You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సముద్రంలో మునిగిన రెండు రష్యన్ ఆయిల్ ట్యాంకర్లు, భారీగా చమురు లీక్
నల్లసముద్రంలో రెండు రష్యన్ చమురు ట్యాంకులు మునిగిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఆ ట్యాంకర్లు భారీగా దెబ్బతిన్నాయని రష్యా అధికారులు వెల్లడించారు. వాటి నుంచి చమురు ఎగచిమ్ముతున్నట్టు చెప్పారు. ఈ రెండింటిలో 29మంది సిబ్బంది ఉన్నారు.
ఈ మేరకు టెలిగ్రామ్‌లో రష్యా సదరన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆయిల్ ట్యాంకర్‌తో ప్రయాణిస్తున్న నౌక భారీ తుపాను కారణంగా సగానికి విరిగిపోయినట్లు కనిపిస్తోంది. నీటి మీద చమురు తెట్టు కనిపిస్తోంది.
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు భావిస్తున్నారని టాస్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ ప్రమాదంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉప ప్రధాని విటాలీ సెవల్‌యేవ్ నేతృత్వంలో ఓ కమిటీ వేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. అధికారులు ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారని టాస్ వార్తా సంస్థ తెలిపింది.
రష్యా ఆధీనంలోని క్రైమియాకు, రష్యాకు మధ్యనున్న కెర్చ్ జలసంధిలో ఈ ప్రమాదం జరిగింది.
టగ్‌బోట్‌లు, హెలీకాప్టర్లు, 50మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని, ఆయిల్ తెట్టును తొలగించే ప్రక్రియ జరుగుతోందని టాస్ వార్తా సంస్థ తెలిపింది.
"ఈ రోజు నల్ల సముద్రంలో తుపాను కారణంగా వోల్గోనెఫ్ట్-212, వోల్గోనెఫ్ట్-239 అనే రెండు ట్యాంకర్లు మునిగిపోయాయి" అని రష్యా ప్రభుత్వానికి చెందిన సీ అండ్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ రాస్మొర్రెచ్‌ఫ్లోట్ ఒక ప్రకటనలో రాసింది.
"ఈ రెండు ఓడలలో ఒకదానిలో 15మంది, మరొకదానిలో 14 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం కారణంగా ఆయిల్ లీకవుతోంది" అని ఆ ప్రకటన పేర్కొంది.
రెండు ట్యాంకర్లు 4,200 టన్నుల చమురును మోసుకెళ్లే సామర్ధ్యం కలవని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
చమురు తెట్టు ఎంత మేరకు వ్యాపించిందన్నదానిపై పూర్తి వివరాలు అందలేదు.
కెర్చ్ జలసంధి వద్ద 2007లో వోల్గోనెఫ్ట్ -139 ఆయిల్ ట్యాంకర్ లంగరు వేసినప్పుడు తుఫాను కారణంగా సగానికి చీలిపోయి, 1,000 టన్నులకు పైగా చమురును చిమ్మింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)