ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక: 'నిరసనకారులను హతమార్చాలనుకుంటే అమెరికా రంగంలోకి దిగుతుంది'

    • రచయిత, జరోస్లావ్ లుకివ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే ''వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుంది'' అని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

''మేం అన్నీ సిద్ధం చేసుకుని, బయలుదేరడానికి రెడీగా ఉన్నాం'' అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ట్రంప్ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో ''జోక్యం చేసుకోవడమేనని'' పేర్కొంది. ''ఇలాంటి బాధ్యాతారాహిత్యమైన మాటలు ఇరాన్ విషయంలో అమెరికా ప్రదర్శిస్తున్న దౌర్జన్యపూరిత, చట్టవ్యతిరేక వైఖరికి కొనసాగింపు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ నిబంధనల మౌలిక నియమాల ఉల్లంఘన మాత్రమే కాదు. ఇరాన్ పౌరులకు వ్యతిరేకంగా హింసను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడమే'' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

ట్రంప్ హెచ్చరికపై అంతకుముందు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సీనియర్ సలహాదారు కూడా స్పందించారు.

ట్రంప్ జోక్యం చేసుకుంటే పశ్చిమాసియా అంతా అల్లకల్లోలమవుతుందని ''జాగ్రత్తగా ఉండాలని'' హెచ్చరించారు.

ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ఆగ్రహం

ఇరాన్‌లో దిగజారిన ఆర్థిక పరిస్థితులను నిరసిస్తూ దాదాపు వారం రోజులుగా జరుగుతున్న సామూహిక ఆందోళనల్లో ఎనిమిది మంది చనిపోయారు.

''శాంతియుత ఆందోళనకారులను ఇరాన్ తన అలవాటు ప్రకారం హింసాత్మకంగా కాల్చి చంపితే వారిని రక్షించడానికి అమెరికా వస్తుంది'' అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.

ఇరాన్ అధికారులకు వ్యతిరేకంగా వాషింగ్టన్ ఎలాంటి చర్య తీసుకుంటుందో ఆయన వెల్లడించలేదు.

ఇరాన్ అణుస్థావరాలపై నిరుడు జూన్‌లో అమెరికా దాడులు చేసింది.

ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌పై ఇరాన్ క్షిపణిదాడి జరిపింది.

ట్రంప్ సోషల్ మీడియా పోస్టు తర్వాత ఖమేనీ సలహాదారు అలీ లరిజానీ స్పందించారు.

''ఈ అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోవడం మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరిచి, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలి'' అని ఆయన పోస్టు చేశారు.

అమెరికా జోక్యాన్ని కోరుకుంటున్న కొందరు నిరసనకారులు

ఇరాన్‌లో అమెరికా జోక్యం చేసుకోవాలని ఆందోళనకారుల్లో కొందరు భావిస్తున్నారు.

''ట్రంప్, లేదా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమైనా మాట్లాడితే భద్రతా బలగాలు భయపడి వణికిపోతాయి''అని తెహ్రాన్‌లో ఆందోళన చేస్తున్న ఓ యువతి బీబీసీ న్యూస్ అవర్ ప్రోగ్రామ్‌తో చెప్పారు.

''ట్రంప్ ఏదైనా అన్నారంటే, అది చేస్తారని భద్రతాబలగాలు నమ్ముతాయని, ఏదైనా జరిగితే తాము పరిణామాలు ఎదుర్కోవాల్సిఉంటుంది'' అని వారికి తెలుసని ఆ యువతి చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. అమెరికా మద్దతివ్వాలని నిరసనకారులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారని ఆమె అన్నారు.

ఆదివారం ఆందోళనలు మొదలయిన దగ్గరి నుంచి ఇప్పటివరకూ 8 మంది చనిపోయినట్టు వార్తలొచ్చాయి.

మరణాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేకపోయింది.

‘‘ప్రాణాలు పణంగా పెట్టయినా సరే’’

కుహ్‌దాస్త్ నగరంలో భద్రతా దళాలకు చెందిన ఒకరు బుధవారం(డిసెంబరు 31)మరణించారని ఇరాన్ అధికారులు చెప్పారు. అయితే మరణించిన వ్యక్తి తమలో ఒకరని, భద్రతాబలగాలు ఆయన్ను కాల్చిచంపాయని నిరసనకారులు ఆరోపించారు.

ఆ వ్యక్తి అంత్యక్రియలకు వేలాదిమంది హాజరైన సమయంలో ఘర్షణలు చెలరేగినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి మృతదేహాన్ని ఉంచిన శవపేటికను తీసుకొచ్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకుని, వారిని వెంబడించారు.

బహిరంగ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ మరోసారి తగ్గడంపై ఆగ్రహిస్తూ ఆదివారం(డిసెంబరు 28) తెహ్రాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. తర్వాత ఇతర నగరాలకు విస్తరించాయి.

ఖమేనీ పాలన ముగియాలని చాలామంది నిరసనకారులు పిలుపునిస్తున్నారు. కొందరు రాచరిక పాలన తిరిగి రావాలని కోరుతున్నారు.

''మాకు ఇక్కడ ఎలాంటి స్వేచ్ఛ లేదు'' అని ఓ నిరసనకారుడు బీబీసీతో చెప్పారు. ''మేం నిత్యం పోరాడుతున్నాం. ప్రతిరోజూ క్రూరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. మా జీవితాలను పణంగా పెట్టైనా సరే ఈ పాలనకు ముగింపు పలకాలని అనుకుంటున్నాం. మేం కోల్పోవడానికి ఇక ఏమీ లేదు'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)