You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వక్ఫ్ చట్టం : బిహార్ ఎన్నికల వేళ బీజేపీ ఎందుకు సాహసించింది, జేడీయూ ఎలా అంగీకరించింది?
రాష్ట్రపతి ఆమోదం తర్వాత వక్ఫ్ సవరణ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఈ చట్టం ద్వారా పారదర్శకతను నిర్ధరిస్తామని, వక్ఫ్ ఆస్తుల దోపిడీని నిలిపివేస్తామని, జవాబుదారీతనం వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
అయితే, ప్రభుత్వం ఇలా ఒకే మతంలో సంస్కరణలను తీసుకురావడానికి ఎందుకు నిశ్చయించుకుందని ప్రతిపక్ష పార్టీలు, అనేక ముస్లిం సంస్థలు ప్రశ్నించాయి. దీనిని మైనారిటీ హక్కులలో జోక్యం చేసుకోవడంగా చూశాయి.
ఇంతకీ, ఈ సవరణ నిజంగా సంస్కరణ చర్యనా లేదా ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడమా?, ఈ బిల్లు అవినీతిని అంతం చేస్తుందా లేదా మతపరమైన చర్చను తీవ్రతరం చేస్తుందా?.
2013లో 123 వీఐపీ ఆస్తులు వక్ఫ్‌కు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకీ ఈ కేసు ఏమిటి? వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం బిహార్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
బీబీసీ హిందీ వీక్లీ షో 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ ఈ ప్రశ్నలను చర్చించారు.
యూపీఏ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్‌తో పాటు జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) నాయకుడు రాజీవ్ రంజన్, రాజ్యాంగ నిపుణులు సంజయ్ హెగ్డే, సీనియర్ జర్నలిస్ట్ నీర్జా చౌదరి ఈ అంశాలపై చర్చలో పాల్గొన్నారు.
బిహార్ రాజకీయాలపై ప్రభావం?
ఈ ఏడాది చివర్లో బిహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ బిల్లు ఆ బిహార్ రాజకీయాలలో కీలకంగా మారనుంది. బిహార్‌లోని అనేక నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. అందుకే ఏ పార్టీ అయినా, అక్కడ ఇఫ్తార్ విందులు నిర్వహిస్తుంది.
"బిహార్ ఎన్నికలు ముగిసే వరకు బీజేపీ ఎందుకు ఆగలేదో నాకర్థం కాలేదు" అని నీర్జా చౌదరి అంటున్నారు.
అయితే "నితీష్ కుమార్‌కు కుర్మి, కోయెరి, మహాదళిత్, పస్మాండ ముస్లిం వంటి కొన్ని వర్గాలపై ఇంకా పట్టు ఉంది" అని నీర్జా చౌదరి అన్నారు.
జేడీయూ ఎందుకు మద్దతు ఇచ్చింది?
"ఈ బిల్లు గురించి చాలా అపోహలున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయి. ఇది చట్టంగా అమల్లోకి వచ్చినప్పుడు, అనేక రకాల అపోహలు వాటికవే పరిష్కారమవుతాయి. నితీశ్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారంటే, అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉండదని హామీ ఇచ్చినట్లే" అని జేడీయూ నేత రాజీవ్ రంజన్ అన్నారు.
మతం కోణంలో బిల్లును చూడరాదని, రాష్ట్రంలోని హిందువుల కోసం బిహార్ మత బోర్డు కూడా ఏర్పడినట్లు ఆయన గుర్తుచేశారు.
"తమ భుజాలపై ఎక్కి హక్కులను లాక్కున్నారనే ఆగ్రహం బిహార్‌లోని పేదలు, పస్మాండ ముస్లింలలో చాలా కాలంగా ఉంది" అని రాజీవ్ రంజన్ అన్నారు.
ఓట్ల కోణంలో నితీశ్ ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదని, ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటే, మా పార్టీ అస్సలు మద్దతు ఇచ్చేది కాదని రాజీవ్ అన్నారు.
మిత్రపక్షాలను బీజేపీ ఎలా ఒప్పించింది?
వక్ఫ్ అంశంపై బీజేపీ ప్రభుత్వానికి మిత్రపక్షాలు అండగా నిలిచాయి. కూటమిలో వ్యతిరేకంగా ఎటువంటి స్వరం వినిపించలేదు.
"ఈ బిల్లుపై బీజేపీ తన మిత్ర పక్షాల మద్దతును తీసుకున్న తీరు, దాని రాజకీయ చతురతకు నిదర్శనం" అని నీర్జా చౌదరి అన్నారు.
మిత్రపక్షాలు మద్దతు ఇవ్వకపోతే, బిల్లును ఆమోదించడం కష్టమయ్యేదని నీర్జా అభిప్రాయపడ్డారు. జేపీసీలోని మిత్రపక్షాలు కొన్ని మార్పులను సూచించాయని, వాటిని ఆమోదించారని తెలిపారు.
''ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారితే, వచ్చే ఎన్నికల్లో ఆయనకు కష్టమవుతుంది. కానీ, చంద్రబాబు ప్రత్యర్థి అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా పెద్దగా గొంతు వినిపించే స్థితిలో లేరు. జగన్‌పై చాలా కేసులున్నాయి, ఇది ఆయన స్థానాన్ని బలహీనపరిచింది'' అని ఆమె అన్నారు.
ఆర్టికల్ 370, వక్ఫ్ బోర్డు అంశాలపై అమిత్ షా ఎక్కువగా మాట్లాడారని, ప్రధాని మోదీ ప్రపంచ సమస్యలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు కనిపిస్తోందని నీర్జా చెప్పారు.
ఎలా అమలుచేస్తారనే దానిపైనే..
గత ఏడాది ఆగస్టులో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు దాని గురించి వివరించారు.
"ఈ బిల్లు ఎవరి మత స్వేచ్ఛకు భంగం కలిగించదు. ఎవరి హక్కులను హరించడానికి కాదు. వక్ఫ్‌కు సంబంధించిన విషయాలలో హక్కులు పొందలేని వారికి వాటిని కల్పించడానికి తీసుకొచ్చా" అని రిజిజు అన్నారు.
యూపీఏ ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన సల్మాన్ ఖుర్షీద్ ఈ బిల్లులో మూడు ప్రధాన అభ్యంతరాలున్నాయన్నారు.
"ఇది ఎలా అమలు చేస్తారనే దానిపైనే విషయం ఆధారపడి ఉంటుంది. ఈ సవరణ ఎంత స్పష్టంగా ఉందో చెప్పలేను. వక్ఫ్ బై యూజర్ గురించి ఒక ప్రశ్న ఉంది. దీనిని గతంలోనే రద్దు చేశారు కానీ, ఇప్పుడు భవిష్యత్తు కోసం రద్దు చేసినట్లు చెప్పారు. మునుపటి ఆస్తులపై ఎటువంటి ప్రభావం ఉండదు, ఇది ఉపశమనం కలిగించేది" అని అన్నారు.
"పాత ఆస్తులన్నీ వక్ఫ్ బై యూజర్‌గా ఉన్నాయి కానీ, వాటి డీడ్‌లు లేవు, పూర్తి రికార్డులు లేవు. దానిని వక్ఫ్ బై యూజర్‌గా పరిగణించకపోతే సమస్య ఏర్పడవచ్చు" అని ఖుర్షీద్ అన్నారు.
రెండవ సమస్య పరిమితి చట్టమని దీనిని గతంలో తొలగించారని కానీ, ఇప్పుడు మళ్లీ అమలు చేశారని ఆయన అన్నారు. ఇవి రెండు పెద్ద సమస్యలనీ, కానీ దీనితో పాటు వక్ఫ్‌లో అక్రమాలను తొలగిస్తామని చెబుతున్నారు, అందుకోసం రూపొందించిన నిబంధనలేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పార్లమెంటులో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. బోర్డు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోదని, ముస్లిమేతరులను అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఉంటారని అన్నారు.
"అన్ని మతాల ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుని, సహకరించుకుంటే మంచిదే. కానీ మిగతా చోట్ల అలా లేదు." అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
123 ఆస్తులను వక్ఫ్‌కు ఎందుకు ఇచ్చారు?
దిల్లీలో రాజధాని నిర్మిస్తున్నప్పుడు, దానికి అవసరమైన భూమిని సేకరించే సమయంలో మతపరమైన అనేక ప్రదేశాలను కూడా స్వాధీనం చేసుకున్నారని ఖుర్షీద్ గుర్తుచేశారు. వీటిని పొరపాటున స్వాధీనం చేసుకున్నారని బెర్నీ కమిటీ గుర్తించింది.
"ఈరోజు కూడా లుటియెన్స్ జోన్‌లోని భవనాల మధ్య అనేక సమాధులు, దర్గాలను చూడొచ్చు. వాటిపై ఎటువంటి వివాదాలు ఉండకూడదని చెప్పారు" అని ఆయన అన్నారు.
"ఇదికాకుండా 123 ఆస్తుల విషయంలో అసలు యజమానులు అక్కడ లేనందున, వాటిని వక్ఫ్ బోర్డుకు అప్పగించారు" అని ఖుర్షీద్ అన్నారు
ఈ బిల్లు 'అవినీతి'ని ఆపుతుందా?
"నియంత్రణ ఎక్కువగా కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. భూమి వక్ఫ్‌కు చెందుతుందా లేదా ప్రభుత్వానికి చెందుతుందా అనేది కలెక్టర్ నిర్ణయించవచ్చు. న్యాయమూర్తి, వాది ఇద్దరూ ఒకటే అయితే, న్యాయం ఎలా జరుగుతుంది?" అని రాజ్యాంగ నిపుణులు సంజయ్ హెగ్డే అన్నారు.
వక్ఫ్ నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కానీ, బోర్డులో ఎవరు కూర్చుంటారు అనేది ప్రశ్న అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)