టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్‌ ఎవరు, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?

    • రచయిత, థామస్ మాకింటోస్, విల్ వెర్నాన్
    • హోదా, బీబీసీ న్యూస్

సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్‌ను పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

లే బోర్‌జే ఎయిర్‌పోర్టులో ఆయన ప్రైవేట్ జెట్ ల్యాండయిన వెంటనే దురోవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది.

ఈ పాపులర్ మెసేజింగ్ యాప్‌కు సంబంధించిన నేరాల కింద బిలియనీర్ పావెల్‌ దురోవ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

టెలిగ్రామ్‌‌ను నేరపూరితంగా వినియోగించుకోవడాన్ని అరికట్టడంలో విఫలమైనట్లు దురోవ్‌పై ఆరోపణలున్నాయి.

టెలిగ్రామ్ యాప్‌ ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్, చీటింగ్‌ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైందన్న ఆరోపణలున్నాయి.

మోడరేటర్లు చాలా తక్కువగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే, ఈ ఆరోపణలను టెలిగ్రామ్ కొట్టివేసింది. తమ సంస్థ విధానాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నాయని టెలిగ్రామ్ తెలిపింది.

‘‘ఒక యాప్‌ దుర్వినియోగం అవుతోందన్న కారణంతో దాని యజమానిని అరెస్టు చేయడం దారుణం.’’ అని టెలిగ్రామ్ సంస్థ ఒక ప్రకటనలో అన్నది.

రష్యాలో పుట్టిన దురోవ్, ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్‌ పౌరసత్వాలు ఉన్నాయి.

రష్యా, యుక్రెయిన్, మాజీ సోవియట్ యూనియన్ దేశాలలో టెలిగ్రామ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.

యూజర్ డేటాను ఇచ్చేందుకు దురోవ్‌ నిరాకరించడంతో 2018లో ఈ యాప్‌ను రష్యాలో నిషేధించారు. కానీ, ఈ బ్యాన్‌ను 2021లో వెనక్కి తీసుకుంది రష్యా.

దురోవ్ తరచూ యూరప్‌లో పర్యటిస్తుంటారు. తమ సంస్థ యూరప్‌లోని నియమాలకు కట్టుబడి ఉందని, ది డిజిటల్ సర్వీసెస్ యాక్ట్‌ను కూడా అనుసరిస్తున్నామని టెలిగ్రామ్ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది టెలిగ్రామ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

‘‘ఇప్పుడు ఎదురైన ఇబ్బంది(దురోవ్ అరెస్ట్)కి పరిష్కారం కనుక్కునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం.’’ అని ఆ సంస్థ ప్రకటన వెల్లడించింది.

దురోవ్ టెలిగ్రామ్‌ను 2013లో తీసుకొచ్చారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, వీచాట్ తర్వాత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా టెలిగ్రామ్‌ చోటు ఉంది.

దురోవ్‌‌ను కలిసేందుకు అవకాశం కల్పించాలంటూ ఫ్రాన్స్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం కోరింది.

‘‘దురోవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి కారణాలేంటో ఫ్రెంచ్ అధికారులు తక్షణమే తెలపాలని కోరుతున్నాం. దురోవ్ హక్కులను పరిరక్షించేందుకు, కాన్సులర్ యాక్సెస్‌ను కల్పించాలి.’’ అని రాయబార కార్యాలయం ఫేస్‌బుక్‌లో రాసింది.

‘‘ప్రస్తుత సమయంలో ఫ్రెంచ్ అధికారులు ఈ విషయంలో మాకు సహకరించడం లేదు. దురోవ్ న్యాయవాదితో మేం సంప్రదింపులు జరుపుతున్నాం.’’ అని పేర్కొంది.

టెలిగ్రామ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 2018లో రష్యాపై విమర్శలు చేసిన పశ్చిమ దేశాల మానవ హక్కుల సంస్థలు ఇప్పుడు దురోవ్ అరెస్ట్‌పై సైలెంట్‌గా ఉంటాయా? అని టెలిగ్రామ్ వేదికపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రశ్నించారు.

చాలామంది రష్యా అధికారులు దురోవ్ అరెస్ట్‌ను ఖండించారు.

భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం విషయంలో పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు.

మోడరేషన్, మెటీరియల్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎక్స్ ఓనర్ ఎలన్‌ మస్క్, తన సోషల్ మీడియా సైట్‌ మీద ఈ అంశంపై పదేపదే పోస్టులు చేశారు.

ఒక పోస్టులో #freepavel అని, మరో దానిలో ‘‘పావ్: యూరప్‌లో ఇది 2030. మీమ్‌ను లైక్ చేసిన మీకు శిక్ష పడుతుంది.’’ అని పోస్టు చేశారు.

టెలిగ్రామ్ గ్రూప్‌లలో 2 లక్షలమంది వరకు సభ్యులుగా చేరవచ్చు. అయితే, ఇలాంటి వెసులుబాట్ల వల్ల తప్పుడు సమాచారం కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలున్నాయి.

యూజర్లకు కుట్రపూరిత నేరాలు, ఉగ్రవాద సంబంధిత కంటెంట్‌ను షేర్ చేసుకునేందుకు ఇది వారధిగా మారుతుందనే ఆరోపణలున్నాయి.

టెలిగ్రామ్ కొన్ని గ్రూప్‌లను తొలగించింది. కానీ, ఇతర సోషల్ మీడియా కంపెనీలు, మెసెంజర్ యాప్‌లతో పోలిస్తే తీవ్రవాద, చట్టవ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చెందకుండా, మోడరేట్ చేసే వ్యవస్థ టెలిగ్రామ్‌లో బలహీనంగా ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)