తలసేమియా డే: ఈ వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఏమిటి? రోగులకు రక్తం ఎక్కిస్తూనే ఉండాలా?

    • రచయిత, డాక్టర్ ప్రతిభాలక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించేది మన రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్‌.

ఎర్రరక్త కణాల తయారీలో ఏదైనా లోపం జరిగి, అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోయి, త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి మనిషి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి ఒక సమస్యే తలసేమియా.

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ (సీడీసీ) లెక్కల ప్రకారం ప్రపంచంలో నాలుగున్నర శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా తలసేమియా బారినపడ్డారు.

తల్లిదండ్రుల్లో ఉండే జన్యుపరమైన లోపాల వల్లగానీ, జన్యువుల్లో వ్యత్యాసాల వల్లగానీ ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆటోసోమల్ (autosomal) పద్ధతిలో వారసత్వంగా కూడా వస్తుంది.

ఆల్ఫా తలసేమియా, బీటా తలసేమియా

తలసేమియా రెండు రకాలు.

  • ఆల్ఫా తలసేమియా
  • బీటా తలసేమియా

సాధారణంగా వయసుకు వచ్చిన వారి హీమోగ్లోబిన్‌లో నాలుగు ప్రోటీన్లు ఉండగా, వాటిలో రెండు α, రెండు β గ్లోబిన్ (globin) శ్రేణులు ఉంటాయి.

తలసేమియా రోగుల్లో α లేదా β గ్లోబిన్ (globin) శ్రేణులలో లోపం వల్ల అసాధారణంగా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి.

హీమోగ్లోబిన్‌లోని ఏ శ్రేణి ప్రభావితమైందనేదాన్ని బట్టి తలసేమియా వ్యాధిని విభజిస్తారు.

α గ్లోబిన్ (globin) శ్రేణి ప్రభావితమైతే దానిని α తలసేమియా అని, β గ్లోబిన్ శ్రేణి ప్రభావితమైతే దానిని β తలసేమియా అని అంటారు.

తీవ్రత ఆధారంగా తలసేమియాను మళ్లీ నాలుగు రకాలుగా వర్గీకరించారు.

తలసేమియా ట్రేట్ (trait): చాలా తక్కువ తీవ్రత ఉండే రకం ఇది. జీవిత కాలంలో అసలు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.

తలసేమియా మైనర్ (minor): స్వల్ప లక్షణాలు ఉంటాయి. పరీక్షలు చేస్తే రక్తహీనత ఉందని తెలియడం వల్ల ఈ వ్యాధి నిర్ధరణ జరగొచ్చు.

తలసేమియా ఇంటర్మీడియా (intermedia): రక్త హీనత లక్షణాలు కనిపించిన వారిలో ఈ వ్యాధి నిర్ధరణ అవ్వవచ్చు. రక్తం ఎక్కించే అవసరం కూడా రావొచ్చు.

తలసేమియా మేజర్ (major): తరచూ రక్తం ఎక్కిస్తూ ఉండాలి. లేదంటే ప్రాణాపాయం కలుగుతుంది. తరచూ రక్తం ఎక్కించడం వల్ల శరీరంలో ఐరన్ నిల్వలు పెరిగి, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.

తలసేమియా లక్షణాలు

  • కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉంటే వారికి పుట్టిన పిల్లలకు పరీక్ష చేస్తే ముందే గుర్తించగలం.
  • వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మూడు నెలల నుంచి 18 నెలల వయస్సు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది.
  • శరీర రంగు పాలిపోయినట్టుగా మారుతుంది.
  • శారీరక ఎదుగుదల ఉండదు.
  • ఎర్రరక్త కణాలు అధికంగా నాశనం అవ్వడం వల్ల, పచ్చ కామెర్లు కలుగవచ్చు.
  • రక్తహీనత వల్ల ఆయాసం, అలసట, నీరసం, శరీరంలో వాపులు రావడం, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • ఈ పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, లేక శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి.
  • వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారిలో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో లేదా గర్భం దాల్చినపుడు, కాన్పు తరవాత మాత్రమే గుర్తించే అవకాశం ఉంది.

తలసేమియాకు చికిత్స

తలసేమియా వ్యాధికి లక్షణాలను అనుసరించి, చికిత్స చేస్తారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తారు.

ఎముకల మూలుగలో ఉన్న కణాలను మార్పిడి చేసి, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి రక్తం ఎక్కించే అవసరాన్ని తగ్గించవచ్చు .

తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఎక్కువ కాబట్టి, వీరు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటూ, తరుచూ రోగాల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి.

తర్వాతి తరానికి రాకుండా ఏంచేయాలి?

తీవ్రమైన వ్యాధి ఉన్న పిల్లలకు లక్షణాలు మూడు నెలలు దాటినప్పటి నుంచే కనిపిస్తాయి.

రక్తహీనత ఉందని తెలిసినపుడు, దానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

సాధారణ రక్త పరీక్ష (CBP) లేదా హీమోగ్రాం చేసినప్పుడు అసాధారణంగా ఉన్న రక్తకణాలను గుర్తించవచ్చు.

హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫొరేసిస్ (Hb electrophoresis) పరీక్ష చేయడం వల్ల తలసేమియా వ్యాధి రకం, తీవ్రత తెలుస్తాయి.

జన్యు పరమైన పరీక్షలు చేసి, తరవాతి తరం వారికి ఈ సమస్య కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తలసేమియా వ్యాధి బాధిత కుటుంబాలు జన్యుపరమైన పరీక్షలు చేయించుకోవడం అవసరం. గర్భం దాల్చాలనుకొనేవారు తలసేమియా వ్యాధి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు.

భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తలసేమియా వ్యాధి గురించి చాలా అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి. వాటికి హాజరైతే అవగాహన పెరుగుతుంది.

తలసేమియా రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మనిషి రక్తం ఇస్తేనే మరో మనిషికి అందించడం సాధ్యమవుతుంది. అందువల్ల రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలి. ఆరోగ్యంగా ఉన్న మనిషి మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వొచ్చు.

ఇవి కూడా చూడండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)