You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికా: దశాబ్దాల కాంగ్రెస్ ప్రస్థానానికి నాన్సీ పెలోసీ రిటైర్మెంట్
- రచయిత, లిల్లీ జమాలి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికా రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా పేరుగాంచిన నాన్సీ పెలోసి తన దశాబ్దాల కాంగ్రెస్ రాజకీయ ప్రయాణం నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు.
కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఈ డెమోక్రటిక్ నేత గురువారం విడుదల చేసిన వీడియో సందేశంలో 2027 జనవరిలో తన పదవీకాలం ముగిశాక, తిరిగి ఎన్నికలకు పోటీ చేయనని చెప్పారు.
85 ఏళ్ల పెలోసి, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌గా పనిచేసిన మొదటి మహిళ. ఆమె 2003 నుంచి 2023 వరకు ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీకి నాయకత్వం వహించారు.
"మనం చరిత్ర సృష్టించాం, పురోగతి సాధించాం" అని పెలోసి తన ప్రకటనలో తెలిపారు.
ఆమె ఏమన్నారు?
"మనం ఎల్లప్పుడూ ముందున్నాం. ప్రజాస్వామ్యంలో పాలుపంచుకోవడం ద్వారా, అమెరికన్ విలువలను కాపాడుకోవడం ద్వారా దానిని కొనసాగించాలి" అని పెలోసి అన్నారు.
"నేను ప్రేమించే నగరానికి, నా సందేశం ఇది: శాన్ ఫ్రాన్సిస్కో, నీశక్తిని తెలుసుకో" అన్నారు.
పెలోసి 2007లో మొదటిసారి హౌస్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు, ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళ ఆమె. డెమొక్రాట్లు హౌస్‌లో మెజారిటీ కోల్పోయిన 2011 వరకు ఆమె పదవిలో ఉన్నారు. ఆ తర్వాత, 2019 నుంచి 2023 వరకు మళ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
అమెరికా రాజ్యాంగంలో స్పష్టంగా ప్రస్తావించిన ఏకైక కాంగ్రెస్ పదవి హౌస్ స్పీకర్. ప్రెసిడెంట్ పదవికి వైస్ ప్రెసిడెంట్ తర్వాత వరుసలో ఉన్న స్థానం కూడా.
అధ్యక్షుడినీ ఎదిరిస్తూ..
పెలోసి స్పీకర్‌గా ఉన్న సమయంలో, అధ్యక్షుల ఎజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో లేదా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
బరాక్ ఒబామా ప్రధాన ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారని చాలామంది ఆమెను ప్రశంసిస్తుంటారు. అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులపై చట్టాన్ని కూడా పెలోసి సమర్ధించారు.
ఆమె అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కూడా విభేదించారు, ఒకసారి బహిరంగ కార్యక్రమంలో ఆయన ప్రసంగ ప్రతులను చించి వేశారు. అయితే, చాలామంది రిపబ్లికన్లు పెలోసిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఖరీదైన, ఉదారవాద విధానాలను ముందుకు తెస్తున్న ధనవంతులైన తీరప్రాంత డెమొక్రాట్ల చిహ్నంగా ఆమెను చూశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)