You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అక్కడ భారీ ఆధిక్యంలో ఉండడంతో ఆమె గెలుపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రియాంక ఇక్కడ విజయం సాధిస్తే పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టనున్నారు.
వయనాడ్‌లో మొత్తం ప్రియాంక సహా మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు.
సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) నుంచి సత్యన్ మోకేరీ, బీజేపీ నుంచి నవ్యా హరిదాస్ ఆమెపై పోటీ చేశారు.
వీరే కాకుండా స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు మరో 13 మంది ఇక్కడ బరిలో ఉన్నారు.
ప్రియాంకపై వయనాడ్‌లో పోటీ చేసినవారిలో ఇద్దరు తెలుగువాళ్లు కూడా ఉన్నారు.
తిరుపతి, గుంటూరు నుంచి వయనాడ్
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు జాతీయ జనసేన పార్టీ నుంచి వయనాడ్‌లో పోటీ చేశారు. ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆ అంశాన్ని అందరి దృష్టికి తేవాలన్న లక్ష్యంతో ఇలా జాతీయ స్థాయి నాయకులపై పోటీ చేయాలనుకున్నట్లు నాగేశ్వరరావు ‘బీబీసీ’తో చెప్పారు.
త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ తమ పార్టీ నుంచి అభ్యర్థులను నిలుపుతామని నాగేశ్వరరావు చెప్పారు.
ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ జలీల్ కూడా వయనాడ్‌లో పోటీ చేశారు.
ఏడో తరగతి వరకు చదువుకున్న జలీల్ వ్యవసాయం తన వృత్తి అని పేర్కొన్నారు.
ఆయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు.
ఈయన గతంలో దిల్లీలోని చాందినీ చౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేశ్‌పై పోటీ చేశారు.
జాతీయ జనసేన పార్టీ..
ప్రియాంక గాంధీపై పోటీ చేసిన దుగ్గిరాల నాగేశ్వరరావు ‘జాతీయ జనసేన పార్టీ’కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ పార్టీ మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 74 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 9 లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలిపింది.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్టీ 2 చోట్ల పోటీ చేసింది.
ప్రధాన పార్టీలతో పోటీ పడి విజయం సాధించకపోయినా ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాడే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు.
ప్రస్తుతం వయనాడ్‌లో పోటీకి కూడా ప్రత్యేక హోదా అంశమే కారణమని చెప్పారు.
వయనాడ్‌లో ప్రియాంక ఎందుకు పోటీ చేశారు?
2019లో వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ 2024లోనూ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలోనూ పోటీ చేశారు.
రెండు చోట్లా విజయం సాధించిన ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు.
దీంతో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
రాహుల్ వదులుకున్న ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేశారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ప్రియాంక 5 లక్షల 30 వేల ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ కంటే 3 లక్షల 47 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అదే సమయానికి జాతీయ జనసేన పార్టీకి చెందిన తెలుగు వ్యక్తి నాగేశ్వరరావు 336 ఓట్లు సాధించారు.
మరో తెలుగు అభ్యర్థి షేక్ జలీల్ 1145 ఓట్లు సాధించారు.
(తుది ఫలితాలు వెలువడేటప్పటికి ఈ సంఖ్యలు మారొచ్చు)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)