You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు... డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షునిపై ఆరోపణలు
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా మహిళా రెజ్లింగ్ క్రీడాకారులు ధర్నాకు దిగారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని క్రీడాకారులు ఆరోపణలు చేశారు.
రెజ్లర్ వినేష్ ఫోగట్ విలేకరులతో మాట్లాడుతూ "కోచ్‌లు మహిళలను వేధిస్తున్నారు. ఫెడరేషన్‌తో మంచి సంబంధాలు ఉన్న కోచ్‌లు కూడా మహిళా కోచ్‌లతో అలాగే ప్రవర్తిస్తున్నారు.
అమ్మాయిలను వేధిస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు చాలా మంది అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అవి మా వ్యక్తిగత జీవితంలోకి వస్తాయి. భంగం కలిగిస్తాయి. వాళ్లు వేధిస్తున్నారు. ఒలింపిక్స్ ఆడేందుకు వెళ్లినప్పుడు ఫిజియో, కోచ్ లేరు. మేం గొంతు ఎత్తగానే మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు" అని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ఈ ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ''ఏ క్రీడాకారిణి కూడా లైంగిక వేధింపులకు గురికాలేదు. రుజువు చేస్తే ఉరికి అయినా సిద్ధం''అని తెలిపారు.
ఒలింపిక్స్, ప్రపంచ పోటీల్లో ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు అవకాశం కల్పించడం వల్లే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు.
బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి ఆటగాళ్లు వారం క్రితం కూడా తనను కలిశారని, తమకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కష్ట సమయాల్లో వినేష్ ఫోగట్‌కు తాను కూడా సాయం చేశానని బ్రిజ్ భూషణ్ వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
అయితే విచారణ పూర్తయ్యే వరకు తన పదవికి రాజీనామా చేస్తున్నారా అని విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు బ్రిజ్ భూషణ్.
క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలేంటి?
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో వినేష్ ఫోగట్ 53 కిలోల బరువు విభాగంలో స్వర్ణ పతక విజేత. తనను మానసికంగా హింసించారని, ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని తెలిపారు. ప్రతిరోజూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే వచ్చేదని అన్నారు.
నాకేదైనా జరిగితే నా కుటుంబం ఏమైపోతుందని, ఆ తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారని అన్నారు.
ఆటగాళ్లలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఫెడరేషన్‌దే బాధ్యత అని అన్నారు. నేను మానసికంగా బలహీనంగా ఉన్నానని ప్రచారం చేశారని విలేకరుల సమావేశంలో ఫోగట్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
బజరంగ్ పునియా మాట్లాడుతూ “మేం ఫెడరేషన్ మార్పును కోరుకుంటున్నాం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేధిస్తోంది.
డబ్ల్యూఎఫ్‌ఐలో భాగమైన వ్యక్తులకు కుస్తీ గురించి ఏం తెలియదు" అని ఆరోపించారు.
ఈ వార్తను రిపోర్టుచేసే సమయానికి బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్‌లతో సహా పలువురు ఇతర ఆటగాళ్లు కూడా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కూర్చున్నారు.
ధర్నాలో కూర్చున్న క్రీడాకారులతో బీబీసీ పంజాబీ కరస్పాండెంట్ అర్ష్‌దీప్ కౌర్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. కొద్ది సమయం తర్వాత విలేకరుల సమావేశంలో వారు తమ వాయిస్ వినిపిస్తామన్నారు.
కాగా, మీడియా సమావేశంలో క్రీడాకారులు మాట్లాడలేదు. అయితే జనవరి 26 సన్నాహాకాల దృష్ట్యా జంతర్ మంతర్ వద్ద కూర్చోవడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
వారిని నిరసన ప్రదర్శన నుంచి పంపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో క్రీడాకారులు తదుపరి వ్యూహంపై చర్చలు మొదలుపెట్టారు.
ప్రస్తుతం అనుమతి లేకపోవడంతో గురువారం ఉదయం వచ్చి ధర్నా చేస్తామని మీడియాకు తెలిపారు.
కాగా, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కుస్తీ క్రీడాకారులను దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్ కలిశారు. వారికి సంఘీభావం ప్రకటించారు.
''ఇప్పుడే జంతర్ మంతర్ వెళ్లి దేశ ఛాంపియన్ రెజ్లర్లను కలిశాను. మన త్రివర్ణ పతాక వైభవాన్నిపెంచిన వాళ్లకు ఈరోజు చలికాలంలో రోడ్డుపై కూర్చోవాల్సి రావడం చాలా బాధాకరం. వారికి అండగా ఉండి న్యాయం చేస్తాం'' అని ట్విటర్‌లో తెలిపారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు?
1991లో తొలిసారి గోండా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు బ్రిజ్ భూషణ్. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులలో ఆయన కూడా ఒకరు. ఆరుసార్లు ఎంపీగా గెలిచారు.
గోండా నగరంలో 'స్థానిక నాయకుడి'గా పిలుచుకునే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ 2008లో బీజేపీని వీడి ములాయం సింగ్ ఎస్పీలో చేరారు.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి తిరిగి వచ్చారు. అనంతరం వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించారు.
క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు బ్రిజ్ భూషణ్ కుస్తీ పోటీలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.
ఆయనకు రాజధాని లక్నోలోని లక్ష్మణపురి ప్రాంతంలో ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. బ్రిజ్ భూషణ్‌పై గతంలో హత్య, దహనం, విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
- చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం
- పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
- నేపాల్: విమానప్రమాదంలో ‘చనిపోయిన’ కో పైలెట్ అంజూకు తెనాలికి సంబంధం ఏంటి...
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
- డబ్బులు మదుపు చేస్తున్నారు సరే... తగిన రాబడి వస్తోందా లేదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)