You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసు: ఏపీ, తెలంగాణల్లో ఎమర్జెన్సీ మినహా మిగతా వైద్య సేవల నిలిపివేత
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
అత్యవసరం కాని ఆపరేషన్లు, ఔట్ పేషెంట్ల సేవలను ఒక రోజు పాటు నిలిపివేసి నిరసన తెలియజేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది.
ఐఎంఏ నిర్ణయంతో ఆంధ్ర, తెలంగాణల్లోని వైద్యులు అత్యవసరం కానీ సేవలను శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిలిపివేశారు.
అత్యవసర, క్యాజువాలిటీ వార్డులు మాత్రం పనిచేస్తున్నాయి.
తప్పనిసరిగా విధులకు హాజరయ్యే వైద్యులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు.
సమ్మెలో పాల్గొనలేని ఇతరాత్ర వైద్యులు గంట సేపు నిరసన తెలపాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లోని దాదాపు అన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఇవాళ సమ్మెను పాటిస్తున్నాయి.
హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించారు.
ఇక వైద్యులే కాకుండా వైద్య అనుబంధ వర్గాలైన నర్సుల సంఘాలు, వైద్య ప్రతినిధి సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయి.
అయితే, సమ్మె గురించి సమాచారం లేని పలువురు రోగులు ఆసుపత్రులకు వచ్చి వెనుదిరిగారు. ఆస్పత్రులకు వచ్చిన రోగుల్లో పరిస్థితి బాగులేని వారికి నిరసన తెలుపుతున్న వైద్యులు అక్కడే వైద్యం చేశారు.
గాంధీ, ఉస్మానియాలో పరిస్థితి ఎలా ఉంది?
గాంధీ, ఉస్మానియాల ఓపీ బ్లాకుల దగ్గర తక్కువ హడావుడి కనిపించింది.
అత్యవసర, కాజువాల్టీ, ఇన్ పేషెంట్ విధులకు హాజరైన వారు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు.
పలువురు తమ ఆసుపత్రుల దగ్గర గంట సేపు నిరసన తెలిపారు. వైద్య అనుబంధ రంగాల వారు ఈ సమ్మెకు మద్దతు పలికారు.
రోగుల ఇబ్బందులు..
ముంబయిలోని సియోన్ హాస్పిటల్‌లోని ఒక రోగి బంధువు వార్తాసంస్థ ఏఎన్ఐతో "మేం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వార్డులు మూసివేశారు. వైద్యుల సంఖ్య కూడా మునుపటి కంటే తక్కువగా ఉంది" అని అన్నారు.
పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాలలో కేసును సీబీఐకి అప్పగించారు. దర్యాప్తు సంస్థ విచారణ కూడా ప్రారంభించింది.
దీంతో పాటు, ఆగస్టు 16న కోల్‌కతాలో మహిళలతో మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు.
‘‘కోల్‌కతా ఘటన తర్వాత వేలాది మంది జనం ఆ ఆసుపత్రి మీద దాడి చేశారు. అక్కడ కనీస భద్రత లేదు. ఒక్కర్నీ ఆపలేకపోయారు పోలీసులు’’ అని బీబీసీతో అన్నారు పలువురు వైద్యులు.
దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు అరికట్టేలా కఠినమైన చట్టాన్ని తేవాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎంఎ డిమాండ్ చేసింది.
కోల్‌కతా ఘటనలో దోషులను పట్టుకుని తక్షణం శిక్షించాలని డిమాండ్ చేసింది.
ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత, సౌకర్యాల లేవని వైద్యులు ప్రస్తావించారు.
తక్షణ అదనపు పోలీసు బలగాలతో ఆసుపత్రుల్లో భద్రత కల్పించాలని వారు కోరారు.
ఈ విషయంగా గతంలోని జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే వరకు, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఐఎంఎ నాయకులు అన్నారు.
వైద్య సిబ్బంది భద్రత కోసం కమిటీ ఏర్పాటు : కేంద్ర ఆరోగ్య శాఖ
వైద్య సిబ్బంది భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తాము భద్రతా కమిటీ వేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్టు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర ప్రతినిధులందరూ ముందుకు వచ్చి కమిటీతో తమ సలహాలు, సూచనలు పంచుకోవాలని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన వైద్యులను డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతుండటంతో, ప్రజా ప్రయోజనం రీత్యా విధులకు హాజరు కావాలని కేంద్రం కోరింది.
అసలేం జరిగింది?
ఆగస్టు 9 ఉదయం కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైంది.
ఆమెపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఘటనలో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు కోల్‌కతాలో ట్రాఫిక్ పోలీస్ వలంటీర్. సంజయ్ రాయ్ మీద పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(అత్యాచారం) 103/1(హత్య) కింద కేసులు నమోదు చేశారు.
కేసును త్వరితగతిన పరిష్కరించాలని, వైద్యులకు భద్రత కల్పించాలని దేశవ్యాప్తంగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ద ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 12న ఆసుపత్రులలో కొన్ని నిర్దేశిత సేవల్ని నిలిపివేయాలని డాక్టర్లకు పిలుపునిచ్చింది.
ట్రైనీ వైద్యురాలి హత్యపై రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి.
వైద్యురాలి హత్యను అనాగరిక స్థాయి నేరంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభివర్ణించింది. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో దేశం మద్దతును కోరింది.
ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవల నిరాకరణకు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఐఎంఏ వైద్యుల భద్రత కోసం పలు డిమాండ్లను ముందుకు తీసుకొచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)