అంకిత శ్రీవాస్తవ: తల్లికి మూడో వంతు కాలేయాన్ని దానం చేసినా, కోలుకొని క్రీడల్లో అంతర్జాతీయ పతకాలు సాధించిన యువతి

    • రచయిత, సమ్రా ఫాతిమా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“నేను కారులో వెళుతుండగా స్పీడ్ బ్రేకర్ వస్తే నా కాలేయం (లివర్) పైకి కిందికి వెళ్లేది. ఎడమవైపునున్న ఆ కాలేయం ఎడమ, కుడి వైపునకు కదులుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ చాలా ఖాళీ స్థలం ఉంది. నేను రాత్రికి వెల్లకిలా మాత్రమే పడుకుంటాను. అలాగే పడుకోవాలని నాకు సూచించారు''

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అథ్లెట్ అంకితా శ్రీవాస్తవ తన కథను వివరిస్తూ చెప్పిన మాటలివి.

అంకిత 18 ఏళ్ల వయస్సులో తన కాలేయంలో 74 శాతం తన తల్లికి దానం చేశారు. ఆ తర్వాత క్రీడా రంగాన్ని ఎంచుకుని అసాధారణ విజయాన్ని సాధించారు.

అంకిత అనేక స్టార్టప్ కంపెనీలకు యజమాని కూడా. అయితే ఇదంతా అంత సులువుగా ఏం జరగలేదు.

అంకిత పదమూడేళ్ల వయసులో ఉండగా ఆమె తల్లికి 'లివర్ సిర్రోసిస్' అనే వ్యాధి ఉందని, దీనికి మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు చెప్పారు.

అంకిత కాలేయం తన తల్లికి సరిపోతుందని తెలిసినపుడు, కాలేయం ఇస్తానని చెప్పడానికి ఒక సెకను కూడా సమయం తీసుకోలేదు ఆమె.

అయితే, అప్పటికి అంకితది చిన్న వయస్సు కాబట్టి, ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు వైద్యులు వేచి ఉన్నారు.

శస్త్రచికిత్స తర్వాత సమస్యలు

అంకితకు 18 ఏళ్లు వచ్చేలోగా మరొక దాత దొరకవచ్చని భావించారు, కానీ అది జరగలేదు.

శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్‌లోకి ప్రవేశించిన ఉత్సాహం, ఆ తర్వాత లేదని అంకిత చెప్పారు.

అప్పటి వరకు ఇండియాలో కాలేయ మార్పిడి గురించి ఎక్కువ సమాచారం లేదు. శస్త్రచికిత్స అనంతర పరిస్థితికి రోగిని మానసికంగా ఎలా సిద్ధం చేయాలో చాలా మందికి తెలియదు.

మార్పిడి తర్వాత అంకిత స్పృహలోకి వచ్చినప్పుడు, ఆమె శరీరం మొత్తం వివిధ రకాల చిన్న మెషీన్ వైర్లతో చుట్టి ఉంది.

అయితే, స్పృహలోకి వచ్చిన తర్వాత నొప్పితో ఇబ్బంది పడ్డారు అంకిత. తన చేతికి మార్ఫిన్ ఇంజక్షన్ ట్యూబ్ తగిలించారని ఆమె చెప్పారు.

కాలేయంలోని దాదాపు మూడొంతుల భాగాన్ని తొలగించడం వల్ల, కడుపు లోపల ఖాళీ స్థలం ఏర్పడింది. దీంతో అంకిత ఎక్కువగా కదలడానికి ఇబ్బంది పడేవారు.

అయినా తల్లి ప్రాణం నిలబడలేదు

"మార్పిడి చేసిన రెండు, మూడు నెలల్లోనే మా అమ్మ చనిపోయింది. నేను మానసికంగా, శారీరకంగా తట్టుకోవడం కష్టమైంది. ఎలా కూర్చోవాలి? ఎలా నిలబడాలి? ఎలా నడవాలి? ఇలా అన్నీ నేర్చుకున్నా" అని అంకిత తెలిపారు.

తల్లి మరణం తరువాత, తండ్రి దూరమయ్యారు. అక్కాచెల్లెళ్లిద్దరూ తాతయ్య, అమ్మమ్మల దగ్గరే పెరిగారు. దీంతో ఇంటి ఖర్చుల బాధ్యత కూడా వారిపైనే పడింది.

అంకిత స్విమ్మింగ్, ఫుట్‌బాల్ ఆటల్లో జాతీయ స్థాయి క్రీడాకారిణి.

మళ్లీ క్రీడల్లో పాల్గొంటానని ఎప్పుడూ అనుకోలేదని, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రీడాకారిణి అనే స్ఫూర్తి మాత్రం వదలలేదని అంకిత అన్నారు.

‘విజయానికి పట్టుదల కీలకం’

"నేను కోలుకోవడానికి ఏడాదిన్నర పట్టింది, ఆ తర్వాత వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ గురించి తెలుసుకున్నాను. నేను భారత జట్టుకు ఎంపికయ్యాను. ఆరోగ్యకరమైన వ్యక్తితో పోలిస్తే నాకది ఎంత కష్టమో అప్పుడు అర్థమైంది, కానీ విజయానికి పట్టుదల ముఖ్యం. మీరు అభిరుచితో ఏదైనా చేస్తే, విజయం సాధిస్తారు" అని అంకిత చెప్పారు.

ఓవైపు క్రీడలకు తిరిగి రావడానికి మళ్లీ శిక్షణ పొందుతూ మరోవైపు పని కూడా చేశారు అంకిత.

అంకిత ఉదయం కొన్ని గంటలపాటు శిక్షణ పొందుతారు. తర్వాత ఆఫీసుకు వెళతారు. అక్కడి నుంచి వచ్చాక మళ్లీ శిక్షణ తీసుకుంటానని ఆమె చెప్పారు.

కాలేయ దానం తర్వాత అంకిత 2019లో బ్రిటన్‌, 2023లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లలో లాంగ్ జంప్, త్రోబాల్‌ విభాగాల్లో 3 బంగారు, 3 రజత పతకాలను గెలుచుకున్నారు.

ఓ వైపు క్రీడలు మరోవైపు వ్యాపారం

అంకిత నేడు అంతర్జాతీయ క్రీడాకారిణే కాకుండా మోటివేషనల్ స్పీకర్, వ్యాపారవేత్త కూడా.

ఆమె మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో స్టార్టప్‌లను ప్రారంభించారు.

భవిష్యత్తులో మరిన్ని చేయాలనుకుంటున్నారు. కాలేయ దానం తర్వాత అంకిత జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి.

కాలేయం ఇచ్చినప్పటి నుంచి బర్గర్, పిజ్జా వంటి ఇంటి బయటి ఆహారం తినలేదని అంకిత చెప్పారు.

ఆమె స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడల్లా వెంట ఇంటి ఆహారం లేదా డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకువెళతారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవితంలోని విభిన్న అనుభవాలను ఆస్వాదించాలని అంకిత కోరుకుంటున్నారు.

వృత్తిపరమైన క్రీడలు, స్కై డైవింగ్, డీప్ సీ డైవింగ్ వంటి సాహస క్రీడలైనా అంకిత వెనకడుగు వేయకుండా చేస్తున్నారు.

‘‘మా అమ్మ డైరీలో ఎన్నో విషయాలు రాసేది. మా చెల్లెలి పెళ్లికి ఎవరెవరు అతిథులుగా వస్తారు? ఆఫీసులో ఏం జరిగింది? నేను చేయాల్సిన పనులు? నేను ఎవరిని కలవాలి మొదలైనవి. కానీ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది, ఆ డైరీ అలాగే ఉండిపోయింది" అని అంకిత చెప్పారు.

"నేను రోజూ ఉదయం నిద్రలేచి, చాలా మంది నిద్రలోనే చనిపోతున్నారు కదా? నేను ఈ రోజు ఉండటం నా అదృష్టం అనుకుంటా. చాలా మంది వారి కలలు సాధించలేకపోవచ్చు. రోజూ వీలైనన్ని అనుభవాలతో జీవించడానికి ప్రయత్నిస్తా. అందులో వైఫల్యాలు, విజయాలు ఉన్నాయి. జీవితంలో చాలా మంచి విషయాలు కూడా ఉన్నాయి" అని అన్నారు అంకిత.

‘ఇతరుల మాటలు వినడం అలవాటు చేసుకోవాలి’

జీవితం ఎవరికీ అంత సులభం కాదని, మనమందరం ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలని అంకిత సూచిస్తున్నారు.

"ఎవరైనా సమస్య గురించి మాట్లాడినప్పుడు, వారి సమస్య చిన్నదని, మీకు పెద్దది జరిగిందని చెప్పడం తప్పు" అని ఆమె చెప్పారు.

ఇతరుల మాటలు వినడం అలవాటు చేసుకోవాలని సూచించారు అంకిత. వైద్య రంగంలో ఆమె చాలా చేయాలనుకుంటున్నారు.

ఏ వ్యాధి వచ్చినా వైద్యం చేయించుకోవడం ప్రజలకు అంత కష్టమైన పని కాకూడదని అంకిత కోరుకుంటున్నారు.

"రేడియేషన్ కేంద్రాలను సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. దీంతో క్యాన్సర్ నిర్ధరణ, చికిత్స కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని ఆమె తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి వివరించారు.

తన తల్లి ప్రాణాలను కాపాడేందుకు మళ్లీ కాలేయాన్ని దానం చేయవలసి వచ్చినా తప్పకుండా చేసేదాన్నని చెప్పారు అంకిత.

కాలేయ మార్పిడి చేసినా తమ తల్లి ప్రాణాలను కాపాడలేకపోయానని, అయితే ఈ నిర్ణయం పట్ల చింతించడం లేదని ఆమె చెబుతున్నారు.

"వ్యాపారం చేస్తే క్రీడల్లో పాల్గొనలేనా ? కావాలంటే అన్నీ చేయగలను. ఇది నా ఫిలాసఫీ. జీవితం, నా ఈ ఆలోచన ద్వారా కొంత మంది అయినా కచ్చితంగా ప్రభావితమవుతారని ఆశిస్తున్నా" అని ముగించారు అంకిత.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)