడదని ఎన్‌హెచ్ఎస్ సూచిస్తోంది.
(ఈ కథనం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుడిని సంప్రదించండి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)