ఒడిశా రైలు ప్రమాదం: ఒక అబ్బాయి శవాన్ని తమదే అంటున్న రెండు కుటుంబాలు.. ఎలా తేలుస్తారు?

    • రచయిత, అమితాబ్ భట్టసాలి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తాఫ్సిర్ అన్సారీకి 16 ఏళ్లు. తమ్ముడు తౌసిఫ్ అన్సారీ కంటే మూడేళ్లు పెద్దవాడు. బిహార్‌కు చెందిన తాఫ్సిర్, తౌసిఫ్‌ జూన్ 2న జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మరణించారు.

ఆ ఇద్దరు అబ్బాయిల కోసం బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో వెతుకుతున్న వారి తాత నిజాముద్దీన్ ‘ఇదిగో ఆ ఇద్దరే’ అంటూ వారి ఫొటోలను చూసి పెద్దగా అరిచారు.

చనిపోయిన, ఛిద్రమైన శరీరాల ఫోటోలను ఆసుపత్రి గోడలపై అధికారులు ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. బంధువులు వారిని గుర్తిస్తే వాటిని వారికి అప్పజెబుతారు.

ఆ ఫోటోలలో తాఫ్సిర్‌కు 20 అని, తౌసిఫ్‌కు 169 అని నంబర్ ట్యాగ్‌లు ఇచ్చారు.

మరోపక్క ఆ ఇద్దరు పిల్లల తండ్రి మహ్మద్ భికారీగానీ, మరో బాలిక ఏడేళ్ల జహీదా ఖాన్‌గానీ ఆ ఫోటోలలో కనిపించ లేదు. ఎందుకంటే వాళ్ల శవాలు ఇంకా దొరక లేదు.

అన్సారీ సోదరులకు, జహీదాకు సంబంధం లేదు.

జహీదా తన తల్లి షబ్నమ్‌ బీబీతో కలిసి కోల్‌కతా నుంచి హైదరాబాద్ వెళుతున్నారు.

‘‘మా ఆవిడ శవం దొరికింది. ఎలాగో భువనేశ్వర్‌లో అంత్యక్రియలు నిర్వహించా. మళ్లీ ఇక్కడికి (బాలాసోర్) వచ్చా. మా అమ్మాయి శవం కోసం వెతుకుతున్నా. ఏ ఆసుపత్రిలోనూ లేదు. ఫోటో కూడా ఎక్కడా కనిపించడం లేదు’’ అని జహీదా ఖాన్ తండ్రి సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు.

సర్ఫరాజ్ హైదరాబాద్ వాసి. ఆయన తన భార్య మృతదేహానికి సొంతూరులో అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు.

గుర్తుపట్టని శవాల ఫోటోలను ఆయన నిశితంగా పరిశీలించారు. కానీ, అందులో జహీదా కనిపించ లేదు.

‘‘వాళ్లు ఏసీ టికెట్ల కోసం ప్రయత్నించారు. కానీ, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. ఇంకో క్లాస్‌లో టికెట్లు తీసుకున్నారు. ఎస్1 కోచ్‌లో ఎక్కారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మా ఆవిడ నాతో ఫోన్‌లో మాట్లాడింది’’ అని సర్ఫరాజ్ చెప్పారు.

ఆ తర్వాత గంటన్నరకే ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో బాగా దెబ్బతిన్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లలో ఎస్1 కోచ్ ఒకటి.

ఒక్కొక్కరిది ఒక్కో కథ

ప్రమాదానికి ముందు అహ్మద్ తన భార్యతో మాట్లాడగలిగారు. కానీ, భికారీ అనే మరో బాధితుడి విషయంలో అలా జరగలేదు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా భికారీ ఫోన్ కలవలేదు.

‘‘రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాం. శనివారం నాడు ఒక వ్యక్తి మా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈ ఫోన్ ఓనర్ రైలు ప్రమాదంలో మరణించారని, మళ్లీ కాల్ చేయవద్దని చెప్పారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఫోన్ అతని దగ్గరే ఉంది. మరి శవం ఏమయ్యింది’’ అని మహ్మద్ భికారీ బంధువు ఒకరు ప్రశ్నించారు.

బాలాసోర్ ఆసుపత్రిలో మృతులను గుర్తించడానికి ఫోటోలు మాత్రమే ఆధారం. గుర్తించని మృతదేహాలను భువనేశ్వర్ పంపిస్తున్నారు.

'మా పిల్లాడికి సున్తీ చేసి ఉంటుంది'

అన్సారీ సోదరుల కోసం వారి తాత నిజాముద్దీన్, ఆయన కుటుంబ సభ్యులు కొందరు భువనేశ్వర్ ఆసుపత్రికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఒక అధికారి వారిని ఆపారు.

‘’20వ నంబర్ ఉన్న బాడీని మరొక కుటుంబం మాదే అంటోంది’’ అని అధికారి వెల్లడించారు. కానీ, ఆ శవం అన్సారీ బ్రదర్స్‌లో ఒకడైన తాఫ్సిర్‌ది అని నిజాముద్దీన్ చెప్పారు.

‘‘అలా ఎలా చెబుతారు? నా మనవళ్లను నేను గుర్తించలేనా’’ అని నిజాముద్దీన్ ప్రశ్నించారు.

ఆ అధికారి నిజాముద్దీన్‌ను సముదాయించారు. ‘‘మీరు భువనేశ్వర్ వెళ్లి, మున్సిపల్ అధికారులకు విషయం చెప్పండి. మీ ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం. వాళ్లు మీ రెండు కుటుంబాల వాదనను పరిశీలించి అవసరమైతే డీఎన్ఏ టెస్టులు చేసి సమస్యను పరిష్కరిస్తారు’’ అని ఆ అధికారి చెప్పారు.

నిజాముద్దీన్ సరేనన్నారు. ‘‘మేం ముస్లింలం. మా పిల్లాడికి సున్తీ చేసి ఉంటుంది. ఒకవేళ అలాంటి ఆధారాలేమీ దొరక్కపోతే డీఎన్ఏ టెస్టుకు మేం సిద్ధం’’ అని నిజాముద్దీన్ బంధువు ఒకరు చెప్పారు.

ఎలా గుర్తించాలి?

20వ నంబర్ ట్యాగ్ ఉన్న మృతదేహాన్ని ఝార్ఖండ్‌కు చెందిన 20 ఏళ్ల సుఖ్‌లాల్ మరాండీదని అతని బంధువులు క్లెయిమ్ చేసినట్లు రికార్డుల్లో ఉంది. సుఖ్‌లాల్ బంధువు ఒకరు అది సుఖ్‌లాల్‌దేనని అధికారులకు చెప్పారు.

అధికారులు ఇచ్చిన ఫోన్ నంబర్ తీసుకుని బీబీసీ, మరాండి బంధువులతో మాట్లాడింది.

సుఖ్‌లాల్ మరాండీ శవాన్ని తాఫ్సిర్‌దిగా పేర్కొంటూ అతని కుటుంబ సభ్యులు చేసిన క్లెయిమ్ గురించి తమకు తెలియదని మరాండీ కుటుంబ సభ్యుడొకరు బీబీసీకి ఫోన్‌లో చెప్పారు.

‘‘మేం ఛిద్రమైన శవం ఫోటోను మాత్రమే చూశాం. అతను సుఖ్‌లాల్ అని అనుకున్నాం. మేం పొరపాటు పడే అవకాశం ఉంది. అసలు శవాన్ని చూస్తే ఏదైనా నిర్ధారించగలం’’ అని అనిల్ అనే ఆ వ్యక్తి బీబీసీకి చెప్పారు.

ఇలా ఒకే మృతదేహాన్ని ఇద్దరు క్లెయిమ్ చేస్తుంటే దాన్ని పరిష్కరించే మార్గమేంటో బాలాసోర్ ఆసుపత్రి అధికారిణి ఒకరు వివరించారు. ఆమె తన పేరు పబ్లిష్ చేయడానికి ఇష్టపడలేదు.

‘‘రెండు కుటుంబాలు భువనేశ్వర్‌కు చేరుకున్న తర్వాత, మృతదేహాన్ని మార్చురీ నుంచి బయటకు తీస్తాం. అక్కడ అధికారుల బృందం ఉంటుంది. వారు ఇరువురి వాదనలను వింటారు. ఫోటోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తారు. అప్పటికీ తేలకపోతే డీఎన్ఏ పరీక్షకు పంపిస్తారు’’ అని ఆమె వివరించారు.

ఈ కథనం పబ్లిష్ చేసే సమయానికి 20వ నంబర్ ట్యాగ్ ఉన్న ఆ మృతదేహం ఎవరిదో తేలలేదు.

అన్సారీ సోదరుల తండ్రి మహ్మద్ భికారీ, చిన్నారి జహీదాఖాన్ మృతదేహాలు కూడా దొరకలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)