You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చిన్నప్పుడు బామ్మ స్నానం చేయించే ఫోటోను సేవ్ చేసుకున్నందుకు గూగుల్ అకౌంటే బ్లాక్ చేసింది, అసలేంటి కేసు?
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ కోసం
‘‘చిన్నప్పుడు మా బామ్మ నాకు స్నానం చేయించే ఫోటోపై గూగుల్‌కు అభ్యంతరం ఏంటి? నా చిన్ననాటి ఫోటోను కారణంగా చూపుతూ గూగుల్ నా అకౌంట్‌నే బ్లాక్ చేసింది’’ అని అహ్మదాబాద్‌కు చెందిన 26 ఏళ్ల నీల్ శుక్లా వాపోయారు.
తన చిన్ననాటి ఫోటో విషయంపై గూగుల్ సంస్థకు వ్యతిరేకంగా ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
నీల్ శుక్లా ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ఇంజనీర్.
చిన్నప్పుడు తన బామ్మ స్నానం చేయిస్తున్న ఫోటోను గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసుకున్నారు. అయితే, ఈ ఫోటో కారణంగా ఆయన అకౌంట్‌ను గూగుల్ బ్లాక్ చేసింది.
గూగుల్ చర్యను సవాల్ చేస్తూ నీల్ శుక్లా గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు.
తనకు చెందిన ప్రొఫెషనల్ డేటా, వ్యక్తిగత సమాచారం, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ల డేటా కలిగిన ఈమెయిల్స్‌ను, గూగుల్ పే(యూపీఐ) వంటి ఆర్థిక సమాచారాన్ని తొలగిస్తామని కూడా గూగుల్ నుంచి తనకు మెసేజ్ వచ్చినట్లు ఆయన చెప్పారు.
తన సమస్య గురించి గూగుల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, గుజరాత్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్, గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా నీల్ శుక్లా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయినా పరిష్కారం లభించకపోవడంతో గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున నిర్దిష్ట ప్రశ్నలకు ప్రస్తుతం తాము సమాధానం చెప్పలేమని గూగుల్ బీబీసీకి తెలిపింది.
ఈ సందర్భంగా గూగుల్ పాలసీ అండ్ ప్రొగ్రామ్‌కు చెందిన చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్(సీఎస్ఏఎం) కంటెంట్‌ను కంపెనీ ఉటంకించింది.
పిల్లలకు చెందిన సెక్సువల్ కంటెంట్ లేదా సీఎస్ఏఎం కనిపిస్తే వెంటనే దాన్ని తొలగిస్తామని, అకౌంట్ కూడా టర్మినేట్ చేసే అవకాశం ఉంటుందని గూగుల్ చెప్పింది.
ఈ కేసు ఎందుకంత చర్చనీయాంశమైంది?
దేశంలో లక్షల మంది ప్రజలు, వేల కంపెనీలు తమ అకౌంట్ల ద్వారా గూగుల్ సేవలను వాడుతున్నందున్న ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఇలాంటి సమస్యలకు హైకోర్టులో కేసు దాఖలు చేసే అవగాహన, సౌకర్యం ఉంటుందని చాలా మందికి తెలియదు.
గూగుల్ ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తుంది. కానీ, కొన్నింటి కోసం కంపెనీలు, ప్రజలు గూగుల్‌కు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
‘‘ఇది కేవలం ఒక కస్టమర్‌కు, కంపెనీకి మధ్యలో సంఘర్షణ మాత్రమే కాదు. లక్షల మంది గోప్యతా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణపై చట్టాన్ని రక్షించాలని కోరుతూ వేసిన కేసు ఇది’’ అని నీల్ తండ్రి సమీర్ శుక్లా తెలిపారు.
‘‘గూగుల్, ఆ కంపెనీ ఉద్యోగులు.. మీకు తెలియకుండానే, మీ అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారం, ప్రైవేట్ డేటాను సేకరిస్తున్నారు. వివరణ ఇచ్చేందుకు సరైన అవకాశం ఇవ్వకుండానే అకౌంట్‌ను తొలగిస్తున్నారు. దీని వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. మానసిక ఒత్తిడి కలుగుతుంది. మీ సోషల్ ఇమేజ్‌పై పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది’’ అని నీల్, ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు.
తన అకౌంట్‌ను డిలీట్ చేయకుండా గూగుల్‌ను అడ్డుకోవాలని కోరుతూ నీల్ శుక్లా హైకోర్టులో కేసు వేశారు.
నీల్ శుక్లా అకౌంట్ డిలీట్ చేయకుండా ఆపాలని కోరుతూ గూగుల్‌కు పంపిన లీగల్ నోటీసుపై ఈ కంపెనీ స్పందించలేదు.
అంతేకాక, 2024 ఏప్రిల్ 2న హైకోర్టులో జరిగిన విచారణకు కూడా గూగుల్ తరఫున న్యాయవాది ఎవరూ లేరు. ఆయన అకౌంట్‌ను ఏప్రిల్ 5న శాశ్వతంగా తొలగిస్తామని గూగుల్ నీల్ శుక్లాకు తెలిపింది.
అయితే, గుజరాత్ హైకోర్టులోని జస్టిస్ వైభవి నానవతి ఈ కేసులో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నీల్ శుక్లా అకౌంట్ డిలీట్ చేసే విషయంపై గూగుల్ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారా?
‘‘చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు స్నానం చేయించే ఫోటోపై గూగుల్ ఎందుంత పట్టించుకోవాలి? ఆ చిన్ననాటి ఫోటోను తీసుకుని గూగుల్ నా అకౌంట్‌నే బ్లాక్ చేసింది. గూగుల్‌కు అనుసంధానమైన నా అన్ని సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ అయ్యాయి. అన్ని వ్యాపార లావాదేవీలు, పొదుపు ఖాతాలు, ఆ అకౌంట్‌తో అనుసంధానమైన పెట్టుబడుల డేటా అంతా పోయింది’’ అని నీల్ శుక్లా వాపోయారు.
‘‘గూగుల్ నిరంకుశత్వానికి నాలాగా మరెవరూ బాధితులుగా మారొద్దని గుజరాత్ హైకోర్టులో నేను కేసు దాఖలు చేశాను’’ అని చెప్పారు.
ఐసీటీ ఇంజనీరింగ్ చదువుకున్న నీల్ శుక్లా, ఐటీ రంగంలో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు పలు కోర్సుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు.
‘‘2013 నుంచి ఈ గూగుల్ అకౌంట్ ఉంది. చదువులు అయిపోయాక నేను వ్యాపారం ప్రారంభించా. ఈ అకౌంట్ ద్వారానే మార్కెటింగ్, ప్రమోషన్ చేపడతాను. సాఫ్ట్‌వేర్ రంగంలో సరికొత్తగా వస్తున్న అభివృద్ధిపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేందుకు ఈ అకౌంట్ ద్వారానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పలు కోర్సులు నేర్చుకున్నా. సోషల్ మీడియాలో నా ప్రాజెక్టులన్ని ఉంచాను. ఆన్‌లైన్ కోర్సులకు చెందిన సర్టిఫికేట్లు ఈమెయిల్ ద్వారా నా ఈ గూగుల్ అకౌంట్‌కే వచ్చాయి’’ అని చెప్పారు.
‘‘నా ఈమెయిల్ అకౌంట్‌లోనే అన్ని ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, క్లయిట్స్‌తో జరిపే వ్యాపార ఈమెయిల్ సంభాషణలు అన్ని ఈ అకౌంట్‌లోనే ఉన్నాయి. దీన్ని గూగుల్ బ్లాక్ చేసింది. నా క్లయిట్స్ ఈమెయిల్ చేస్తుంటారు. కానీ, నేను వాటిని చూడలేకపోతున్నా’’ అని నీల్ శుక్లా తెలిపారు.
అలాగే తన డేటా స్టోరేజ్ కోసం నీల్ 2టీబీ డేటా స్పేస్‌ను కూడా గూగుల్ నుంచి కొనుగోలు చేశారు.
‘‘మా కుటుంబానికి చెందిన చాలా ఫోటోలు ఉన్నాయి. వాటిని డిజిటైజ్ చేసి, ఆన్‌లైన్ డ్రైవ్‌లో స్టోర్ చేయాలనుకున్నా. హార్డ్ డిస్క్‌లలో కూడా వైరస్‌లు వస్తున్నాయి. కరెప్ట్ అవుతున్నాయి. వందల ఫోటోలలో, నా చిన్నతనంలో నాన్నమ్మ స్నానం చేయించిన ఫోటో కూడా ఉంది’’ అని తెలిపారు.
నీల్ తన గూగుల్ అకౌంట్‌లో ఆ ఫోటోను అప్‌లోడ్ చేసిన కొద్ది సేపటికే 2023 మే 11న గూగుల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అకౌంట్ బ్లాక్ చేస్తున్న సమాచారాన్ని తెలియజేశారు.
నీల్ తమ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు గూగుల్ ఆ మెసేజ్‌లో పేర్కొంది.
గూగుల్‌పై ఉన్న ఆరోపణలేంటి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొగ్రామ్ ద్వారా గూగుల్ తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించిందని నీల్ శుక్లా హైకోర్టులో ఆరోపించారు.
ఐదు విధానాల్లో తన హక్కులను గూగుల్ ఉల్లంఘించిందని నీల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
- తన వైపు వాదన వినకుండానే గూగుల్ నా అకౌంట్‌ను బ్లాక్ చేసింది.
- మనుషులు కాకుండా పూర్తిగా టెక్నాలజీ ద్వారానే నా హక్కులను ఉల్లంఘించే నిర్ణయం తీసుకుంది.
- గూగుల్ సర్వీసు నిబంధనలకు సపోర్టు చేసే సీఎస్ఏఎం(పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను గుర్తించేందుకు గూగుల్ వాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొగ్రామ్) అనుచితమైంది. విఘాతం కలిగిస్తుంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరిపై సీఎస్ఏఎం నిర్ణయాలు ప్రభావితం చూపుతున్నప్పటికీ, వివిధ జాతులకు చెందిన ప్రజల విషయంలో వివక్షాపూరితంగా, తప్పుడుగా ప్రవర్తించే విధంగా ఆ ప్రొగ్రామ్‌కు శిక్షణ ఇచ్చారు.
- పిల్లల శరీరాన్ని చూపించే ప్రతి మెటీరియల్‌ను పిల్లల హక్కుల ఉల్లంఘనగా పరిగణించేలా సీఎస్ఏఎంకు శిక్షణ ఇచ్చారు.
గూగుల్ నిబంధనల ప్రకారం స్టోరేజ్ నుంచి ఆ ఫోటోలను తొలగిద్దామన్నా కూడా తనకు తొలగించే ఆప్షన్ లేదన్నారు నీల్.
సీఎస్ఏఎం ప్రొగ్రామ్ గురించి గూగుల్ ఏం చెప్పింది?
గుజరాత్ హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉన్నందున పలు నిర్దిష్ట ప్రశ్నలకు తాము సమాధానం చెప్పలేమని గూగుల్ బీబీసీకి చెప్పింది.
కానీ, సీఎస్ఏఎం కంటెంట్‌కు సంబంధించిన తమ పాలసీలు, ప్రొగ్రామ్‌ల గురించి తెలుపగలమని పేర్కొంది.
‘‘ చట్టవిరుద్ధమైన పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్‌ను మా ఏ ప్లాట్‌ఫామ్‌పై పంపిణీ కాకుండా నిరోధిస్తాం. ఈ వేధింపుల నుంచి పిల్లల్ని సంరక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని గూగుల్ బీబీసీకి తెలిపింది.
సీఎస్ఏఎం లేదా పిల్లలు ఉన్న లైంగిక కంటెంట్‌ను గుర్తిస్తే, వెంటనే దాన్ని తొలగిస్తాం, ఆ అకౌంట్‌ను టర్మినేట్ చేస్తామని చెప్పింది.
ఈ విషయంలో తాము చాలా జాగ్రత్తగా వహిస్తామని పేర్కొంది.
ఇలాంటి కంటెంట్‌ను వేగంగా గుర్తించి, అప్‌లోడ్ అయిన కంటెంట్‌ను తొలగించేందుకు తాము ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేశామని, అది సీఎస్ఏఎం కంటెంట్ నిర్వచనాన్ని అందుకుంటుందని తెలిపింది.
సీఎస్ఏఎం కంటెంట్ గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హాష్ మ్యాచింగ్ టెక్నాలజీని వాడుతున్నట్లు చెప్పింది.
కేంద్ర ఐటీ చట్టం ఏం చెబుతోంది?
అంతకుముందు ఐటీ చట్టం చాప్టర్ 9లో 43, 43(ఏ) సెక్షన్లు ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఒక అధికారి చెప్పారు. సెక్షన్ 43(ఏ) కింద ఈ విషయంలో పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి సమాధానం కోరవచ్చన్నారు.
కానీ, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023(డీపీడీపీ యాక్ట్, 2023) వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలోని సెక్షన్ 43(ఏ)ను తొలగించిందని చెప్పారు. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకుంటారో సరైన స్పష్టత లేదన్నారు.
‘‘ఐటీ చట్టాన్ని సవరించి, సెక్షన్ 43(ఏ)ను తొలగించిందన్నది నిజమే. కానీ, డీపీడీపీ యాక్ట్ 2023ను ఇంకా అమలు చేయాల్సి ఉంది. అంటే, ఐటీ చట్టం కిందనున్న సెక్షన్ 43(ఏ) లెజిస్టేటివ్ ప్రాసెస్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. అంటే అందుబాటులో ఉన్నట్లే లెక్క. దీన్ని వాడుకోవచ్చు’’ అని సైబర్ చట్టాల నిపుణులు, సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ పవన్ దుగ్గల్ అన్నారు.
ఈ విషయంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ అప్పీలెట్ ట్రిబ్యునల్‌ను, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి హైకోర్టు నోటీసులు పంపిందని నీల్ శుక్లా న్యాయవాది దీపెన్ దేశాయ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)