‘జనక అయితే గనక’ రివ్యూ: ‘కామన్ మ్యాన్ ప్రసాద్’ పాత్రలో సుహాస్ ఎలా నటించారు?

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

‘కంటెంట్’ ఉన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు సుహాస్.

ఇప్పుడు సుహాస్, సంగీర్తన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జనక అయితే గనక’ విడుదలైంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ ఏంటి?

ప్రసాద్ (సుహాస్) మధ్యతరగతి యువకుడు. చిన్నపాటి ఉద్యోగంతో ఆర్థికంగా కష్టాలు పడుతూనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు.

పిల్లలను కనకుండా ఉండటానికి తన భార్యను ఒప్పిస్తాడు. కానీ, అతని భార్య గర్భవతి అవుతారు.

దానికి కారణం కండోమ్ ఫెయిల్ అవ్వడమే అని భావించి ఆ కండోమ్ తయారు చేసిన కంపెనీ మీద కేసు వేస్తాడు.

మరి, ఆ కేసులో ప్రసాద్ గెలిచాడా? దాని వల్ల అతనికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు పిల్లల విషయంలో అతని ఆలోచన మారిందా? లేదా? అన్నదే కథ.

ఎవరి నటన ఎలా ఉంది?

సుహాస్ ఈ సినిమాలో ఓ మధ్యతరగతి వ్యక్తిగా ‘ప్రసాద్’ పాత్రలో నటించారు.

ఇప్పటి వరకు సుహాస్ నటించిన పాత్రలకు కొనసాగింపులా ఈ పాత్ర ఉందే తప్ప, అతని నటనలో వైవిధ్యాన్ని మాత్రం ఈ క్యారెక్టర్ ప్రెజెంట్ చేయలేకపోయింది.

పాత్ర పరంగా అయితే సుహాస్ న్యాయం చేశాడనే చెప్పొచ్చు.

సుహాస్ భార్య పాత్రలో సంగీర్తన విపిన్ నటించారు. ఈ పాత్ర చిత్రీకరణ పేలవంగా ఉండటంతో సంగీర్తన నటన చాలా డల్‌గా ఉంది.

పత్తి కిషోర్ పాత్రలో వెన్నెల కిషోర్ మంచి ఎనర్జీతో నటించారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ వెన్నెల కిషోర్ నటనే అని చెప్పొచ్చు.

న్యాయవాది అజయ్ శర్మ పాత్రలో మురళీ శర్మ చాలా బాగా నటించారు.

జడ్జి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన బాగుంది. ప్రసాద్ తండ్రి పాత్రలో గోపరాజు రమణ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా నటించారు.

ప్రభాస్ శీను నటన పర్వాలేదనిపించింది.

ఇతర అంశాలు ఎలా ఉన్నాయి?

‘నా ఫేవరేట్ నా పెళ్లామే’, ‘ఓ సారైనా చూడవే’ పాటలు పర్వాలేదనిపించాయి.

మిడిల్ క్లాస్ ఎమోషన్స్ :

మిడిల్ క్లాస్ ఆర్థిక కష్టాల గురించి చెప్పే సినిమా ఇది.

పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకూ వారికి నాణ్యమైన విద్య అందించడం, వారి అవసరాలు తీర్చడం అనేవి ఓ సగటు మధ్యతరగతి మనిషికి ఆర్థిక భారమే.

ఈ కష్టాలను సున్నిత హాస్యంతో చూపించారు.

మధ్యతరగతి జీవితాల ఆశల గురించి చెబుతూనే, పుట్టే పిల్లల వైద్యం, చదువు ఎంత ఖరీదైపోయాయో సెటైరికల్‌గా చెప్పారు.

సెన్సిటివ్ సబ్జెక్ట్ :

సినిమా కథ విషయానికి వస్తే చాలా సెన్సిటివ్ అంశం ఇది.

కండోమ్ ఫెయిల్ అవ్వడం అనే విషయాన్ని చాలా సింపుల్‌గా ప్రేక్షకులకు అర్థమయ్యేలా నీట్‌గా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది.

కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్‌గా, సాగదీసినట్లుగా అనిపించడం కొంత నిరాశ పరిచే అంశం.

సెకండ్ హాఫ్‌లో కోర్ట్ రూమ్ డ్రామా పర్వాలేదనిపించింది.

కథను ఇంకా కొత్తగా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది.

కథలో సన్నివేశాలు అన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చిన మిడిల్ క్లాస్ సినిమాల్లో చూసినవే అన్న భావన కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్

  • వెన్నెల కిషోర్ నటన
  • స్టోరీ
  • కామెడీ ట్రాక్స్

మైనస్ పాయింట్స్

  • కథ బాగున్నా దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయకపోవడం
  • పాత్రల చిత్రీకరణ పేలవంగా ఉండటం
  • ఫస్ట్ హాఫ్ లాగింగ్
  • సంగీర్తన విపిన్ పాత్ర బలహీనంగా ఉండటం

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)