ఈఫిల్ టవర్ మూసివేత: హిందూ సంస్థ ప్రతినిధుల పర్యటన కోసం మహిళా ఉద్యోగులను తప్పించడంపై వివాదం

ఈఫిల్ టవర్

ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / AFP via Getty Images

    • రచయిత, డాన్ సేల్స్, మిమి స్వాబీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

హిందూ మతానికి చెందిన ఒక బృందం ఈఫిల్ టవర్ సందర్శనకు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తున్న మహిళలను విధుల నుంచి పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం ఈఫిల్ టవర్‌ మూసివేశారు.

బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(బీఎపీఎస్) బృందానికి చెందిన సుమారు 100 మంది ప్రతినిధుల బృందం శనివారం ఫ్రాన్స్ రాజధానిలోని ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించింది.

వారు ఆ కట్టడం వద్దకు చేరుకున్నాక, అక్కడ విధుల్లో ఉన్న మహిళలను పక్కకు వెళ్లాల్సిందిగా కోరారని స్టాఫ్ యూనియన్ ప్రతినిధి డయాన్ డావోయిన్ తెలిపారు.

"ఈ ప్రతినిధి బృందం పర్యటన సమయంలో మహిళా ఉద్యోగులను తమ పని ప్రదేశాలను వదిలి వెళ్లాల్సిందిగా కోరారు. వారి స్థానాల్లో పురుషులను నియమించారు" అని ఆమె రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ ఘటనపై యాజమాన్యం కార్మికులకు క్షమాపణలు చెప్పిందని కూడా డావోయిన్ తెలిపారు. "జరిగిన సంఘటన కొందరు ప్రవర్తించిన తీరు వల్ల మహిళలు సహా ఉద్యోగులందరూ తీవ్ర అవమానంగా భావించారు. ఇది వారికి ఏమాత్రం నచ్చలేదు" అని డావోయిన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ, ఈఫిల్ టవర్, పారిస్

ఫొటో సోర్స్, Reuters

"వారాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ ఉదయం ఉద్యోగులు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మొదట యాజమాన్యంతో చర్చలు జరపడానికి.. రెండోది కంపెనీలో మహిళల పట్ల ఇలా వివక్ష పూరితంగా ప్రవర్తించకుండా ఉండటానికి" అని డావోయిన్ వివరించారు.

పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను 'సొసైటీ డి ఎక్స్‌ప్లాయిటేషన్ డి లా టూర్ ఈఫిల్' (ఎస్ఈటీఈ) నిర్వహిస్తోంది. బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ బృందం తాము పర్యటించే సమయంలో "మహిళలతో మాట్లాడాల్సిన పరిస్థితులు" రాకుండా చేయాలని కోరినట్లు ధృవీకరించిందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది.

ఇలాంటి నిబంధనలను అంగీకరించి ఉండకూడదని ఏఎఫ్‌పీతో ఎస్ఈటీఈ చెప్పింది. ఇవి "ఎస్ఈటీఈ విలువలకే కాకుండా పురుషులు మహిళల మధ్య సమానత్వ సూత్రాలకు కూడా విరుద్ధం" అని సంస్థ అంగీకరించింది.

బోచాసనవాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ, ఈఫిల్ టవర్, పారిస్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సిబ్బంది సమ్మెకు దిగడంతో ఈఫిల్‌ టవర్‌ను సోమవారం మూసివేశారు

ఎస్ఈటీఈ అధ్యక్షుడు ఏరియల్ వెయిల్ "ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన పద్ధతి కాదు. రిపబ్లికన్ విలువలకు, పురుషులు-మహిళల సమానత్వానికి ఈఫిల్ టవర్ కట్టుబడి ఉంటుందని నేను పునరుద్ఘాటిస్తున్నా" అన్నారు.

ఈ విషయమై స్పందన కోసం బీబీసీ యూనియన్ కాన్ఫెడరేషన్ జనరల్ డు ట్రావైల్‌ను సంప్రదించింది. బీఏపీఎస్ ఆదివారం నాడు పారిస్ శివారు ప్రాంతంలో, ఫ్రాన్స్‌లోనే తమ మొట్టమొదటి పెద్ద ఆలయాన్ని ప్రతిష్టించింది.

ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో పారిస్‌లోని బీఏపీఎస్ ఆలయ నిర్వాహకులు తమ పర్యటన గురించి స్పందిస్తూ "ఇతరులకు ఎలాంటి అసౌకర్యం లేదా అంతరాయం కలగకుండా ఉండటం కోసం సాధారణ ప్రారంభ సమయానికి ముందే ఈఫిల్ టవర్ బృందంతో కలిసి ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నాం" అని తెలిపారు.

"దీనివల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగి ఉంటే మేము క్షమాపణలు కోరుతున్నాము. పరస్పర గౌరవం, సేవ అనే సార్వత్రిక విలువలను మేము నమ్ముతాం" అని వారు పేర్కొన్నారు.

బీఏపీఎస్ తనను తాను హిందూ విలువల ద్వారా ‘‘సమాజానికి అంకితమైన ఒక ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సేవా సంస్థ’’గా అభివర్ణించుకుంది.

లండన్, లాస్ ఏంజిల్స్, సిడ్నీ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో దీనికి ఆలయాలు ఉన్నాయి.

ఈ పర్యటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతుందని పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ తెలిపారు.

"ఈఫిల్ టవర్ ఉద్యోగుల ఆగ్రహాన్ని నేను గమనించా. వారి అసంతృప్తి పూర్తిగా సమర్థనీయమైనదని నేను వారికి చెప్పాలనుకుంటున్నా. మహిళలు, పురుషుల మధ్య సమానత్వం అనేది మన చారిత్రాక కట్టడాల వద్ద గానీ ఈ నగరంలో మరెక్కడైనా గానీ ఆగకూడదు. ఇది అందరికీ ప్రతిచోటా వర్తించాలి" అని ఆయన ఎక్స్‌లో రాశారు.

‘‘ఫ్రాన్స్‌లో మహిళల ఉనికిని 'పరిమితం' చేయడాన్ని మేము ఎప్పటికీ అంగీకరించము’’ అని ఫ్రెంచ్ హార్డ్-రైట్ నాయకురాలు మెరైన్ లీ పెన్ అన్నారు.

"ఫ్రాన్స్‌లో ఏ సంస్కృతి, ఏ నమ్మకం, ఏ ఆరాధన, ఏదీ లేదా ఎవరూ కూడా మహిళలకు వారి స్థానాన్ని నిర్దేశించలేరు" అని వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ఫ్రాన్స్ మాజీ ప్రధాని గాబ్రియేల్ అట్టల్ స్పష్టం చేశారు.

"విదేశీ సందర్శకుల కోరికలను నెరవేర్చడం కోసం మహిళలు పక్కకు తప్పుకోవలసి రావడాన్ని నేను ఒప్పుకోను" అని ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాల్ బ్రాన్-పివెట్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)