You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహేశ్ బాబుకు ఈడీ ఎందుకు నోటీసులు ఇచ్చింది?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
నటుడు మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టుగా పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థలపై ఇటీవల ఈడీ సోదాల నేపథ్యంలో మహేశ్ బాబు స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకే విచారణకు పిలిచినట్టుగా ఈడీ అధికారులు చెప్పారని పీటీఐ తన కథనంలో పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై మహేశ్ బాబు, సాయి సూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది.
సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు మహేశ్ బాబు కుటుంబం గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.
అసలేంటీ కేసు?
ఏప్రిల్ 16న ఈడీ హైదరాబాద్ జోన్ అధికారులు సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ, సురానా గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
ఈ సంస్థల్లో రూ.100 కోట్ల అనధికారిక లావాదేవీలు గుర్తించామని ఈడీ అధికారులు ఆ తరువాత ప్రకటించారు.
''లెక్కల్లోకి రాని రూ. 74.50 లక్షలను నరేంద్ర సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల నుంచి స్వాధీనం చేసుకున్నాం'' అని ఈడీ ప్రకటించింది.
సాయి సూర్య డెవలపర్స్ హైదరాబాద్‌లోని వెంగళరావునగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల సహా వివిధ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి స్థలాలు విక్రయిస్తోంది.
సురానా గ్రూప్‌లో భాగంగా ఉన్న భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కంపెనీతో కలిసి సాయి సూర్య డెవలపర్స్.. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్‌గా నరేంద్ర సురానా వ్యవహరిస్తుండగా.. సాయి సూర్య డెవలపర్స్ యజమానిగా కె.సతీష్ చంద్ర గుప్తా ఉన్నారు.
2024 నవంబరులో అనధికార లే అవుట్‌లు వేసి కస్టమర్ల నుంచి ఆయన రూ. కోటి 45 లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.
దీనిపై సైబరాబాద్ పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్‌కు అందిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసి, కె.సతీష్ చంద్ర గుప్తాను అరెస్టు చేశారు.
అంతకుముందు, 2021లో సాయి సూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందంటూ వారి వెంచర్లలో పెట్టుబడులు పెట్టిన నక్కా విష్ణు వర్దన్ అనే వ్యక్తితో పాటు మరికొంత మంది మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సాయి సూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్లో పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్లాట్లు తిరిగి ఇవ్వలేదని వారు చేసిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్), 2002 ప్రకారం ఏప్రిల్ 16న ఈడీ అధికారులు భాగ్యనగర్ ప్రాపర్టీస్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు ప్రకటించింది ఈడీ.
''అనధికార లే అవుట్లు వేయడం, ఒకే ప్లాటును వేర్వేరు వ్యక్తులకు విక్రయించడం, సరైన ఒప్పందాలు చేసుకోకుండా పేమెంట్లు తీసుకోవడం, ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు తప్పుడు హామీలు ఇవ్వడం వంటి అంశాలు మా విచారణలో బయటపడ్డాయి'' అని ఒక ప్రకటనలో చెప్పింది ఈడీ.
దీనివల్ల పెట్టుబడిదారులకు భారీ నష్టం వాటిల్లిందని, మిగిలిన సంస్థలకు అక్రమంగా నిధులను బదలాయించుకున్నారని ఈడీ ఆరోపించింది.
ఈ కేసులో భాగంగానే సాయి సూర్య డెవలపర్స్ తరఫున యాడ్‌లో నటించిన మహేశ్ బాబును ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు పీటీఐ కథనం పేర్కొంది.
విచారణకు హాజరవుతారా?
మహేశ్ బాబును విచారణలో భాగంగానే పిలిచినట్లుగా ఈడీ అధికారులు చెప్పారని పీటీఐ తెలిపింది.
ఏప్రిల్ 28న ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
దీనిపై మహేశ్ బాబు పీఆర్ టీమ్‌ను బీబీసీ సంప్రదించింది. వారి నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉంది.
ఈడీ ఆరోపణలపై సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులను ఈమెయిల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. వారి స్పందన కూడా రావాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)