వేడి నీళ్లా, చన్నీళ్లా? చలికాలంలో ఏ నీళ్లతో స్నానం చేస్తే మీ ఆరోగ్యానికి మంచిది?

    • రచయిత, ఇఫ్తేఖార్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శీతాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది ఉదయాన్నే 'ఇప్పుడు స్నానం చేయాలా? వద్దా?' అని తెగ ఆలోచిస్తుంటారు.

ఒకవేళ పొద్దున్నే స్నానం చేసేందుకు ఎలాగోలా ధైర్యం తెచ్చుకున్నా, 'వేడి నీళ్లతోనా, చన్నీళ్లతోనా.. ఏ నీటితో స్నానం చేయాలి?' అనే ప్రశ్న తలెత్తుతుంది.

చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తే మంచిదని చాలామంది చెబుతుంటారు. వేడి నీళ్ల స్నానం శరీరానికి హాయినిచ్చి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందని, చల్లదనం నుంచి కాపాడుతుందని అంటుంటారు.

అయితే, వేడి నీళ్లతో స్నానం చేస్తే చర్మం పొడిబారిపోయి, రోమాలు దెబ్బతింటాయని, సహజంగా శరీరంపై ఉండే ఆయిల్ లేయర్ కూడా పోతుందని కొందరు అంటున్నారు.

అయితే, దీనిలో నిజమేంటి? అన్ని కాలాల్లో చన్నీళ్ల స్నానం చేయొచ్చా? చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదేనా?

దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసర్చ్ అండ్ ఇంజినీరింగ్ డెవలప్‌మెంట్‌ 2022లో ప్రచురితమైన ఒక పరిశోధన నివేదికలో.. శరీర ఉపరితలంపై కెరెటిన్ కణాలు ఉంటాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే ఈ కణాలు దెబ్బతింటాయి. తామర వంటి చర్మ సమస్యలు తీవ్రతరమవుతాయని తెలిపింది.

వేడి నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది?

శీతాకాలంలో ప్రజలు తరచూ వేడి నీళ్లతో స్నానం చేసేందుకే మొగ్గు చూపుతుంటారు. కానీ, ఇలా చేయడం అంత మంచింది కాదని డెర్మటాలజిస్టులు (చర్మ వైద్య నిపుణులు) చెబుతున్నారు.

బాగా వేడిగా ఉన్న నీళ్లు మన చర్మ సహజ రక్షణ కవచాన్ని దెబ్బతీస్తాయని వారు చెబుతున్నారు.

యూపీలోని నోయిడాకు చెందిన కైలాష్ హాస్పిటల్‌ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అంజు ఝా దీని గురించి మాట్లాడుతూ.. ''శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయొచ్చు. కానీ, అవి గోరువెచ్చగా ఉండాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు'' అని చెప్పారు.

''బాగా వేడి నీళ్లతో స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారుతుండొచ్చు. దీన్ని మనం జిరోసిస్ అంటాం'' అని డాక్టర్ అంజు తెలిపారు.

శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు నీళ్లు వేడిగా ఉండటం ముఖ్యమే. అయితే, మీకు చలి అనిపించకుండా ఉండేంత వేడి మాత్రమే ఉండాలి'' అని అపోలో హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

మన చర్మ బాహ్య పొరలో సెబమ్, లిపిడ్స్‌కు చెందిన పలుచని జిడ్డు పొర ఉంటుంది. అది బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి, బాహ్య ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

చర్మం పొడిబారకుండా తేమగా, మృదువుగా ఉంచడంలో కూడా ఈ పొర చాలా కీలకం.

'' శరీరంపై వేడి నీళ్లు పోసుకున్నప్పుడు, మన చర్మంపై ఉండే ముఖ్యమైన ఆయిల్స్‌ అన్ని పోతాయి. ఎవరైనా మరీ వేడి నీళ్లు పోసుకుంటే, ఈ పొర త్వరగా పొడిబారుతుంది'' అని డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

చర్మంపై ఉండే జిడ్డు పొర తొలగిపోతే, కాస్త అసౌకర్యానికి గురవుతామని, వేడి నీళ్లు చర్మాన్ని పొడిబారేలా చేసి, దురదకు కారణమవుతాయని ఆయన తెలిపారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

నీళ్లు బాగా వేడిగా ఉంటే, ఏ వ్యక్తికైనా ప్రమాదమే.

అయితే, కొన్ని కేసుల్లో సాధారణం కంటే ఎక్కువ వేడి నీళ్లను ఉపయోగించినప్పుడు, కొంతమందికి చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి.

'' మీది పొడి చర్మం అయితే, ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేసినప్పుడు డెర్మటైటిస్, తామర వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది'' అని డాక్టర్ అంజు తెలిపారు.

డెర్మటైటిస్ అనేది ఒక చర్మ సమస్య. దీనివల్ల చర్మంపై వాపు, దురద వంటివి వస్తాయి. ఇది చర్మం ఎర్రగా మారేందుకు కూడా కారణమవుతుంది.

ఎవరికైనా అప్పటికే తామర వ్యాధి (ఆటోపిక్ డెర్మటైటిస్) ఉంటే, వేడి నీళ్లతో స్నానం చేయడం మరింత ప్రమాదకరమని డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

తామర అనేది ఒక చర్మ వ్యాది. ఇది చర్మం పొడిబారడం, ఎర్రగా మారడం, దురదకు కారణమవుతుంది.

ఒకవేళ మీరు పాలిసిథెమియా వెరా రోగి అయితే, వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పాలిసిథెమియా వెరా అనేది.. చర్మం అవసరమైన దానికంటే ఎక్కువ ఎర్ర రక్త కణాలను విడుదల చేసే వ్యాధి.

''ఈ వ్యాధితో బాధపడే వారు ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే, చర్మం మరింత ఎర్రగా కందిపోతుంది'' అని డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

బయట చలిగా ఉండి.. చన్నీళ్లతో స్నానం చేస్తే?

బయట బాగా చలిగా ఉన్నప్పుడు, మీరు శరీరంపై మరింత చన్నీళ్లను పోస్తే.. అది కూడా ప్రమాదకరంగా మారొచ్చు.

దీనిపై దిల్లీలోని బీఎల్‌కే-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షనిస్ట్ డాక్టర్ ప్రతీక్ కిశోర్‌తో మాట్లాడాం.

మన శరీరం ఒక్కసారిగా ఎక్కువ వేడికి లేదా ఎక్కువ చలికి గురైతే, రక్తనాళాలు వెంటనే స్పందిస్తాయి.

''ఎక్కువ చన్నీళ్లు శరీరంపై పోసుకున్నప్పుడు రక్త నాళాలు సంకోచానికి గురై, బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) పెరుగుతుంది. ఒక్కసారిగా హార్ట్ రేటు కూడా పెరుగుతుంది. అదే ఎక్కువ వేడి నీళ్లు అయితే, రక్త నాళాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు బ్లడ్ ప్రెజర్ తగ్గి, కళ్లు తిరగడం లేదా మూర్ఛపోవడం జరుగుతుంది. అందుకే, ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయకూడదు'' అని డాక్టర్ ప్రతీక్ చెప్పారు.

గుండె వ్యాధులు, రక్త నాళాలు మూసుకుపోవడం, అత్యధిక రక్తపోటు లేదా ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు మరింత ప్రమాదకరమని తెలిపారు.

''ఎక్కువ చన్నీళ్లు బ్లడ్ ప్రెజర్ వేగంగా పెరిగేందుకు కారణమవుతుంది. ఇది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది'' అని హెచ్చరించారు.

చన్నీళ్లతో స్నానం చేయడం గురించి మాట్లాడిన డాక్టర్ అంజు.. ''గట్టకట్టేంత చలికాలంలో ఎక్కువ చన్నీళ్లతో స్నానం చేస్తే, మన శరీరానికి మరింత ప్రమాదకరం'' అని చెప్పారు.

''ఇలాంటి పరిస్థితుల్లో చిల్‌బ్లెయిన్స్ అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. చిల్‌బ్లెయిన్స్ వల్ల చేతివేళ్లు, కాలివేళ్లు నీలంగా మారడం, వాయడం, మండటం జరుగుతుంది. చలి వల్ల రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతో ఈ సమస్య వస్తుంటుంది'' అని తెలిపారు.

శీతాకాలంలో బాగా చన్నీళ్లతో స్నానం చేయొద్దని ఆమె సూచించారు. శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుకోవడం అవసరమన్నారు.

''చిన్నపిల్లలు, పెద్దల చర్మం అప్పటికే చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేస్తే, పొడిబారడం, దురద, చికాకు, చర్మం పగలడం పెరుగుతుంది'' అని డాక్టర్ అంజు చెప్పారు.

''శీతాకాలంలో గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అంతేకాక, స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల పొడిబారడం, దురద తగ్గుతాయి'' అని తెలిపారు.

బోరు బావుల, కుళాయిల నీటితో స్నానం చేయొచ్చా?

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చాలావరకు బోరుబావుల నీళ్లు లేదా కుళాయి నీళ్లతో స్నానం చేస్తుంటారు.

శీతాకాలంలో ఈ బోరుబావులు, కుళాయిల నుంచి గోరువెచ్చని నీరు వస్తుంది.

అందుకే, నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నీళ్లను వేడి చేసుకోకుండానే స్నానం చేస్తుంటారు. అయితే, దీనిపై వైద్యులు ప్రజలను హెచ్చరిస్తుంటారు.

చాలా గ్రామీణ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ట్రేస్ మినరల్స్ ఉంటాయి.

ఉష్ణోగ్రతల పరంగా చూసుకుంటే, శీతాకాలంలో ఈ నీరు కాస్త వేడిగా, వేసవిలో కాస్త చల్లగా అనిపిస్తుంటుంది. అందుకే, ప్రజలు ఈ నీళ్లతో స్నానం చేయడాన్ని సౌకర్యంగా భావిస్తుంటారు.

ఈ నీళ్లే కొన్నిసార్లు చర్మం మండటం, దురద వంటి సమస్యలను కలగజేస్తాయని డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

డాక్టర్లు చెబుతున్న ప్రకారం.. నీటిలో ఉండే ఈ మినరల్స్ మొత్తం వల్ల ఇలా జరుగుతుంది. క్లోరైడ్‌లు, సల్ఫేట్‌లు, నీటిలో కరిగిపోని లవణాలు ఎక్కువగా ఉంటే.. అవి ''హార్డ్ వాటర్''గా వర్గీకరించవచ్చు.

''నీటి హార్డ్‌నెస్ పెరిగే కొద్దీ, ఈ నీరు చర్మ సహజ జిడ్డు పొరను తొలగిస్తుంది. ఇది చర్మం పొడిబారడం, దురద, చికాకు వంటి సమస్యలను పెంచుతుంది. అంతేకాక, ఇటువంటి నీటిలో అధికంగా ఉండే ఖనిజాల కారణంగా హెయిర్ టెక్స్చర్ దెబ్బతింటుంది. జట్టు పొడిబారినట్లు, నిర్జీవంగా కనిపిస్తుంది'' అని డాక్టర్ డీఎం మహాజన్ చెప్పారు.

జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పాడవ్వడమే కాకుండా.. జుట్టు కూడా దెబ్బతింటుంది.

బాగా వేడి నీళ్లతో తలస్నానం చేస్తే జుట్టుకు సహజంగా ఉండే తేమ పోయి, జుట్టు పొడిబారడం, చిక్కులు పడటం, విరిగిపోవడం జరుగుతుందని నిపుణులు చెప్పారు.

చర్మం మాదిరిగానే మన జుట్టుపై కూడా నేచురల్ ఆయిల్ ఉంటుంది. జుట్టుపై వేడి నీళ్లు పోసినప్పుడు, అది తొలగిపోయి, జుట్టు పొడిగా మారుతుందని డాక్టర్ డీఎం మహాజన్ అన్నారు.

దీనికోసం చలికాలమైనా, వేసవి కాలమైన ఎప్పుడూ స్నానం, తలస్నానం కోసం గోరువెచ్చని నీటినే వాడాలని, ఎక్కువ వేడి నీళ్లను వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)